అమెరికాలో తలెత్తుతున్న పచ్చి మితవాదం
- ఆర్. అరుణ్ కుమార్
అమెరికన్ సెనెట్‌కూ, ప్రతినిధుల సభకూ జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడు ఒబామాకు గట్టిదెబ్బే తగిలింది. సమాజంలో మార్పులు తెస్తానని వాగ్దానం చేయటం ద్వారా ప్రజలలో అనేక ఆశలు పెంచి రెండేళ్ళ క్రితం అధ్యక్ష పదవికి ఒబామా ఎన్నికయ్యాడు. దేశవ్యాప్తంగా బలంగా వీచిన బుష్ వ్యతిరేక గాలులు అప్పటిలో ఆయనకు విజయాన్ని సాధించిపెట్టాయి. ఆయన విజయాన్ని 'అభ్యుదయకర మార్పు' అంటూ ఆనాడు సరిగ్గానే భావించారు. కాగా, ఈనాడు డెమొక్రాట్ల ఓటమిని 'ప్రమాదకరమైన మార్పు'గా చూడాల్సి ఉంటుంది. ప్రమాదమనేది డెమొక్రాట్ల ఓటమివల్లకాక రిపబ్లికన్ల పునరుత్థానం కారణంగా ఎదురవుతున్నది. ఈ రిపబ్లికన్లు నయా సంప్రదాయవాదానికీ, పచ్చి మితవాదానికీ ప్రాతినిధ్యం వహిస్తారు.
ప్రతినిధుల సభలో రిపబ్లికన్లది పైచేయికాగా, సెనెట్‌లో డెమొక్రాట్లు ఆధిక్యతను నిలుపుకున్నారు. కాని, గతంలోకన్నా వారి సంఖ్య తగ్గిపోయింది. ఎనిమిది దశాబ్దాల అమెరికన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా సెనెట్‌తో నిమిత్తం లేకుండా ప్రతినిధుల సభ చేతులు మారింది. ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు 256 స్ధానాలుండగా, రిపబ్లికన్లకు 178 స్ధానాలున్నాయి. కాగా, ప్రస్తుత ఎన్నికలలో రిపబ్లికన్లు 239 స్థానాలను గెలుచుకోగా, డెమొక్రాట్లకు 185 స్ధానాలు మాత్రమే దక్కాయి. సెనెట్ విషయానికి వస్తే డెమొక్రాట్ల బలం 58 నుంచి 50కి పడిపోగా, రిపబ్లికన్ల బలం 40 నుంచి 46కు పెరిగింది. మధ్యంతర ఎన్నికలలో అధ్యక్షుని పార్టీ ఓటమి పాలవడం అమెరికాలో సర్వసాధారణమే. కాని, ఈసారి తీవ్ర మితవాద పక్షం ఎన్నిక కావటంతో ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుత మధ్యంతర ఎన్నికలలో కొట్టవచ్చినట్లు కనిపించే అంశమేమంటే, పోటీదారులూ, వారి పార్టీలూ పెద్ద మొత్తాలలో డబ్బు ఖర్చు చేయటం. తమ ప్రయోజనాల పరిరక్షణకు హామీ ఇచ్చేటట్లయితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న ఈ తరుణంలో సైతం ఎన్నికలలో విజయం కోసం బ్రహ్మాండమైన మొత్తాలను ఖర్చు చేయటానికి పెట్టుబడిదారులు సిద్ధంగా ఉంటారన్న విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. ఎన్నికలకు కార్పొరేట్ సంస్థలు ఇచ్చే నిధులపై ఎలాంటి పరిమితులూ లేవంటూ న్యాయస్ధానం తీర్పు ఇచ్చిన అనంతరం జరిగిన ఎన్నికలివి. కనుకనే 2010లో జరిగిన ఎన్నికల ప్రచారం అసహ్యకరమైనదిగానేకాక, ఖరీదైనదిగా కూడా తయారైంది. పోటీలో నిలచిన అభ్యర్ధులతో సహా ఇతర సంస్ధలూ, సంబంధిత పార్టీలు పెట్టిన మొత్తం వ్యయం సుమారు 400 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వీటిలో ఎక్కువ భాగం ఎవరికీ అనుబంధంగా లేని బృందాల నుంచి వచ్చింది. చట్టప్రకారం ఈ పద్ధతిలో విరాళాలు ఇచ్చేవారి పేర్లను బహిర్గతం చేయవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఒబామా తదితర డెమొక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ పద్ధతే కొనసాగితే కార్పొరేషన్‌ల నల్లధనం ఎన్నికల రంగంలోకి ప్రవేశిస్తుందని, ఎన్నికల ఫలితాలను వీరి ప్రయోజనాలు ప్రభావితం చేస్తాయని డెమొక్రాట్లు హెచ్చరిస్తున్నారు. దీనిని నిరోధించటానికి అవసరమైన చట్టాన్ని వచ్చే ఏడాది తీసుకు రావాలని వారు ఆలోచన చేస్తున్నారు. ఫ్రీడం వర్క్స్, టీ పార్టీ ఎక్స్‌ప్రెస్, అమెరికన్స్ ఫర్ ప్రాస్పరిటీవంటి జాతీయ సంస్ధలు రిపబ్లికన్ల ప్రభావం కింద ఉన్నాయి. కార్పొరేట్ సంస్ధల విరాళాల కారణంగా రిపబ్లికన్లే ఎక్కువగా లాభించారని దీనివల్ల అర్థమవుతున్నది. ఒబామా ప్రభుత్వం చేపడుతున్న కొన్ని చర్యలు అమెరికాలోని పలు కార్పొరేట్ సంస్థలకు నచ్చటం లేదు. ఆరోగ్య బీమా మార్కెట్‌ను, షేర్ మార్కెట్‌నూ నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వాటికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. రిపబ్లికన్లకు, కార్పొరేట్ సంస్ధలు కోట్లాది డాలర్లను విరాళంగా ఇచ్చాయి. చిన్నచిన్న సంస్ధలు కూడా ప్రచారాన్ని నిర్వహించాయి.
ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఎన్నికలలో ఓటర్లను ఆర్థిక అంశాలు ప్రభావితం చేశాయి. ఇటీవలి సర్వే ప్రకారం ప్రతి పదిమందిలో ఆరుగురుపైగా ఆర్థిక అంశాలకే ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు వెల్లడైంది.ఆర్థిక వ్యవస్ధ దెబ్బతిన్నదని పదిమందిలో తొమ్మండుగురు చెప్పగా, గత రెండు సంవత్సరాల కాలంలో మరీ దారుణంగా తయారైనట్లు పదిమందిలో నలుగురు చెప్పారు. జాతీయ ఆర్థికవ్యవస్ధ గురించి తాము ఆందోళన చెందుతున్నామని ఓటర్లలో సగంమంది పేర్కొన్నారు. వీరంతా రిపబ్లికన్లకే ఓటువేశారు. అధికారిక లెక్కల ప్రకారమే, దేశవ్యాప్తంగా నిరుద్యోగం 9.6 శాతం ఉన్నది. తమ ఉద్యోగాలకు భద్రత కరువవుతున్నట్లు కోట్లాది మంది భావిస్తున్నారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఆరు వారాలపాటు ఉపాధి లేకుండా ఉన్నట్లయితే వారు నిరుద్యోగులుగా లెక్కలోకిరారు. ఇలాంటి వారిని కూడా నిరుద్యోగులుగా లెక్కించినట్లయితే, మొత్తం నిరుద్యోగ శాతం 15 వరకు ఉంటుంది. ఇప్పుడు ఎదురవుతున్న ఆర్థిక కష్టాలన్నిటికీ ప్రభుత్వం పెద్దయెత్తున ప్రకటించిన ఉద్దీపన పథకాలూ, ఆర్థికవ్యవస్ధపై నియంత్రణలూ కారణమని మితవాద బృందాలు (టీపార్టీ కార్యకర్తలు) ప్రజలకు నచ్చచెప్పగలిగారు. ఈ ప్రచారాన్ని సమర్ధవంతంగా త్రోసిపుచ్చడంలో డెమొక్రాట్లు, ఒబామా విఫలమయ్యారు.
ఈ ఎన్నికల్లో ఓటర్లు కూడా మితవాద ధోరణులతోనే ఉన్నారు. టీ పార్టీ ఉద్యమాన్ని (మితవాద బృందాల ప్రచారాన్ని) తాము సమర్ధిస్తున్నట్లు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి పదిమందిలో నలుగురు తెలిపారు. ఒక అంచనా న్రపకారం ఓటర్లలో మితవాద ధోరణితో కలవారు ప్రస్తుత ఎన్నికల్లో 41 శాతం ఉన్నారు. వీరు 2008లో 34 శాతంగానూ, 2006లో 32 శాతంగానూ ఉన్నారు. 1972 తరువాత ఇంత ఎక్కువగా ఎన్నడూ లేరు. టీపార్టీ ఉద్యమ శక్తిని రిపబ్లికన్లు చక్కగా వినియోగించుకున్నారు. 2009 వసంతంలో టీపార్టీ ఉద్యమం తలయెత్తింది. ఆర్థిక వ్యవహారాలలో ప్రభుత్వం శ్రుతిమించి జోక్యం చేసుకుంటున్నదనీ, జాతీయ రుణమూ, ఫెడరల్ లోటు పెరుగుతున్నవంటూ ఈ ఉద్యమ కార్యకర్తలు ప్రచారం చేశారు. ఈ బృందాలు రాజకీయంగా చాలా చురుకుగ్గా వ్యవహరించాయి. కాగా, 2008 ఎన్నికలలో దిగువస్ధాయి కార్యకర్తలను సమీకరించినట్లుగా ప్రస్తుత ఎన్నికల సందర్భంలో సమీకరించలేక పోయారు. గత ఎన్నికలలో శ్రామిక వర్గాన్నీ, యుద్ధ వ్యతిరేకులనూ, మైనారిటీ జాతులనూ, యువజనులనూ సంఘటిత పరిచారు. కనుకనే అప్పట్లో ఒబామా విజయాన్ని సాధించాడు. ఈసారి యువజనులనూ, మైనారిటీ జాతులనూ సంఘటితం చేసే ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రెండు తరగతులకు చెందిన వారిలో 2008లోకన్నా ఈసారి తక్కువమంది డెమొక్రాట్లకు ఓటు వేశారు. అలానే శ్రామికులను సమీకరించటానికి చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. ఒబామా వాగ్దానం చేసిన 'మార్పు' వారికేమీ కనిపించలేదు. ఇదేవిధంగా యుద్ధ వ్యతిరేక బృందాలు కూడా భావించాయి. ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి అయితే దక్కిందిగాని వాగ్దానాన్ని మాత్రం నిలబెట్టుకోలేక పోయాడు. ఇరాక్ నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తానని వాగ్దానం చేసి అందుకు శ్రీకారం చుట్టినప్పటికీ, ఆప్ఘనిస్ధాన్‌లో సైన్యాన్ని పెంచాడు.
ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువ
ఒబామా చేతలు ఆయన చెప్పిన మాటలకు సరితూగేలా లేవని అమెరికన్లలో ఎక్కువమంది భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఆయన నెరవేర్చలేక పోయారు. స్వేచ్ఛా ఉపాధి ఎంపిక చట్టం తెస్తానన్న హామీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఆరోగ్య సంరక్షణ పథకం కూడా అనేక రాజీల అనంతరమే ఆమోదాన్ని పొందింది. ఉభయుల సమ్మతి కావాలనే పేరుతో రిపబ్లికన్లకు ఆయన స్ధానాన్ని కల్పించాడని ప్రజలు భావిస్తున్నారు. తాను హామీ ఇచ్చిన అభ్యుదయకరమైన అజెండాను ముందుకు తీసుకు వెళ్ళడానికీ, ప్రతిపక్షాలను వెనక్కు కొట్టటానికీ, శ్రామికుల్లోనూ, స్వతంత్రులలోనూ, యువజనుల్లోనూ తనకున్న పలుకుబడిని ఒబామా ఉపయోగించలేదని కూడా ప్రజలు భావిస్తున్నారు. వాణిజ్య రంగాన్ని నియంత్రించటానికి కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రజానీకానికి అధికారాన్ని కల్పించటంలో విఫలమయ్యారు. ప్రభుత్వ పాత్ర గురించి టీపార్టీ కార్యకర్తలలో ఉన్న భయాందోళనలను తొలగించడంలో కూడా ఆయన విఫలమయ్యాడు. ఆర్థిక సంక్షోభానికి కారణమైన బడా బ్యాంకులకు ఉద్దీపన పథకాలను బుష్ ప్రకటించిన సమయంలో, అంటే, 2009లో టీపార్టీ బృందాలు పుట్టుకు వచ్చాయి.
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పథకానికి ఒబామా ప్రయత్నాలు ప్రారంభించడంతోపాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలలో ప్రభుత్వ జోక్యం పెరగటాన్ని ఈ బృందాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కార్పొరేట్ సంస్ధల నుంచి వీటికి పుష్కలంగా నిధులు అందాయి. దీనితో ఇవి అనేకమైన అసత్య ప్రచారాలకు ఒడిగట్టాయి. ఈ ప్రచారాన్ని డెమొక్రాట్లు తిప్పికొట్టలేక పోయారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనటంలో కూడా ఒబామాతోపాటు ఆయన పార్టీకి చెందిన డెమొక్రాట్లు గందరగోళంలో పడ్డారు. సంక్షోభం నుంచి ముందుగా తమను బయట పడవేయాలని, తమకు లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పాలక వర్గాలు కోరుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కొన్ని సామాజిక సంక్షేమ చర్యలను చేపట్టటాన్ని ఈ వర్గాలు వ్యతిరేకించాయి. సంక్షోభ సమయంలో ప్రభుత్వం తమకు ద్రోహం చేసిందని భావించిన సాధారణ ప్రజలు సహజంగానే ప్రభుత్వంపట్ల అంసంతృప్తి చెందారు. పాలక వర్గాలను ఈ పరిణామమేమీ కలవర పెట్టలేదు. తమ ప్రయోజనాలను నెరవేర్చటానికి డెమొక్రాట్లు కాకుంటే రిపబ్లికన్‌లున్నారన్నది వారి ఆలోచన. రాజకీయ నాయకులు తమను మోసగించారన్న అసంతృప్తి సాధారణ ప్రజలలో నెలకొన్నది. ఈ పరిస్థితిని రిపబ్లికన్లు వినియోగించు కోవాలని చూస్తున్నారు. అమెరికాలో టీపార్టీ బృందాలు పెరగటానికి ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడ ఒక కారణం. ఐరోపాలో సైతం మితవాద ధోరణులు పెరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యుదయ శక్తులు దీనిని గమనంలోకి తీసుకుని మితవాదాన్ని ఎదుర్కొనటానికై సర్వశక్తులనూ కేంద్రీకరించాలి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment