ఒబామా పర్యటన

సోమవారంతో ముగిసిన మూడు రోజుల ఒబామా భారత పర్యటన వ్యూహాత్మక పొత్తు అనే చట్రంలో భారత్‌ను మరింతగా బంధించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఒబామా తన పదిరోజుల ఆసియా పర్యటనలో తొలి మజిలీగా ప్రపంచంలో చైనా తరువాత అతిపెద్ద మార్కెట్‌ను కలిగివున్న భారత్‌ను ఎంచుకోవడానికి కారణం ఇదే. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు, పార్లమెంటులో ఒబామా చేసిన ప్రసంగం, అంతకు ముందు విడుదల జేసిన సంయుక్త ప్రకటన ఇవన్నీ గమనించినప్పుడు ఒబామా ఒక దేశాధ్యక్షుడిగా కన్నా అమెరికన్‌ బడా వ్యాపారుల ప్రతినిధిగానే వ్యవహరించాడనేది స్పష్టం. భారత పర్యటనకు బయల్దేరడానికి ముందు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రికకు ఆయన ఒక వ్యాసం రాస్తూ '' నూతన మార్కెట్లలో నూతన కస్టమర్ల కోసం ప్రయత్నించడమే తన యాత్ర ఉద్దేశమని'' పేర్కొన్నాడు. అమెరికా కార్పొరేట్లకు ఏం కావాలో దానిని చేకూర్చడంలో ఒబామా సఫలమయ్యాడు. ఆ మేరకు భారత ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అంటూ భారత్‌ను ఉబ్బేసిన ఒబామా అన్ని రంగాల్లోకి అమెరికా కంపెనీల ప్రవేశానికి వీలుగా వడివడిగా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు.
అమెరికన్‌ కాంగ్రెస్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఒబామా నేతృత్వంలోని డెమొక్రటిక్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగలడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ ఒబామా అమెరికన్‌ కార్పొరేట్‌ వర్గాల విశ్వాసాన్ని పొందడం కోసం ఈ యాత్రను చేపట్టాడు. రాజకీయాలను వ్యాపార వ్యవహారాలతో జోడించడంలో ఒబామా మంచి నేర్పరి. భారత ప్రజలకు తియ్యటి మాటలు చెప్పి అమెరికన్‌ కంపెనీలకు వేల కోట్ల విలువైన ఒప్పందాలను చక్కగా కుదిర్చిపెట్టాడు. తన దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించుకోవడం కోసం మన దేశంలో నిరుద్యోగానికి లాకులెత్తాడు.
ఆర్థిక మాంద్యం దెబ్బకు అమెరికాలో నిరుద్యోగ రేటు ఇప్పటికే రికార్డు స్థాయిలో 9.6 శాతానికి చేరుకోవడంతో ఒబామా నాయకత్వంపై అమెరికన్లలో అసంతృప్తి రగుల్కొంటోంది. ఒక వైపు భారత్‌ లాంటి దేశాలకు ప్రయోజనకరంగా వున్న అవుట్‌ సోర్సింగ్‌ను అడ్డుకుంటూ, మరోవైపు భారత్‌తో రక్షణ, లోకోమోటివ్స్‌ తరితర రంగాల్లో వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా తన దేశంలో ఉద్యోగాలు పెంచుకుంటున్నాడు. దీంట్లో భాగంగానే ప్రపంచ దేశాలకు తన ఎగుమతులను పెంచి, దిగుమతులను తగ్గించుకుంటున్నాడు. భారత్‌- అమెరికా సంయుక్త ప్రకటనలో పేర్కొన్న ఆర్థిక సహకార ఫ్రేమ్‌వర్కు ఇందుకొక నిదర్శనం. అలాగే ఆహార భద్రత, వ్యవసాయ ఉత్పాదకతను పెంచే పేరుతో చిల్లర వర్తకం, వ్యవసాయ రంగాల్లో అమెరికన్‌ బహుళజాతి కంపెనీలైన వాల్‌ మార్టు, మోన్‌శాంటోలకు తలుపులు బార్లా తెరవాలని భారత్‌పై ఒత్తిడి తెస్తున్నాడు. రిటైల్‌ రంగంలోకి వాల్‌ మార్టును అనుమతిస్తే అయిదు కోట్లమంది చిల్లర వర్తకులు వీధిన పడతారు. దేశంలో ఇప్పటికీ 67 శాతం మందికి జీవనాధారంగా వున్న వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో పడుతుంది. ఉన్నత విద్య, వైద్య రంగాలను కూడా తెరవాలని ఒత్తిడి తెచ్చాడు. ఇలా భారత్‌లోని ప్రతి రంగాన్ని అమెరికన్‌ కంపెనీలకు తెరచిపెడుతూ పోతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. అమెరికాను సంక్షోభంలోకి నెట్టేందుకు ఏ విధానాలైతే కారణమయ్యాయో అవే విధానాలను భారత్‌పై ఒబామా రుద్దుతున్నాడు. అమెరికా ఆర్థిక సంక్షోభంలో పడినా భారత్‌ పై దాని ప్రభావం అంతగా లేకపోవడానికి కారణం కీలకమైన రంగాలపై ప్రభుత్వ నియంత్రణ ఇప్పటికీ ఉండడమే. కాంగ్రెస్‌ నేతృత్వంలోని తొలి యుపిఏ ప్రభుత్వం నియంత్రణలను తొలగించాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇచ్చిన వామపక్షాలు గట్టిగా హెచ్చరించడంతో కాస్తా వెనక్కి తగ్గింది. ప్రస్తుత యుపిఏ-2 ప్రభుత్వానికి వామపక్షాల మద్దతు అవసరం లేనందున అమెరికా ముందు సాగిలపడుతోంది.
అమెరికా కుటిల పన్నాగాల పరిణామాలను మతించకుండా భారత్‌ను దానికి జూనియర్‌ భాగస్వామిగా చేసేందుకు మన్మోహన్‌ ప్రభుత్వం తహతహలాడుతున్నది. రక్షణ, భద్రతా రంగాల్లో అమెరికాకు వ్యూహాత్మక పొత్తుదారుగా మారడమంటే దేశ సార్వభౌమత్వాన్ని మనమే చేజేతులారా నాశనం చేసుకున్నట్లు అవుతుంది. అమెరికా చేసే యుద్ధాలు, పాపాలలో భారత్‌ అనివార్యంగా భాగస్వామి కావాల్సి వస్తుంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటికే ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐఎఇఏలో భారత్‌ రెండు సార్లు ఓటేసింది. ఇప్పుడు ఇరాన్‌ అణు కార్యక్రమంపై మరో విడత ఆంక్షలు విధించడానికి లేదా, యుద్ధానికి అమెరికా ఒకవేళ తెగబడితే దానిలో భారత్‌ భాగస్వామి కావాల్సిఉంటుంది. ఇరాన్‌పై చర్యకు రష్యా, చైనా టర్కీ, బ్రెజిల్‌ వంటి దేశాలు వ్యతిరేకిస్తుంటే భారత ప్రభుత్వం మాత్రం అమెరికాకు వత్తాసు పలుకుతున్నది. భద్రతామండలిలో శా శాశ్వతేతర సభ్య దేశంగా 2011 జనవరి నుంచి రెండేళ్లపాటు కొనసాగనున్న భారత్‌ ఈ కాలంలో ఎలా మెలగాలో కూడా అమెరికానే చెబుతున్నది. భవిష్యత్తులో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఈ రెండేళ్లలో భారత్‌ ప్రవర్తించే తీరునుబట్టి ఆధారపడి వుంటుందని ఒబామా అనడం అమెరికా దుర్బుద్ధిని తెలియజేస్తోంది.
మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, ఉగ్రవాదం గురించి ఒబామా సుద్దులు చెప్పడం మరీ హాస్యాస్పదంగా వుంది. అబూగ్రాయిబ్‌ జైలులో ఇరాకీయుద్ధ ఖైదీలను చిత్రహింసలు పాల్జేయడం, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో అమెరికా సాగించిన నరమేధం వంటివి కప్పిపుచ్చుకుని మానవ హక్కుల పరిరక్షకుడిగా ఒబామా పోజు పెట్టడం వంచనకు పరాకాష్ఠ. ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న ఒబామా హోండూరస్‌లో చేసిందేమిటి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు జెలయాను సైనిక కుట్ర ద్వారా కూల్చివేసి ప్రజాస్వామ్యాన్ని ప్రహసనంగా మార్చిన చరిత్ర అమెరికాది కాదా? 9/11 అనగానే న్యూయార్క్‌లోని డబ్ల్యుటిసి టవర్‌పై దాడినే చూపించే అమెరికాకు 37 ఏళ్ల క్రితం ఇదే సెప్టెంబరు 11న చిలీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అలెండీని అన్యాయంగా చంపించివేసిన తన కిరాతకత్వాన్ని మాత్రం దాచి పెడుతుంది. 2,752 మంది మరణానికి దారి తీసిన 9/11 ఘటనను ప్రపంచమంతా ఖండించింది. కానీ, 26/11 కు కుట్రదారుడైన హెడ్లీ అమెరికాలో పట్టుబడినా అతడిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా ఎందుకు సిద్ధపడలేదు. అంతకన్నా దారుణమైన భోపాల్‌ దుర్ఘటనకు బాధ్యుడైన అండర్సన్‌ అమెరికాలోనే వున్నా దాని గురించి ఒబామా ఎందుకు మాట్లాడరు. మెక్సికన్‌ గల్ఫ్‌లో చమురుతెట్టును తొలగించేందుకు బిపి కంపెనీ ముక్కు పిండి వందల కోట్ల డాలర్ల పరిహారాన్ని రాబట్టిన ఒబామా భోపాల్‌ కేసులో అమెరికన్‌ డొవ్‌ కంపెనీ విషయానికొచ్చేసరికి ఎందుకు మౌనం వహిస్తున్నారు. మన్మోహన్‌ ప్రభుత్వం కూడా భోపాల్‌ గ్యాస్‌ బాధితులకు న్యాయం చేయాలని గట్టిగా అడగలేకపోయింది. ఇటువంటి ఏక పక్ష, అసమ భాగస్వాముల మధ్య ఒప్పందాలు అమెరికాకే ప్రయోజనం కలిగిస్తాయి. భారత ప్రజలకు నష్టదాయకమైన ఈ ఒప్పందాలను ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి.

 

0 comments: