కొట్నీస్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
ప్రభుత్వాల ఉమ్మడి కృషి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు సంపూర్ణమైన రీతిలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
పరస్పర అవగాహన, విశ్వాసం, సహకా రం ద్వారా ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోవాలని సూచించారు. అమరజీవి డాక్టర్ కొట్నీస్ శత జయంతి సభ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, జన విజ్ఞాన వేదిక, ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్, డాక్టర్స్ ఫోరం ఫర్ పబ్లిక్ హెల్త్, ఎపి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్, ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఎస్వీకె కార్యదర్శి వై.సిద్ధయ్య స్వాగతోప న్యాసం చేశారు. సభకు ముందు చైనా రాయబారి ఝంగ్ యాన్ డాక్టర్ కొట్నీస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. డాక్టర్ కొట్నీస్ ప్రజలకు చేసిన సేవలను స్మరిస్తూ ప్రొఫెసర్ ఎమ్. ఆదినారాయణ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా కొట్నీస్ జీవితంపై రచించిన 'జీవనజ్వాల' అనే పుస్తకాన్ని చైనా రాయబారి ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఎంపీ, ఎస్వీకె విశ్రాంత ఛైర్మన్ డాక్టర్ వై.రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ఝంగ్ యాన్ ప్రసంగించారు. భారత్-చైనా మిత్రమండలి గౌరవాధ్యక్షులు, శాసనమండలి సభ్యులు చుక్క రామయ్య ప్రధాన వక్తగా ఉపన్యసించారు. ఈ సందర్భం గా ఝంగ్ యాన్ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ అయిన డాక్టర్ కొట్నీస్ చైనాకు గొప్ప స్నేహితుడన్నారు. జపాన్ దురాక్రమ ణకు వ్యతిరేకంగా చైనా వీరోచితంగా పోరాడుతున్న సమయంలో కొట్నీస్ అక్కడి ప్రజలకు విలువైన వైద్య సేవలందించారని కొనియాడారు. ఈ విషయాన్ని చైనా ప్రజలు ఎన్నటికీ మరిచిపో లేరని చెప్పారు. ఫాసిస్టు దురాక్రమణదారు లను ఓడించాలన్న ధృడ సంకల్పంతో, చైనా ప్రజలు నిర్వహిస్తున్న పోరాటం పట్ల ప్రగాఢమైన సానుభూతితో డాక్టర్ కొట్నీస్ చైనా కమ్యూనిస్టు పార్టీలో చేరారని గుర్తుచేశారు. తుదిశ్వాస విడిచేవరకు చైనా ప్రజలకు హృదయపూర్వకంగా సేవలం దించారని కొనియాడారు. ప్రేమాభిమానాలు,దయాగుణం చూపించటం ద్వారా చైనా ప్రజల హృదయాల్లో ఎనలేని గౌరవాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.
పనిపట్ల బాధ్యతతో వ్యవహరించే తీరు, వైద్య విధానంలో సంపూర్ణమైన వైజ్ఞానిక ప్రమాణాలను సాధించాలన్న తపన వల్ల చైనా సహచరులు, ఇతరుల్లో ఆయన గౌరవం సంపాదించారని చెప్పారు. 'డాక్టర్ కొట్నీస్ చూపిన అంతర్జాతీయ స్ఫూర్తిని మేమెన్నడూ మరువజాలం' అనే మావో జెడాంగ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఝంగ్ యాన్ ఉటంకించారు. కొట్నీస్ తన ఆశయం కోసం అందించిన నిస్వార్థ సేవలు, ఉన్నత వ్యక్తిత్వం, అంతర్జాతీయ స్ఫూర్తి భారత-చైనా ప్రజల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించటంలో తరతరాలకు ఉత్తేజితంగా నిలుస్తుందన్నారు. డాక్టర్ కొట్నీస్ సిద్ధాంతాలు, ఆశయాలు ఇరుదేశాల ప్రజలపై ఎల్లప్పుడూ ప్రభావం చూపుతాయని, రెండు దేశాల ప్రజల మధ్య స్నేహాన్ని ముందుకు తీసుకుపోవటం అనే ఉమ్మడి కర్తవ్య నిర్వహణలో స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటాయన్నారు. భారత్-చైనా దేశాలు రెండూ స్వాతంత్య్ర పోరాటం, విమోచనా పోరాటాల్లో పరస్పరం సహకరించుకున్నాయని గుర్తుచేశారు. స్వతంత్య్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ రెండు దేశాలకు శాంతియుతమైన, పటిష్టమైన, అంతర్జాతీయ, ప్రాంతీయ పరిస్థితులు అవసరమని యాన్ నొక్కిచెప్పారు. ఇరు దేశాల మధ్య శాంతియుత సహజీవనం, పరస్పర సహకారం లేకుండా పురోభివృద్దిని సాధించటం సాధ్యం కాదన్నారు. భారత్-చైనాల మధ్య స్నేహం ఈ రెండు దేశాలకే కాకుండా ఆసియా ఖండానికి, ప్రపంచం మొత్తానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ద్వైపాక్షిక పరిధిని దాటి ప్రపంచ ప్రాధాన్యతను సంతరించుకున్నాయని వివరించారు.
ప్రపంచానికి నాయకత్వం వహించాలి : చుక్క రామయ్య
వాయువేగంతో అభివృద్ధి చెందుతున్న భారత్-చైనా దేశాలు తమ స్నేహం, పరస్పరం సహకారం ద్వారా ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించాలని ఎమ్మెల్సీ చుక్క రామయ్య ఆకాంక్షించారు. గతంలో చైనాలో తాను పర్యటించినప్పుడు డాక్టర్ కొట్నీస్ పేరిట నిర్మించిన ఆస్పత్రిని సందర్శించానని గుర్తుచేశారు. కొట్నీస్‌పై ఆ దేశ ప్రజలకు ఉన్న గౌరవాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. చైనాలోని పలు గ్రామాల్లో తాను పర్యటించానని, అక్కడి ప్రజలు భారతీయుల పట్ల అడుగడుగునా ఆదరణ, సృహృద్భావం కనబరిచారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో కొట్నీస్ శతజయంతి సభను నిర్వహించుకోవటం హర్షణీయమని అన్నారు.
దేశం గర్వించదగ్గ వ్యక్తి : వైఆర్‌కె
భారతదేశం గర్వించదగిన వ్యక్తి డాక్టర్ కొట్నీస్ అని డాక్టర్ వై.రాధాకృష్ణమూర్తి కొనియాడారు. చైనాలో కేవలం 5 సంవత్సరాలు వైద్య సేవలందించటం ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. నేటి వైద్యులు, ముఖ్యంగా యువ వైద్యులు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయతను ఆచరణలో చూపించిన మహోన్నత వ్యక్తి అని శ్లాఘించారు. యుద్ధ సమయంలో తుపాకీ గుళ్ల మధ్యలోంచి వెళ్లి వైద్యం చేసిన ధైర్యశాలి అని అన్నారు.
గొప్ప మానవతావాది : వక్తలు
అంతర్జాతీయతను ఆచరణలో నిరూపించిన డాక్టర్ కొట్నీస్ గొప్ప మానవతావాది అని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన సేవలు నేటి ప్రజలకు, ముఖ్యంగా డాక్టర్లకు ఉత్తేజాన్ని ఇస్తాయని తమ సందేశాల్లో వారు పేర్కొన్నారు. ఆలిండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి కడారు ప్రభాకరరావు మాట్లాడుతూ ఎలాంటి రవాణా వ్యవస్థ లేని రోజుల్లో డాక్టర్ కొట్నీస్ కాలినడకన అనేక వందలమైళ్లు నడిచి చైనా ప్రజలకు సేవలందించారన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న నేటి వైద్యుల వైఖరిలో మార్పు రావాల్సిన అవసరముందని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎపి చాప్టర్ ఛైర్మన్ డాక్టర్ ఇ.రవీందర్‌రెడ్డి కోరారు. వైద్యరంగంలో అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ అది సామాన్య ప్రజలకు చేరటం లేదని ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్‌మెంట్ కార్యదర్శి డాక్టర్ కె.రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను, బోధనాసుపత్రులను బలోపేతం చేయటం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ అన్నారు. నెల్లూరు ప్రజా వైద్యశాల వైద్యులు డాక్టర్ ఎంవి రమణయ్య మాట్లాడుతూ కేవలం సూపర్ స్పెషలిస్టులు చూడటం ద్వారానే రోగం నయమవుతుందనే భావన నుండి ప్రజలు బయటపడాలన్నారు.
దేశంలో మరెక్కడా లేని విధంగా నెల్లూరు ప్రజా వైద్యశాల తక్కువ ఖర్చుతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందిస్తోందని చెప్పారు. ఆంధ్ర మహిళాసభకు, చైనా దేశానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రొఫెసర్ వై.సర్వసతీరావు తన ప్రసంగం సందర్భంగా గుర్తుచేశారు. రామకృష్ణ మిషన్ వైద్యులు డాక్టర్ రాజగోపాల్ మాట్లాడుతూ కొట్నీస్ అందించిన సేవలకు గుర్తుగా చైనా ప్రభుత్వం ఆయన పేరిట తపాలా బిళ్లను విడుదల చేసిందన్నారు. ఎంవి నర్సింహారెడ్డి స్మారక వైద్యశాల వైద్యులు డాక్టర్ హెచ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ రోగుల నుండి ఏమీ ఆశించకుండా వైద్యులు నిస్వార్థంగా పనిచేయాలని సూచించారు. ఎపి ఎంఎస్‌ఆర్‌యు రాష్ట్ర కార్యదర్శి ఎ.నాగేశ్వరరావు మాట్లాడుతూ కొట్నీస్ మరణించి 70 ఏళ్లయినా ఆయన భారత్-చైనా ప్రజల హృదయాల్లో ఇంకా బతికే ఉన్నారన్నారు. జెవివి రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ రెడ్డి మాట్లాడుతూ తన సేవలు, సిద్ధాంతాల ద్వారా కొట్నీస్ ప్రపంచ ప్రజలకే ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి (జెవివి, ఆరోగ్య విభాగం), చైనా రాయబారి సతీమణి చెన్‌వెంగ్ యాన్, ఆయన రాజకీయకార్యదర్శి జీపింగ్, ఎస్వీకె ట్రస్టు ఛైర్మన్ సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్‌సుధాకర్ (ఆలిండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్) వందన సమర్పణ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment