భారత్ ఆర్డర్లతో అమెరికాలో 50 వేలు కాదు 7 లక్షల ఉద్యోగాలు
అమెరికా నుండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరికరాలు, న్యూక్లియర్ హార్డువేర్, మిలటరీ ఎయిర్‌క్రాఫ్టులను భారత్ కొనుగోలు చేయడం వలన రానున్న 10 సంవత్సరాల కాలంలో అమెరికాలో ఏడు లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లవుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలిపింది. ఇప్పుడు భారత్ వ్యాపారం కేవలం ఐటి, ఐటిఇఎస్‌లతోనే కాదని మరిన్ని రంగాలలో విస్తృతంగా వుండనున్నదని అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సభ్య సంస్థలతో సిఐఐ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ మిలటరి, న్యూక్లియర్ హార్డ్‌వేర్, సివిలియన్ ఎయిర్‌క్రాఫ్టులను భారత్ ఎంచుకోవడంతో రానున్న 10 సంవత్సరాల కాలంలో అమెరికాలో 7,00,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని 'ఇండియా-ఎ గ్రోత్ పార్టనర్ ఇన్ ద ఇండియన్ ఎకానమి' (భారత్-భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక వృద్ధి భాగస్వామి) పేరుతో విడుదలచేసిన నివేదిక తెలిపింది. భారత్-అమెరికన్ కంపెనీల మధ్య 1,000 కోట్ల డాలర్ల (రూ.46,000 కోట్లు) విలువగల ఒప్పందాలను అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించారు. అనిల్ అంబాని గ్రూపుకు చెందిన రిలయన్స్ పవర్ జారీచేసిన 200 కోట్ల డాలర్ల (రూ.9,200 కోట్ల) పరికరాల కొనుగోలు ఆర్డరు, 30 బోయింగ్ 747 విమానాలకోసం విమానయాన సంస్థ స్పైస్‌జెట్ జారీచేసిన కొనుగోలు ఆర్డర్లు కూడ యిందులో వున్నాయి. ఈ ఒప్పందాల వలన అమెరికాలో 50,000 పైబడి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ సంస్థలు తమ వద్ద పనిచేయడం కోసం పెద్ద సంఖ్యలో అమెరికన్లను చేర్చుకుంటున్నాయని, వారిలో అధిక భాగం స్థానికులేనని ఆ నివేదిక తెలిపింది. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాల్లో సైతం భారతీయ సంస్థలు పాలుపంచుకుంటున్నాయని, గ్రంధాలయాలు, ఆరోగ్య పరిశోధన, కళాశాల విద్యార్ధులకు నైపుణ్యాన్ని బోధించడం వంటివి యిందులో చోటుచేసుకుంటున్నాయని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బనర్జీ తెలిపారు.
0 comments:
Post a Comment