ఏ ఉగ్రవాదంపై యుద్ధమో చెప్తారా ఒబామాగారూ!

- సునీత్‌ చోప్రా

ముంబయి పేలుళ్లకు కారకులైనవారిని శిక్షించాల్సిందేనని ఒబామా చెప్పారు. కానీ, తన దేశంలోనే ఉన్న హెడ్లీని భారత్‌కు అప్పగించే విషయంలో మౌనం వహించారు. హెడ్లీ, అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్న పాకిస్తాన్‌ జాతీయుడు. హెడ్లీని భారత్‌కు అప్పగించడానికి ససేమిరా అన్నారు. కనీసం మన విచారణ అధికారులు అతన్ని నేరుగా విచారించేందుకు కూడా అవకాశమివ్వలేదు. ఇప్పుడు ఉగ్రవాదంపై యుద్ధంలో భారత్‌ తనతో కలసి రావాలని కోరుతున్నారు.

ఒబామా భారత పర్యటన సందర్భంగా 'ఉగ్రవాదంపై యుద్ధం' గురించి మునుపటికన్నా మరింత ధాటిగా మాట్లాడారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఉగ్రవాదం కూడా ఒకటన్నారు. అమెరికా మాదిరిగానే భారతదేశం కూడా ఉగ్రవాద సమస్యతో సతమతమవుతున్నదన్నారు. భారత్‌ అటు సరిహద్దు ఉగ్రవాదంతోనూ, ఇటు, దేశీయ ఉగ్రవాదంతోనూ సతమతమవుతున్నది. దాని వ్యూహాత్మక మిత్రుడైన అమెరికా, తాను సాగిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో తన పాత్ర గురించేగాని వాస్తవాలను పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించటం లేదు.
సందేహాస్పదమైన అమెరికా పాత్ర
మన ప్రాంతంలో అమెరికాకు ప్రధానమైన వ్యూహాత్మక పొత్తుదారుగా పాకిస్తాన్‌ వ్యవహరిస్తున్నది. కాగా, అల్‌ ఖైదా తరువాత అత్యంత ప్రమాదకరమైన సంస్థ్ధగా దేనినైతే అమెరికా బహిరంగంగా పేర్కొన్నదో ఆ లష్కర్‌-ఏ-తోయిబాతో వ్యవహరించటంలో పాకిస్తాన్‌ దోబూచులాడుతున్నది. లష్కరే నాయకులు రకరకాల సంస్థల పేర్లతో తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. చట్టంలోని లొసుగులను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఇదియిలా ఉండగా డేవిడ్‌ హేడ్లీ వ్యవహారాన్ని తెలుసుకున్నట్లయితే అది మరింత విస్మయంగొలుపుతుంది.
ముంబయి పేలుళ్లకు కారకులైనవారిని శిక్షించాల్సిందేనని ఒబామా చెప్పారు. కానీ, తన దేశంలోనే ఉన్న హెడ్లీని భారత్‌కు అప్పగించే విషయంలో మౌనం వహించారు. హెడ్లీ, అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్న పాకిస్తాన్‌ జాతీయుడు. మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణపై ఇతను గతంలో ఒకసారి అరెస్టు అయ్యాడు. తరువాత విడుదలై పాకిస్తాన్‌, భారత్‌లలో స్వేచ్ఛగా తిరిగాడాడు. కారాగారంలో ఉన్నపుడే అతడు రహస్య ఏజెంటుగా నియుక్తుడయ్యాడా అన్న విషయం వెల్లడికావలసి ఉంది. ముంబయి పేలుళ్ళు వెనుకవున్న సూత్రధారుల కోసం భారత్‌ గాలింపు చేపట్టినపుడు అతను అమెరికాలో మళ్లీ అరెస్టు అయ్యాడు. అప్పటిలో ఇది పెద్దయెత్తున చర్చనీయాంశం అయింది. బహుశా, అతడి నిజస్వరూపం బయటపడకుండా ఉండటం కోసమే ఇలా జరిగిందన్న అనుమానాలు తలెత్తాయి. ఏదియేమైనప్పటికీ భారత గడ్డపై జరిగిన ముష్కర దాడికి సంబంధించిన సమాచారాన్ని అణుమాత్రం కూడా అమెరికన్‌ అధికారులు, భారతీయ అధికారులకు ఇవ్వలేదనటం వాస్తవం. అతని భార్యలకు సంబంధించిన సమాచారాన్ని సైతం తొక్కిపట్టారు.

అతనిని కలుసుకోవడానికిగాను భారత నేర పరిశోధకులకు అనుమతిని నిరాకరించారు. చట్టపరమైన లొసుగులను ఇందుకు కారణంగా చూపారు. తరువాత అతనిని అమెరికాలోనే కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ముందుగా అతనికి పాఠాలు నూరిపోశారన్న ఆరోపణలు అప్పటిలో వెల్లువెత్తాయి. ఇప్పుడతనిని పాకిస్తాన్‌కు అమెరికా తరలించింది. ముంబయి పేలుళ్ళ వెనుక పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ హస్తం ఉన్నదని చెప్పినట్లుగా తెలిసింది. కాని పాక్‌ ఐఎస్‌ఐ చేసే దురంతాలకుగాను దానిని శిక్షించాలన్న ఆలోచన 'ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి' పూనుకున్న ప్రపంచ నాయకులకు రాలేదు. పైగా ఇప్పుడు పాక్‌తో జరిపే ద్వైపాక్షిక చర్చలలో సున్నితంగా వ్యవహరించాలంటూ భారత్‌పై ఒత్తిడి తెస్తున్నది. పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ నిష్కళంకమైనదంటూ అమెరికా కితాబు ఇవ్వటమేకాక, పాకిస్తాన్‌కు ఆయుధ సహాయం కింద 200 కోట్ల డాలర్లను ప్రకటించింది. కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో సిక్కుల మూకుమ్మడి హత్యకు ఐఎస్‌ఐ పథకం వేసినట్లుగా ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ కిరాతకం వెనుక ఎవరున్నదీ ప్రకటించడానికి నిరాకరించడం ద్వారా అప్పటి అధ్యక్షుడు క్లింటన్‌ దానిని మరుగుపరిచాడు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో వ్యవహరించడంలో ఇదొక కొత్త మార్గంగా కనబడుతున్నది. అయితే, మరొక పొత్తుదారైన ఇజ్రాయిల్‌ దశాబ్దాలుగా అనేకానేక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నప్పటికీ దాని విషయంలో అమెరికా కళ్ళుమూసుకునే ఉంటున్నదన్న విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఇందులో కొత్తదనమేమీ కనిపించదు. పశ్చిమాసియాలో అస్థిరత్వాన్ని సృష్టించటంలో అది నిర్వహిస్తున్న పాత్రను మధ్య, దక్షిణాసియాలో పాకిస్తాన్‌ నిర్వహిస్తున్న పాత్రతో పోల్చవచ్చు. ప్రచ్ఛన్న అణ్వాయుధాలను కలిగి ఉండటంలోనూ, అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటంలోనూ ఈ రెండు దేశాలు ఒకే బాటలో నడుస్తున్నాయి. ఇతర దేశాలలో ఇజ్రాయిల్‌ హంతక దాడులను సాగిస్తున్నది. ఇటీవల దుబాయిలో ఇలాంటి దాడులకే పూనుకున్నది. ఇరాక్‌ అణు కేంద్రాలపై దాడులకు పాల్పడింది. పశ్చిమాసియా, ఆఫ్రికాలలో ఇలాంటి పలు చర్యలకు అది పూనుకుంటున్నది. ఆక్రమిత కాశ్మీర్‌లో తీవ్రవాదుల శిక్షణా శిబిరాలను నిర్వహించటమేకాక, కరాచీ, పంజాబులలో సైతం కార్యకలాపాలను సాగిస్తున్నది. నేపాల్‌, బంగ్లాదేశ్‌లను కూడా దీనిలోకి లాగటం చూస్తే ఇజ్రాయిల్‌, పాకిస్తాన్‌ల మధ్య పోలికలు స్పష్టంగా కనబడతాయి.

దిగ్భ్రాంతిగొలిపే మరొక విషయమేమంటే, ఇజ్రాయిల్‌ రహస్య అణ్వాయుధ కార్యక్రమానికి పునాది వేసిన మోర్దెచై వనూను దాదాపు దశాబ్దంపై నుంచి ఇజ్రాయిల్‌ చెరలో మగ్గుతున్నాడు. అణ్వాయుధ ఉత్పత్తికి సంబంధించి ఇజ్రాయిల్‌ చేస్తున్న చట్టవ్యతిరేక, నేరపూరిత కార్యకలాపాలను బయట పెట్టినందుకుగాను ఆయనకు కారాగారవాసం తప్పలేదు.
క్యూబన్లకు ఆటవిక శిక్షలు
ఇజ్రాయిల్‌వంటి ధూర్త దేశం ఇలాంటి చర్యలకు పూనుకోవటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. అమెరికావంటి 'స్వేచ్ఛా దేశం'లో జరుగుతున్నదేమిటి? క్యూబాకు చెందిన ఐదుగురు దేశభక్తులు గత పన్నెండేళ్ళుగా అమెరికా చెరలో మగ్గుతున్నారు. క్యూబా నుంచి బహిష్కృతులైన ఉగ్రవాదులు లూయీస్‌ పొసాడా కారిలీస్‌, ఓర్లాండో బోసెV్‌ా అవిలాల చర్యలపై నిజనిర్ధారణ కమిటీని నియమించటమే వారు చేసిన నేరం. 1976లో 73 మంది ప్రయాణీకులతో కూడిన విమానాన్ని పేల్చివేయటంతో సహా పలు ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ ఇరువురు పాల్పడ్డారు. మొత్తంమీద ఉగ్రవాద కార్యకలాపాలలో 3,478 మంది క్యూబన్లు చనిపోగా, 2,099 మంది గాయపడ్డారు. ఈ ఐదుగురు దేశభక్తులు చేసిన నేరమేమిటి? నేరస్తులను బయటపెట్టటమే వారు చేసిన నేరం. వారు మాదక ద్రవ్యాలను చేరవేసే నేరస్థులు కాదు, ఉన్నత విద్యావంతులు. వారి జీవితంలోని అత్యంత విలువైన కాలం అమెరికన్‌ కారాగారంలోనే గడచిపోయింది. తమ దేశీయులు ఉగ్రవాద భూతం నుంచి విముక్తులు కావాలన్న ఆశయంతో వారు రకరకాల చిత్రహింసలకు గురవుతున్నారు.

1965లో జన్మించి అంతర్జాతీయ రాజకీయ సంబంధాలలో పట్టభద్రుడై కార్టూనిస్టుగా సుప్రసిద్ధుడైన గెరార్డో హెర్నాండెజ్‌ నోర్డిలో వృత్తాంతాన్ని తీసుకుందాము. 2002లో ఆయన కార్టూన్‌లతో కూడిన ఒక గ్రంథం వెలువడింది. అతనికి రెండు జీవితకాల శిక్షలతోపాటు మరో 15 ఏళ్ళ కారాగారశిక్ష పడింది. 1963లో జన్మించిన రగోన్‌ లాబానిననో సాలాజార్‌ ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ఆయనకు జీవిత ఖైదుతోపాటు 18 ఏళ్ళ జైలు శిక్షపడింది.1956లో చికాగోలో జన్మించిన రెనే గోంజాలెజ్‌ షెవెర్ట్‌ విమాన చోదకుడు, శిక్షకుడు కూడా. ఆయనకు 15 ఏళ్ళ జైలు శిక్ష పడింది. 1963లో జన్మించిన ఫెర్డినాండో గోంజాలెజ్‌ లోర్ట్‌ అంతర్జాతీయ రాజకీయాలలో అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఈయనకు 19 ఏళ్ళ శిక్ష పడింది. 1958లో మియామీలో జన్మించిన ఆంటోనియో గ్యురెరో రోడ్రిగ్యు విమానాశ్రయాల నిర్మాణ రంగంలో పనిచేసే ఇంజనీరు. కవి, కళాకారుడు కూడా. ఈయనకు జీవిత ఖైదుతోపాటు అదనంగా మరో 10 ఏళ్ళ శిక్ష పడింది.

ఎలాంటి హింసాత్మక చర్యలకూ పాల్పడని వీరికి ఇలాంటి ఆటవిక శిక్షలు విధించటం కన్నా విడ్డూరం ఏముంటుంది? దేశ చట్టాలన్నింటినీ ఉల్లంఘించి సాక్ష్యాలను తొక్కిపట్టింది. అప్పీలు చేసుకునేందుకు న్యాయస్థ్ధానం అవకాశాన్ని ఇచ్చినప్పటికీ దానిని కూడా తోసిపుచ్చింది. ఇదే సమయంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ ఓర్లాండో బోసెక్‌, లూసాడా కారిలీస్‌లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వీరికి సీనియర్‌, జూనియర్‌ బుష్‌ల అండ ఉన్నది. మార్పు తీసుకు వస్తానని చెప్పటం ద్వారా ఒబామా ఎన్నికలలో విజయాన్ని సాధించాడు. కాని, చెరలో మగ్గుతున్న ఐదుగురు క్యూబన్లకు ఇప్పటి వరకు ఆయన చేసిన మేలేమీ లేదు. మానవ హక్కుల గురించి పదే పదే మాట్లాడే ఒబామాకు ఇది అన్యాయం అనిపించడం లేదు. వారికి న్యాయం చేయని పక్షంలో ఉగ్రవాద వ్యతిరేక యుద్ధమంటూ ఆయన ఇచ్చే పిలుపుకు భారతీయులు ఎలాంటి విలువా ఇవ్వరు.సరిహద్దులో ప్రభుత్వ ప్రోత్సాహక, వైయక్తిక ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న మనం, ప్రజల జీవన్మరణ సమస్యలకు సంబంధించి నమ్మదగని, రెండు నాల్కల ధోరణి ఉన్నవారితో పొత్తు పెట్టుకోవటంలో అర్థ్ధం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సామ్రాజ్యవాదం బులిబులి మాటలు గుప్పిస్తుంది. ఇవన్నీ తన ప్రయోజనాల కోసమేగాని మనతో మిత్రత్వం కోసం కాదు.

 

0 comments: