అమెరికా ఉక్కుపాదం
పెట్టుబడిదారీ విధాన అభివృద్ధితో పాటు దానిని కూలదోసే కార్మికవర్గాన్ని కూడా దోపిడీదారులే తయారు చేశారు. బూటకపు స్వేచ్ఛా స్వాతంత్య్రం గురించి ప్రపంచానికి ఊదరగొట్టిన అమెరికా వంటి ధనిక దేశాలకు ఆ వ్యవస్థ సృష్టించిన వారే ఇప్పుడు నిదరలేకుండా చేస్తున్నారు. గూగుల్ కంపెనీ విడుదల చేసే సమాచారం తమ సెన్సారు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చెప్పినందుకు చైనాను అమెరికన్లు నిరంకుశ, ఇనుపతెరల రాజ్యంగా వర్ణించారు. చైనా వంటి దేశాలపై తాను ప్రధానంగా సెన్సార్‌లేని ఇంటర్నెట్ వ్యవస్థ గురించే వత్తిడి తెస్తానని అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆమెగారే ప్రభుత్వ శాఖలతో పాటు విశ్వవిద్యాలయాల ద్వారా బెదిరింపులకు దిగారు. పచ్చినిరంకుశ ఉత్తరువులు జారీ చేయిస్తున్నారు. వికీలీక్స్ విడుదల చేసిన సమాచారం ప్రభుత్వం ప్రకటించే వరకు రహస్యమేనట. దానిని విద్యార్దులెవరైనా చదివి వాటిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలకు అనర్హులను చేస్తారట. అదే కార్మికులు, ఉద్యోగులైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తారట.
అమెరికా ప్రభుత్వం నేడు జారీ చేస్తున్న నిరంకుశ ఆదేశాలు, ఉత్తరువులు గతంలో భారత్‌లో బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చర్యలను తలపింపజేస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందు కమ్యూనిస్టుపార్టీనే కాదు, దోపిడీ వ్యవస్థను వ్యతిరేకించే, సోషలిజాన్ని పరోక్షంగా సమర్థించిన 'మాలపిల్ల' వంటి ప్రఖ్యాతనవలను, భూసమస్యను ముందుకు తెచ్చిన భూస్వాములకు వెన్నులో చలిపుట్టించిన 'మా భూమి' నాటకాన్ని బ్రిటీష్ సర్కార్ ఆనాడు నిషేధించింది. విదేశాల నుంచి ఎవరైనా కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెచ్చినా, ఎవరిచేతుల్లో అయినా ఉంటే వారిని అరెస్టు చేసేది. ఇప్పుడు వికీలీక్స్ విడుదల చేసిన పత్రాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమెరికా సర్కార్‌ను, దోపిడీ వ్యవస్థను కూలదోసేందుకు ప్రేరేపించినట్లు లేవు. నిజానికి ప్రపంచంలో ఎవరు అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు, ఎవరు అమెరికా కంపెనీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అలాంటి వారిని ఎలా దెబ్బతీయాలి వంటి దుష్టఆలోచనలు, సలహాలు, పథకాలను సూచిస్తూ ప్రపంచమంతటినుంచి అమెరికన్ రాయబారులు, వారి తైనాతీలు సహకరించేవారు పంపిన సమాచార పత్రాలవి. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చడానికి ఇచ్చిన సలహాలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా ఇతర దేశాలకు వ్యతిరేకంగా జరుపుతున్న కుట్రలు, అందుకు ఎవరెవరితో చేతులు కలిపిందీ, ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిందీ అనే సమాచారం రాతపూర్వకంగా ఉన్న సాక్ష్యాలవి. అమెరికా, దాని మిత్ర దేశాల అసలు రంగు ప్రపంచానికి తెలిపిన కారణంగానే వికీలీక్స్‌పై అవి మండిపడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌పై జరుపుతున్న దాడుల సమర్థనకు తమ స్వంత పౌరులను ఎలా మభ్యపుచ్చుతున్నదీ, అసలు నిజాలేమిటీ అన్న అంశాలు కూడా ఆ పత్రాల్లో ఉన్నాయి. అందుకే అమెరికన్లు వాటిని చదవకూడదని ప్రభుత్వం నిరంకుశ ఆదేశాలు జారీ చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు.
ప్రభుత్వ తీరుతెన్నులు ఇలా ఉంటే తమకు ఎవరన్నా లెక్కలేదు, ఎవరినైనా, ఏమైనా అంటాం, ఎలాంటి సమాచారాన్నాయినా లోకానికి వెల్లడిస్తాం అని భుజకీర్తులు తగిలించుకున్న 'ట్విటర్, ఫేస్‌బుక్' సంస్థల బండారం కూడా బయట పడింది. వికీలీక్స్ వెబ్‌సైట్‌ను అమెరికా ప్రభుత్వ సంస్థలేవీ అడ్డుకోలేదు. దానికి సర్వర్లను సమకూర్చిన అమెజాన్ కంపెనీపై వత్తిడి తెచ్చి అమెరికా ప్రభుత్వం అడ్డుకుంది. పేపాల్, విసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థల ద్వారా వికీలీక్స్‌కు విరాళాలు, ఇతర రూపాలలో డబ్బు బదలాయింపు జరగకుండా వాటిపై వత్తిడి తెచ్చి నిలుపు చేయించింది. ఇంతకంటే నిరంకుశ, అణచివేత చర్యలేముంటాయి.
అయితే ఎక్కడ ఈ దుర్మార్గాలు జరుగుతాయో అక్కడే ప్రతిఘటన కూడా ఉంటుంది. వికీలీక్స్‌ను అడ్డుకొనే సంస్థల వెబ్‌సైట్లపై అసాంజే అభిమానుల దాడులు దీనినే సూచిస్తున్నాయి. తనకు నచ్చని ఇతర దేశాల వెబ్‌సైట్లపై ఇలాంటి దాడులు చేయించటంలో అమెరికన్ల తరువాతే ఎవరైనా ఇప్పుడు అలాంటి వారికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ప్రతిఘటన ఎదురవుతోంది. అది ఒక ప్రయివేటు సంస్థలకే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటు వాటిపై వత్తిడి తెస్తున్న ప్రభుత్వ సైట్లపై కూడా తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడుంటాన్నట్లు హాకర్లు దాడి చేసేందుకు సిద్ధమౌతున్నారు. తన సిఐఏ కనుసన్నలలో పనిచేసే ఒక మహిళతో కండోమ్ లేకుండా శృంగారంలో అసాంజే పాల్గొన్నాడనే గడ్డిపోచవంటి కేసును స్వీడన్‌లో దాఖలు చేయించి, బ్రిటన్‌లో అరెస్టు చేయించింది తప్ప, తన కంతలను పూడ్చుకోలేని అమెరికా సర్కార్ అతనిపై ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలాంటి కేసు నమోదు చేయలేని బలహీన స్థితిలో ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం పెరుగుతున్నకొద్దీ ఇలాంటి తప్పుడు వ్యవహారాలు మరింతగా వెలుగులోకి రావటం అనివార్యం. అమెరికా రాయబార, విదేశాంగశాఖ కార్యాలయాల అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా టన్నులకొద్దీ రహస్య పత్రాలను ఒక వ్యక్తిగా అసాంజే బయటకు తీసుకురావటం అసాధ్యమైన అంశం. ఒక వేళ తనను అరెస్టు చేసినా తమ వద్ద ఇంకా ఉన్న పత్రాలను బయటపెడతామని ఆసాంజే చేసిన ప్రకటన నేపథ్యంలో అమెరికా ఇంత నిరంకుశంగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment