విక్టర్‌ కీర్నన్‌-భారతదేశంలో వామపక్షాలు

ప్రకాశ్‌ కరత్‌ అక్టోబరు 22వ తేదీన కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో విక్టర్‌ కీర్నన్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన సదస్సులో చేసిన ప్రసంగం పూర్తి పాఠం



* స్వాతంత్య్రానికి ముందు కమ్యూనిస్టు పార్టీలో వామపక్ష జాతీయవాద ధోరణి ఉండేది. విక్టర్‌ కీర్నన్‌ మిత్రులు కొందరు (వారిలో కొందరు కేంబ్రిడ్జి నుంచి వచ్చారు) పార్టీలోని ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ బూర్జువా వర్గమూ, దాని ద్వారా వచ్చిన జాతీయ ఉద్యమమూ అభ్యుదయకరమైనవిగా వారు భావించారు.
* మతతత్వ రాజకీయాలనూ, కులాన్ని ప్రాతిపదికగా కలిగివున్న అస్తిత్వవాద రాజకీయాలను ప్రతిఘటించేలా ప్రజలను సమైక్యం చేయటానికి వామపక్షాలు కృషి చేస్తున్నాయి.
*నయా ఉదారవాద విధానాలతో పాటే భారత విదేశాంగ విధానంలో మార్పులు కూడా ప్రవేశించాయి. భారతదేశంలోని పాలకవర్గాలు అమెరికాతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకుంటున్నాయి. దీని ప్రభావం దేశ రాజకీయాలపై పడుతున్నది.



1938 నుంచి 1946 వరకు విక్టర్‌ కీర్నన్‌ భారతదేశంలో నివసించారు. 'అనుకోకుండా ఆయన భారతదేశంలో కొన్నేళ్లపాటు గడిపి వుండకపోతే ఆయన ప్రతిష్టను పెంచే కొన్ని ప్రధానమైన రచనలు వచ్చి ఉండేవి కావేమో!' అని ఎరిక్‌ హాస్బామ్‌ చెప్పిన మాటలు నిజం. ఆయన దీర్ఘకాలంపాటు భారతదేశంలో ఉండటం భారత ఉపఖండంలోని మన అదృష్టం. ఆయనే ఇక్కడ లేకుంటే ఇక్బాల్‌, ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ల రచనలకు సంబంధించి మొట్టమొదటి ఆంగ్లానువాదాలు మనకు లభించేవి కావు. అదే విధంగా భారతదేశం గురించి మార్క్స్‌ అన్న అంశంపై ఆయన వ్యాసాలు గానీ, బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికీ దాని ప్రధాన వలసకూ మధ్య ఉన్న సంబంధాల గురించి కీర్నన్‌ వెలువరించిన సమగ్ర రచనలు గానీ మనకు దక్కేవి కావు. భారతదేశంలో కీర్నన్‌ నివసించిన ఏడు సంవత్సరాల కాలం పూర్తిగా రెండవ ప్రపంచ యుద్ధపు రోజులు. ఈ కాలంలోనే జాతీయోద్యమాలు శిఖర స్థాయికి చేరాయి. ఈ కాలంలోనే దేశంలోని కొన్ని ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీ వేళ్ళూనుకుని అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్నది. కీర్నన్‌ వెళ్ళిపోయిన ఏడాది లోపే భారతదేశం స్వతంత్రాన్ని సాధించుకున్నది, పాకిస్తాన్‌ ఉనికిలోకి వచ్చింది.

భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి 1930ల ముగింపూ, 40ల ప్రారంభమూ అత్యంత కీలకమైన కాలం. 1920లోనే తాష్కెంట్‌లో పార్టీ ఆవిర్భవించినప్పటికీ, 1934-35లోనే అంటే, మీరట్‌ ఖైదీలు విడుదలైన తరువాత మాత్రమే పార్టీ పనిచేయనారంభించింది. పార్టీ ప్రధాన కార్యాలయం బొంబాయిలో పనిచేయటం ప్రారంభించిన అనంతరం నాలుగేళ్ళకు కీర్నన్‌ భారత్‌కు చేరుకున్నాడు. పార్టీ ప్రధాన కార్యదర్శి పి.సి.జోషితో ఆయనకు స్నేహం కుదిరింది. తదనంతర రెండు దశాబ్దాలలో వలెనే ఆ కాలంలో కూడా భారతదేశం లోని కమ్యూనిస్టులూ, వామపక్షవాదులూ నిర్దిష్టమైన కీలకాంశాలను సైద్ధాంతికంగా ఆకళింపు చేసుకోవటానికి మదనపడుతున్నారు. వాటిల్లో ఈ విషయాలు కూడా ఉన్నాయి:

భారతీయ బూర్జువాల స్వభావం;
సామ్రాజ్యవాదంతో ఆ వర్గానికున్న సంబంధాలు (కుమ్మక్కు లేదా మిలాఖతు);
భూస్వామ్య విధానంతో దాని సంబంధాలు;
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్టీ భాగస్వామ్య స్వభావం, పార్టీ నిర్మాణం.

పార్టీ మిత్రునిగా, సిపిజిబి (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రేట్‌ బ్రిటన్‌) సభ్యునిగా వీటిల్లోని కొన్ని అంశాలను పరిశీలించి, విశ్లేషించే అవకాశం విక్టర్‌ కీర్నన్‌కు ఉన్నది. యుద్ధాన్ని, సామ్రాజ్యవాద యుద్ధ్ధంగా నిర్ధారించి దానిని పూర్తిగా వ్యతిరేకించిన పార్టీ తొలి వైఖరిని కీర్నన్‌ విమర్శించాడు. 1939లో పార్టీపై చట్ట వ్యతిరేక ముద్ర పడింది. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా భయంకర యుద్ధాన్నీ, ముంచుకొస్తున్న ఫాసిజం ముప్పునూ అంచనా వేయటంలో పార్టీ నాయకత్వం విఫలమైందని కీర్నన్‌ అభిప్రాయపడ్డాడు. 1941 నవంబరు తరువాత, యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా చిత్రించి యుద్ధ ప్రయత్నాలకు పూర్తి మద్దతు ప్రకటించిన పార్టీ వైఖరిని కూడా ఆయన విమర్శించాడు. నాజీవాదానికీ, జపాన్‌ సైనికవాదానికీ వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటానికి సంఘీభావంగా ముందుకు రావటం సరైన చర్యే. 1942 నాటి క్విట్‌ ఇండియా ఉద్యమానికి పార్టీ దూరంగా ఉంటూనే, అదే సమయంలోకాంగ్రెసు నాయకత్వాన్ని విడుదల చేయాలనీ, జాతీయ ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ పిలుపు ఇచ్చింది. అయితే, 1942నాటి క్విట్‌ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా నిలచి పార్టీ తప్పు చేసింది. అంతర్జాతీయ వైరుధ్యంతో అంటే, ఫాసిస్టు వ్యతిరేక పోరాటాన్ని, జాతీయ వైరుధ్యంతో అంటే, జాతీయ స్వాతంత్య్రం కోసం సాగే పోరాటాన్ని సమన్వయం చేయటంలో పార్టీ విఫలమైంది.

భారతీయ బూర్జువాలపట్ల వివిధ దశలలో ఉన్న అవగాహనే, కాంగ్రెసు పార్టీపట్లా, దాని నేతృత్వంలోని జాతీయోద్యమం పట్లా పార్టీ వైఖరినీ, వ్యూహాన్నీ, ఎత్తుగడలనూ నిర్దేశించింది. కీర్నన్‌తో సహా ఆనాటి మార్క్సిస్టులు భారతీయ బూర్జువాల గురించి ఎక్కువగా ఆలోచించలేదు. పెట్టుబడిదారీ పూర్వ సంబంధాలు, ఫ్యూడలిజం బలంగా ఉన్న తరుణంలో వలస పాలనలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న పెట్టుబడిదారీ వర్గం ఆరోగ్యకరమైన పెట్టుబడిదారీవ్యవస్థ పెరుగుదలను సాధించలేదన్నదే అప్పట్లో ఉన్న అభిప్రాయం. ''ప్రచ్ఛన్నంగా ఉండే ఆటంకాలనూ, గతం యొక్క జడత్వ భారాన్నీ తక్కువగా అంచనా వేసిన మార్క్స్‌, తిరుగులేని పరివర్తనా శక్తిగా పెట్టుబడిదారీ విధానానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. ఇదీ, దీని తరువాత వచ్చే సోషలిజమూ స్థానిక నేపథ్యాలతో ప్రభావితమవుతాయన్న'' (సామ్రాజ్యవాదం, దాని వైరుధ్యాలు, పేజి-62) అభిప్రాయాన్ని కీర్నన్‌ కలిగి ఉన్నాడు. నెహ్రూను కూడా ఆయన ఉదహరిస్తాడు. ''భారతీయ పెట్టుబడిదారులు పూర్తిగా తగని వారమని రుజువు చేసుకున్నారు. వారికి దృక్పథం లేదు, దృఢనిశ్చయం లేదు, బ్రహ్మాండమైన కర్తవ్యాల నిర్వహణకు కావలసిన సామర్థ్యం వారికి లేదు'', అంటూ స్వాతంత్య్రానంతరం నెహ్రూ వ్యాఖ్యానించాడు. ''ముప్పై యేళ్ళ తరువాత కూడా జ్యోతిశ్శాస్త్రమే భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమగా ఉంటుందని'', కీర్నన్‌ అపహాస్యంగా అన్నాడు. భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఆశ్చర్యకరమైన రీతిలో కోలుకుని త్వరితగతిని విస్తరించింది. ఈ వర్గాన్ని తక్కువగా అంచనా వేయటమే భారతదేశంలోని వామపక్షాలకు శాపంగా మారింది. కాగా, ఇప్పటి మావోయిస్టులతో సహా రకరకాలైన అతివాద వామపక్షవాదులు గత ధోరణినే ప్రతిబింబిస్తున్నారు.

మరో ఆలోచనా ధోరణికి చెందినవారు వాస్తవానికి బూర్జువాలవైపు దృష్టిని సారించారు. స్వాతంత్య్రానికి ముందు కమ్యూనిస్టు పార్టీలో వామపక్ష జాతీయవాద ధోరణి ఉండేది. విక్టర్‌ కీర్నన్‌ మిత్రులు కొందరు (వారిలో కొందరు కేంబ్రిడ్జి నుంచి వచ్చారు) పార్టీలోని ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తారు. జాతీయ బూర్జువా వర్గమూ, దాని ద్వారా వచ్చిన జాతీయ ఉద్యమమూ అభ్యుదయకరమైనవిగా వారు భావించారు. స్వాతంత్య్రానంతరం ఈ బూర్జువాలు రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నప్పుడు వామపక్షాల్లో ఒక భాగం, ''ప్రగతిశీల జాతీయ బూర్జువా వర్గం''తో పొత్తుపెట్టుకున్నది. మునుపటి సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రేరణ కూడా కొంతమేరకు ఉన్నది. భారతీయ బూర్జువా వర్గ ద్వంద్వ స్వభావాన్ని గుర్తించటానికిగాను కమ్యూనిస్టు పార్టీకి నాలుగు దశాబ్దాలు పట్టింది. ఇది అంతర్గత ఘర్షణలలో మునిగివుండటంతో పాటు, అదేసమయంలో సామ్రాజ్యవాద ద్రవ్య పెట్టుబడులతో కుమ్మక్కు అయింది. నయా ఉదారవాద ఛత్రఛాయల్లో భారతీయ పెట్టుబడిదారీ వర్గం బ్రహ్మాండంగా పెరిగిపోయింది. ఎప్పుడూ తక్కువగానే కనిపించే దాని శక్తి కట్టలు తెంచుకున్నట్లుగా తయారైంది. అయితే, ఈ పెట్టుబడిదారీ విధానం, 'స్థానిక నేపథ్యాలతో' బలంగా ప్రభావితమైందని విక్టర్‌ కీర్నన్‌ పేర్కొన్నాడు.

భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి గురించి, 'సామ్రాజ్యవాదం దాని వైరుధ్యాలు' అన్న తన గ్రంథంలో కీర్నన్‌ వ్యాఖ్యానించాడు. ''దీనికితోడు వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి రంగాల రెండింటా గణనీయమైన పెరుగుదల ఉన్నది. మౌలికంగా భారతదేశం తనదైన సామాజిక క్రమాన్ని బద్దలు కొట్టలేదు. ప్రస్తుతమున్న చట్రంలో పరిష్కరించసాధ్యం కానివిగా కన్పించే సమస్యలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నది'' (పుట-134). భారతదేశంలో పెట్టుబడిదారీ వర్గాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. భారతీయ బూర్జువా వర్గం గురించిన మార్క్సిస్టు విశ్లేషణకు సమగ్రతనూ, నవ్యత్వాన్నీ కల్పించవలసి ఉంది. ఈనాడు ఇక్కడ హాజరైన పరిశోధకులూ, ఇతరులూ ఈ తరహా అధ్యయనాలను చేపడతారని ఆశిస్తాను. ఈ అధ్యయనం, భారతీయ సమాజానికి ప్రత్యేకమైన అంతరువులు, వివక్షతలు, అణచివేతలు కలగలసివున్న, ఉదాహరణకు, కులం, తెగ, లింగ అణచివేతలోనూ, స్వేచ్ఛ, అభివృద్ధి నుంచి మొత్తం భౌగోళిక ప్రాంతాన్నే విస్మరించడంలోనూ ప్రతిబింబించే పొందిక, భారతదేశంలోని వర్గ నిర్మాణంతో సిద్ధాంత రీత్యా, ఆచరణ రీత్యా ఎలా ప్రభావితమైందీ, ఎలా కలసిపోయిందీ మనకు తెలియచెప్తుంది. ఈనాటికీ కమ్యూనిస్టు పార్టీకి ప్రధానమైన మద్దతు, ఉద్యమ ప్రాంతాల నుంచే (లేదా ఉద్యమ ప్రాంతాల విజయాలనుంచే) అంటే, ముఖ్యంగా ఎక్కడైతే, 1941 నుంచి 1948 వరకు సాగిన ప్రజా పోరాటాలలోని రెండు ప్రధానమైన చారిత్రక వాహినులను కలగలిపి నేతృత్వం వహించటంలో కమ్యూనిస్టులు ఫలప్రదమయ్యారో ఆ ప్రాంతాల నుంచే వస్తున్నది. వలస పాలన వ్యతిరేక పోరాటం, దోపిడీనుండి విముక్తి కోసం గ్రామీణ ప్రజల పోరాటం సాగాయి. ఆ రకంగా కమ్యూనిస్టులు సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను మిళితం చేసి ఈ ఐక్య పోరాటానికి నాయకత్వం వహించారు, ప్రజల మద్దతు సాధించగలిగారు. తెభాగా (బెంగాల్‌), ఉత్తర మలబార్‌ (కేరళ), గిరిజన పోరాటాలు (త్రిపుర), తెలంగాణా పోరాటం ఇందుకు ఉదాహరణలు.

కీర్నన్‌, కమ్యూనిస్టు పార్టీకి మిత్రునిగా, మద్దతుదారుగా ఉన్నాడు. అలాగని అప్పట్లో ఆయన విమర్శనాత్మక విశ్లేషణనూ, బలహీనతలను గమనించటాన్నీ విడచి పెట్టలేదు. బొంబాయిలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తరుచుగా సందర్శించేవాడు. పార్టీ నాయకులలోనూ, కార్యకర్తలలోనూ సిద్ధాంతం పట్ల ఆసక్తి కొరవడటం చూసి ఆవేదన చెందేవాడు. వారంతా నేర్పరులుగానూ, ఆచరణవాదులుగానూ ఉండేవారు. ఇదంతా కాఫీ హోటళ్ళలో మేధావులతో ఎడతెగని, లక్ష్యంలేని, తాత్విక చర్చల ఫలితమేనని కీర్నన్‌ భావించారు. ''ఎనిమిదేళ్ళ కాలంలో సైద్ధాంతిక అంశం గురించి తీవ్రంగా చర్చించటాన్ని నేనెప్పుడూ వినలేదని'', కీర్నన్‌ పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన మేరకు ఇది పాక్షికంగా మాత్రమే వాస్తవం. పార్టీ కార్యకర్తలనూ, రైతాంగాన్నీ సంఘటితం చేసేటపుడు సిద్ధాంతమూ, ఆచరణా ప్రస్ఫుటంగా కనిపించేవి. ఉదాహరణకు, ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌ కేరళలో జాతుల సమస్యపై అద్భుతమైన రచనను వెలువరించారు. చారిత్రక భౌతికవాద దృక్పథాన్ని అన్వయింప చేసి కేరళ సమాజాభివృద్ధిని వివరించారు. భారత కమ్యూనిస్టు పార్టీకి విస్తృతమైన ప్రజాపునాది, లక్షల సంఖ్యలో అనుయాయులు ఉన్నారు. 12 కోట్లమంది ప్రజలున్న మూడు రాష్ట్రాలలో కమ్యూనిస్టులు ప్రభుత్వాలను నడుపుతున్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో పనికి సంబంధించి కమ్యూనిస్టులు అమూల్యమైన అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఈ అనుభవానికి సైద్ధాంతిక రూపాన్ని ఇవ్వాలని వారు కోరుతున్నారు.

బహుశా, పునరావలోకన ధోరణితో కాబోలు ఆనాటి కమ్యూనిస్టు పార్టీపట్ల తాను మరీ పరుషంగా వ్యవహరించానంటూ తదనంతర కాలంలో ఆయన స్వయంగా నాకు జాబు రాశారు. ఆ తరానికి చెందిన కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు చూపిన త్యాగనిరతిని ఆయన శ్లాఘించాడు. 1940లలో కమ్యూనిస్టులు ప్రజలతో కలసిపోయి పనిచేశారు. పోరాటాలు నడిపారు. అపూర్వమైన త్యాగాలు చేశారు. మీరట్‌ కుట్ర కేసులో ఇతర కమ్యూనిస్టు నాయకులతోపాటు చెరసాల పాలైన బ్రిటిష్‌ కమ్యూనిస్టు బెన్‌ బ్రాడ్లేతో సహా పలువురు అనేక సంవత్సరాలపాటు కారాగారాలలో బందీలయ్యారు.
నేటి భారతంలో వామపక్షాలు
గ్రామీణ పేదరికాన్ని పారదోలటానికి అత్యావశ్యకమైన భూసంస్కరణల కోసం కమ్యూనిస్టులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో భూమి కోసం పోరాటాన్ని చేపట్టిన 1940ల నాటి అజెండానే ఇప్పటికీ కమ్యూనిస్టులు అనుసరిస్తున్నారు. దోపిడీ స్వభావంతో కూడిన భూ సంబంధాలను రద్దు చేయాలంటే కేవలం భూస్వామ్యతత్వంతోనే కాక, కుల, సామాజిక, లింగ అణచివేతలతో కూడిన వ్యవస్థతో పోరాడవలసి ఉంటుంది.

నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం దోపిడీని ముమ్మరం చేసి అసమానతలను తీవ్రతరం చేసింది. ఫోర్బ్స్‌ పత్రిక తాజా సమాచారం ప్రకారం భారతదేశంలో శత కోటీశ్వరుల సంఖ్య 2009లో 52కాగా, 2010 నాటికి 69కి పెరిగింది. అంటే, మూడింట ఒకవంతుకన్నా ఎక్కువన్న మాట. శత కోటీశ్వరుల పెరుగుదల రేటు పైపైకి పోతున్నది. పెట్టుబడి ఆదిమ సంచయన రూపాలు కొన్ని ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వామపక్షాలు నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తున్నాయి.
మతతత్వ రాజకీయాలనూ, కులాన్ని ప్రాతిపదికగా కలిగివున్న అస్తిత్వవాద రాజకీయాలను ప్రతిఘటించేలా ప్రజలను సమైక్యం చేయటానికి వామపక్షాలు కృషి చేస్తున్నాయి. నయా ఉదారవాద విధానాలతో పాటే భారత విదేశాంగ విధానంలో మార్పులు కూడా ప్రవేశించాయి. భారతదేశంలోని పాలకవర్గాలు అమెరికాతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకుంటున్నాయి. దీని ప్రభావం దేశ రాజకీయాలపై పడుతున్నది. అంతకంతకూ అమెరికాపై ఆధారపడటానికి వ్యతిరేకంగా దేశ ప్రయోజనాలకు నిజంగా దోహదపడే స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని వామపక్షాలు చెపుతున్నాయి.

విక్టర్‌ కీర్నన్‌ 90వ జయంతి సందర్భంగా భారతదేశంపై ఆయన రచనలను ఒక సంపుటిగా తీసుకు వస్తున్నాము. వచ్చే ఏడాది ఉపఖండంలోని భారత్‌, పాకిస్తాన్‌లలోని మేము ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ శత జయంత్యుత్సవాలను నిర్వహించనున్నాము. 20వ శతాబ్దంలో ఉపఖండానికి చెందిన మహా కవులలో ఆయనొకరు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫైజ్‌ గేయాలకు కీర్నన్‌ చేసిన అనువాదాలను ముద్రించాలను కుంటున్నాము. ప్రస్తుతం ఇవి అలభ్యంగా ఉన్నాయి. ఫైజ్‌పై ఆయన రాసిన వ్యాసాలు, ఇంటర్వ్యూలు కూడా ఈ ముద్రణలలో ఉంటాయి. ఉపఖండంలోని నూతన తరానికీ, భారత దేశానికీ నిజమైన మిత్రుడు అయిన విక్టర్‌ కీర్నన్‌ కృషిని ఇలా బయటకు తీసుకు రావాలను కుంటున్నాము.

 

0 comments: