మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాఫ్ట్వేర్ తోడ్పాటు
హైదరాబాద్‌లో 'స్వేఛ్చ' సంస్థ ఆధ్వర్యంలో 'ఫ్రీ సాప్ట్‌వేర్ అండ్ ది న్యూ మీడియా' అనే అంశంపై సదస్సు జరిగింది. తన వ్యాపార రహస్యాలను బయటపెట్టరాదని కోరుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2జి స్పెక్ట్రంలో అవినీతి పూర్తిగా బయటకు రావాలంటే మిగతా ఐదు వేల టేపులను కూడా బహిరంగపర్చాలని సదస్సు డిమాండ్ చేసింది. సదస్సులో ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ మాట్లాడుతూ నూతన మీడియాలో దుర్వినియోగాన్ని నివారించాలని, మీడియాలో ప్రజా సమస్యలపై ప్రత్యేక స్థానం ఉండాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో మీడియా తప్పుదోవ పడితే ప్రజలే నెట్ జర్నలిజం ద్వారా మీడియాకు బుద్ధి చెప్పాలని సూచించారు. 2జి స్పెక్ట్రం అవినీతిపై రాజా రాజీనామా అనంతరం వారం వరకూ మీడియా ఆ అంశాన్ని చర్చకు పెట్టలేదన్నారు. ఇంటర్‌నెట్ పరిజ్ఞానాన్ని వ్యాపార, విదేశీ వ్యవహరాల కోసం మాత్రమే కాకుండా, ప్రజా ప్రయోజనాలు కోరుకునే వారు విస్తృతంగా ఉపయోగించాలని నాగేశ్వర్ అన్నారు.
ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగపడే ఏ సమాచారమైనా రహస్యం కాదన్నారు. ఉత్పత్తి సాధనాలపై కార్పొరేట్ రంగం ఆధిపత్యం ఉన్నంతకాలం ప్రజల భావాలపై దాని ప్రభావం ఉంటుందన్నారు. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ దేశ సంపదను దోచుకునే కుట్రలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ విధానాలను రహస్యంగా ఉంచడం వల్ల దేశానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రజాప్రతినిధులు నడుపుతున్న ప్రతి వ్యవహరాన్నీ బహిరంగ పర్చాలన్నారు. కార్పొరేట్ వ్యాపారవేత్తలు సహజ సంపదతో పాటు వాయు తరంగాలను సైతం పంచుకోవడానికి రాజ్యాంగంలోని నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. స్పెక్ట్రం కేటాయింపుల్లో జరిగిన అవినీతి బయటకు రావాలంటే ఇంకా 5 వేల టేపులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ టేపులను బహిరంగపర్చడానికి మీడియా కృషి చేయాలని కోరారు. కాపీరైట్‌ను ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని వ్యతిరేకించ కూడదన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులను ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ఉపయోగించు కోవడంలో జవాబుదారితనంగా వ్యవహరించాలని కోరారు.
ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఐ ప్రధాన కార్యదర్శి కిరణ్‌చంద్ర మాట్లాడుతూ ఫ్రీ సాప్ట్‌వేర్ అండ్ న్యూ మీడియా ఆధ్వర్యంలో 'నేషనల్ కన్వెన్షన్ ఫర్ ఎకడమిక్ అండ్ రిసెర్చ్'పై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సు ఈ నెల 16 నుండి 18 వరకు హైదరాబాద్‌లో జరుగుతుందని, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌కలాం సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను ఎమ్మెల్సీ నాగేశ్వర్ సదస్సులో విడుదల చేశారు. స్వేఛ్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌ఎస్ అర్జున్ సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సుకు వర్కింగ్ జర్నలిస్టులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment