ప్రాంతాలకతీతంగా కృష్ణాజలాల సాధనకోసం పోరాడాలి

గతంలో ప్రతి నాలుగేండ్లలో ఒక ఏడాది మాత్రమే మనకు నీళ్లు తగ్గేవి. ఇప్పుడు ఆధారిత జలాలను 65 శాతానికి తగ్గించడం (లభించే నీరు 2,578టియంసీ) వల్ల ప్రతి ఐదేండ్లలో రెండేండ్లు అధికారికంగా కేటాయించిన దానికన్నా తగ్గుతాయి. గత ప్రాతిపదిక ప్రకారం నికర జలాలు 800 టియంసీలు, మిగులు జలాలు 330 టియంసీలు కలిపి మొత్తం 1130 టియంసీలు వచ్చేవి. అదే నిష్పత్తితో ప్రస్తుత కేటాయింపుల్ని పరిశీలిస్తే 800 కి 138 టియంసీలు మాత్రమే కలుస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ్ద నిర్వాకం వల్ల మనం కృష్ణా మిగులు జలాలను కోల్పోయాం. రాష్ట్రాభివృద్ధిపై ఇది దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తీర్పును సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
గురువారం కృష్ణా జలాల ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు. ఈ తీర్పు ప్రకారం మనకు 1001 టియంసీల నీటిని కేటాయించారు. పైకి చూడటానికి నీటి వాటా పెరిగినట్లు కనిపిస్తుంది. కాని వాస్తవానికి మనం నష్టపోతున్నాం. తీర్పు పూర్తి పాఠం లభించకపోయినా వస్తున్న వార్తల్ని బట్టి ఇప్పటివరకు అనుభవిస్తున్న మిగులు జలాల వినియోగ అవకాశాన్ని కోల్పోవడమే గాక ఆల్మట్టి ఎత్తు పెంచడం, ఆధారిత జలాలను 75 శాతం నుండి 65శాతానికి తగ్గించడంతో రాష్ట్రం కరువుబారిన పడే ప్రమాదం పెరిగింది. (అంటే గతంలో ప్రతి వందేళ్లలో 75 ఏండ్లు మనకు కేటాయించిన జలాల సరఫరాకు గ్యారంటీ ఉంటుంది. కాని ఇప్పుడది 65 సంవత్సరాలకు పడిపోతుంది) బచావత్‌ కమిషన్‌ తీర్పు (1973) ప్రకారం కృష్ణా నదికి దిగువనున్న రాష్ట్రంగా మనకు మిగులు జలాలను ఉపయోగించుకునే అవకాశాన్ని (హక్కుగా కాకపోయినా) కల్పించింది. ఇప్పడు వాటిని మూడు రాష్ట్రాల మధ్య పంచింది. అందులో మనకు 190 టియంసీలు (65శాతం ఆధారిత జలాల కింద 39 టియంసీలు, రీసైక్లింగ్‌ జలాలు 6టియంసీలు, మిగులు 145 టియంసీలు) లభిస్తాయి. గతంలో మిగులు జలాలపై ఆధారపడే తెలంగాణా, రాయలసీమ, కోస్తా మెట్ట ప్రాంతాలకు నీటి సరఫరాకు ప్రాజెక్టులు రూపకల్పన చేసుకున్నాం. తెలుగుగంగ మొదలు శ్రీశైలం ఎడమగట్టు కాలువ, జూరాల, వెలిగొండ వరకు ఈ జలాలపైనే ఆధారపడ్డాయి. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి వంటి పలు ఎత్తిపోతల పథకాలు ప్రతికూలతలను ఎదుర్కొంటాయి. కొత్త ప్రాజెక్టులు నిధుల కొరతనే కాకుండా నీటి కొరతను కూడా ఎదుర్కొనే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ మిగులు జలాల పంపకానికి అంగీకరించినా కనీసం ఇప్పుడు అమల్లో ఉన్న ప్రాజెక్టులకైనా నీటిని గ్యారంటీ చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జలయజ్ఞం అంటూ గత ఐదారేండ్లుగా బాకా ఊదుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధనంపై తప్ప జలంపై శ్రద్ధ లేదని ఇప్పుడు రూఢ అయింది. అంతేకాదు ఇప్పుడేమో రాష్ట్ర ప్రజలను గాలికొదిలి ముఠా కొట్లాటల్లో మునిగి తేలుతున్నారు. ఇలా మన రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ నిర్వాకం వల్ల మనం కృష్ణా మిగులు జలాలను కోల్పోయాం. రాష్ట్రాభివృద్ధ్దిపై ఇది దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తీర్పును సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రకారం 75శాతం ఆధారిత జలాలలో (లభించే నీరు 2060 టియంసీ) మన రాష్ట్రం వాటా 811 టియంసీలు. అది గాక అదనంగా మరో 330 టియంసీల అదనపు జలాలు (వరద) వాడుకుంటున్నాం. అంతర్జాతీయ జల న్యాయసూత్రాలపై ఆధారపడి దిగువ పరీవాహక ప్రాంతాల కోసం ఈ ప్రతిపాదన చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా నష్టపోయేది దిగువ ప్రాంతాల వారే. ఈ నీరు ప్రతి ఏడూ గ్యారంటీ ఉండకపోయినా మూడునాలుగేండ్లకొకసారి వచ్చే వరదనీటిని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలో నిల్వ చేసుకొని వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా నీటిని మూడు రాష్ట్రాల మధ్య పంపకం చేసింది కొత్త ట్రిబ్యునల్‌. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పులోనే స్కీం 'బి' కింద ఈ ప్రతిపాదన చేశారు. నాడు మనం దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాం. ఫలితంగా స్కీం 'ఏ' అమల్లోకి వచ్చింది. గతంలో ప్రతి నాలుగేండ్లలో ఒక ఏడాది మాత్రమే మనకు నీళ్లు తగ్గేవి. ఇప్పుడు ఆధారిత జలాలను 65 శాతానికి తగ్గించడం (లభించే నీరు 2293టియంసీలు. గత 48 సంవత్సరాల లెక్కల ప్రకారం సగటు నీటి లభ్యత 2,578 టియంసీలు. ఈరెంటి మధ్య తేడానే మిగులు జలాలంటున్నారు) వల్ల ప్రతి ఐదేండ్లలో రెండేండ్లు అధికారికంగా కేటాయించిన దానికన్నా తగ్గుతాయి. గత ప్రాతిపదిక ప్రకారం నికర జలాలు 811 టియంసీలు మిగులు జలాలు 330 టియంసీలు కలిపి 1141 టియంసీలు వచ్చేవి. అదే ప్రస్తుత కేటాయింపుల్ని పరిశీలిస్తే 1001టియంసీలు వస్తున్నాయి. మిగులు జలాల్లో నికరంగా 185 టియంసీలు కోల్పోతున్నాం. తాజా లెక్కల ప్రకారం 75శాతం ఆధారిత జలాలపై మిగులు జలాలు 405 టియంసీలుంటాయి. ఈ లెక్కన మనం 315 టియంసీలు కొల్పోయినట్లు. అంటే నీళ్లూ తగ్గాయి. నీటి ఆధారమూ తగ్గింది. ఇలా రెండు విధాలుగా నష్టం జరిగింది. అయితే 'బి' స్కీం కన్నా ఇది గుడ్డిలో మెల్ల. ఏమైనా రాష్ట్ర వ్యవసాయరంగం ప్రగతిపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు బాగా నష్టపోతాయి.
ఈ తీర్పులోని మరో అంశం ఆల్మట్టి డ్యాం ఎత్తు (519 నుండి 524 మీటర్లకు)పెంచుకోడానికి కర్నాటక ప్రభుత్వానికి అనుమతి నివ్వడం. ఇది గతంలో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధ్దం. దేవెడౌడ ప్రధానిగా ఉన్న కాలంలో ఈ వివాదం పరిష్కారానికి జ్యోతిబసు చొరవతో నిపుణుల కమిటీని నియమించారు. వారు గేట్లు ఎత్తు పెంచరాదని చెప్పారు. దాన్నే తర్వాత సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. ఇప్పుడీ తీర్పు వల్ల ఆల్మట్టి నుండి శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరే నీరు ఆలస్యమవుతుంది. ఆల్మట్టి నిండాలంటే సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్‌లలో వచ్చే వరదల వరకు ఆగాలి. ఈలోగా మనకవసరమైన నీళ్లు వదలడం అనేది కర్నాటక దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. అంటే శ్రీశైలం, సాగర్‌ కింద నారుమళ్లు పోసుకోడానికి సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది. తరచుగా నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రజలు మేల్కొని రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చి ట్రిబ్యునల్‌ తీర్పుపై అప్పీలుకు పోవాలి. దాని కోసం మన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రాంతాలకతీతంగా ప్రజలంతా సమైక్యంగా ఉద్యమిస్తేనే సాధ్యమవుతుంది.
- అరుణతార

 

0 comments: