‘‘మైక్రో దారుణాలు’’ - 08
'మైక్రో'దారుణాలు - నయా ఉదారవాద దిశను మళ్లిస్తేనే ఫలితం
-గుడిపూడి విజయరావు
మైక్రోఫైనాన్స్ సంస్థల నుండి రుణాలు తీసుకొని వాటిని తీర్చలేక, ఆ సంస్థల వేధింపులు, అవమానాలు భరించలేక డజన్ల సంఖ్యలో పేదలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితిని నేడు మనం చూస్తున్నాం. ఈ సంస్థలను నియంత్రించాలని, వాటి అదుపు లేని దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. మైక్రో రుణాలు ఇంతగా పెరగడానికి మూల కారణం ఏమిటి, ఈ సంస్థలు ఇంత విస్తృతంగా ఎలా వ్యాప్తి చెందాయి అన్న అంశాల్ని మాత్రం చాల మంది పట్టించుకోవడం లేదు. బ్యాంకులను జాతీయం చేసి, రైతులు, చేతి వృత్తిదారులు, చిన్న వ్యాపారులు- ఇలా కొన్ని ప్రాధాన్యతలను నిర్దేశించుకొని రుణాలు అందించడానికి ప్రభుత్వం పూనుకున్న ఒకప్పటి విధానాల దిశ పూర్తిగా మారిపోయింది. ప్రపంచ బ్యాంకు ఆదేశిత నయా ఉదారవాద విధానాలను పూర్తిస్థాయిలో చేపట్టిన ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో చురుగ్గా జోక్యం చేసుకునే పాత్ర నుండి వైదొలుగుతున్నది. ప్రైవేటు, విదేశీ బ్యాంకులను సైతం విరివిగా అనుమతిస్తూ, జాతీయ బ్యాంకులూ లాభాల దృష్టితోనే పనిచేయాలనే విధానాలను ప్రవేశపెట్టింది. నయా ఉదారవాద లేదా సరళీకరణ విధానాల ఫలితంగా సంపద ఒక వైపున పోగుపడుతుండగా, మరొక వైపున పేదరికం పేరుకు పోతున్నది. అలాంటి పేదలకు రుణ సదుపాయం కల్పించడానికి మారిన వైఖరుల ఫలితంగా జాతీయ బ్యాంకులు సైతం సిద్ధపడటం లేదు. ఇలాంటి స్థితిలో పేదలు తమలో తామే గ్రూపులుగా ఏర్పడి ఉమ్మడి జవాబుదారీ పద్ధతిలో రుణాలు తీసుకునే విధంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఆవిర్భవించాయి. నయా ఉదార వాద విధానాలతో పాటు ఈ సంస్థలూ పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి.
నయా ఉదారవాద విధానాలకూ ఇలాంటి మైక్రోఫైనాన్స్ రుణాల పెరుగుదలకు విడదీయరాని లంకె ఉంది. ఒక దేశం నయా ఉదారవాద విధానాలను ఎంత వేగంగా అమలు చేస్తున్నదన్నదానికి, ఆ దేశం రుణ వితరణలో ప్రభుత్వ రంగం పాత్ర క్షీణించడానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. నయా ఉదార విధానాలకు విరుద్ధమైన దిశలో పయనించే దేశాలలో ఇలాంటి ప్రైవేటు రుణ సంస్థలకు బదులు, ప్రభుత్వ రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న అంశమూ మనం గుర్తించగలం. నయా ఉదారవాదవిధానాల అమలుకు ప్రపంచ పెట్టుబడిదారుల నుండి ఎన్నెన్నో ప్రశంసలందుకుంటున్న భారత దేశమే మొదటి దానికి ఉదాహరణ. నయా ఉదారవాద విధానాల దిశకు వ్యతిరేకంగా పయనిస్తూ, ప్రభుత్వం పాత్రను ప్రజల పాత్రను పెంచేందుకు కృషి చేస్తున్న చావెజ్ నాయకత్వంలోని వెనిజులా రెండవ దానికి తిరుగులేని ఒక ఉదాహరణ. ఇంటర్నేషనల్ యాక్సియన్ అనే సంస్థ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ ఇంక్లూజన్ విభాగం 2009 చివరిలో వివిధ దేశాలలో రుణగ్రహీతలకు ఉన్న రక్షణ గురించి ఒక నివేదికను విడుదల చేసింది. దానిలో భారత్‌కు సంబంధించిన భాగాన్ని, వెనిజులాకు సంబంధించిన భాగాన్ని పరిశీలిస్తే ఈ తేడా మరింత స్పష్టంగా అర్థమవుతుంది. పైగా ఈ నివేదిక మైక్రోరుణ సంస్థల కార్యకలాపాలను విస్తరించుకునే దృష్టితోనే రూపొందించబడింది.
ముందుగా భారత దేశానికి సంబంధించిన నివేదికను చూస్తే- ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితోపాటు, సరళీకృత విధానాలు బ్యాంకింగ్ పరిశ్రమ విస్తృతికి ఎంతగానో తోడ్పడ్డాయి. విదేశీప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో బ్యాంకింగ్ పరిశ్రమ మరింత చురుకుగా తయారయింది, పోటీవాతావరణం నెలకొన్నది. నేడు భారత దేశంలో 88 షెడ్యూల్డు బ్యాంకులు, 29 ప్రైవేటు బ్యాంకులు, 31 విదేశీ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ సంస్థల కార్యకలాపాలను రిజర్వుబ్యాంకు అజమాయిషీ చేస్తుంది. దీనికోసం బ్యాంకింగ్ ఓంబుడ్స్‌మన్ ఉంది. అది క్రెడిట్ కార్డుల సమస్యలు, సర్వీసులోపాలు, బయటకు కనిపించని చార్జీలు మొదలైన అంశాలను చూస్తుంది. దీనితో పాటు ఇటీవల కాలంలో రిజర్వుబ్యాంకు బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా (బిఎస్‌సిబిఐ) అనే సంస్థను ఏర్పాటు చేసే చివరి దశలో ఉంది. ఈ సంస్థ కొన్ని నిబంధనలను, ప్రవర్తనా నియమావళిని (రూల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్) రూపొందించింది. నిబంధనలకు నియమావళికి చాల తేడా ఉంది. నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. లేకపోతే శిక్షలు కూడ ఉంటాయి. నియమావళి అమలు స్వచ్ఛందం మాత్రమే.
ఉత్తమ బ్యాంకింగ్ విధానాలను అమలుచేయడం, పారదర్శకతను పెంచడం, బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునే వారికి, బ్యాంకులకు మధ్య సత్సంబంధాలను పెంపొందిచడం లాంటి లక్ష్యాలతో రూపొందించిన నిబంధనలు ఇలా ఉన్నాయి- సభ్యులు బ్యాంకింగ్ కోడ్‌ను ఎలా అమలు చేస్తున్నదీ బిఎస్‌సిబిఐకి పూర్తి వివరాలు అందచేయాలి. ఆ సంస్థ అధికారులు బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలను ఎప్పుడైనా సందర్శించి తనిఖీ జరపవచ్చు. ప్రతి సభ్య బ్యాంకు కోడ్ అమలు అధికారిని కలిగి ఉండాలి. ఇలాంటి నిబంధనలను అమలుచేయడంలో విఫలమయితే శిక్షలు ఎలాంటివో చూడండి- నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ క్రింది శిక్షలలో ఒక దానిని వేయవచ్చు. ఉల్లంఘనకు పాల్పడిన బ్యాంకు పేరును, వివరాలను బిఎస్‌సిబిఐ వార్షిక నివేదికలో పొందుపరుస్తారు. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలో సభ్యబ్యాంకుకు తెలియ చేస్తారు. సభ్యబ్యాంకుకు హెచ్చరిక, అభిశంసన జారీ చేస్తారు. సభ్యత్వాన్ని పరిమిత కాలానికి రద్దుచేయడం, లేదా సస్పెండ్ చేయడం. సభ్యబ్యాంకు ఉల్లంఘనను మీడియాలో ప్రచురించడం. ఇకపోతే స్వచ్ఛందంగా అమలు చేసే నియమావళి చూడండి- వడ్డీరేట్లు, ఫీజులు, చార్జీలు వినియోగదారునికి వెల్లడించాలి, ప్రచారం, ప్రోత్సాహక సామగ్రి అంతా స్పష్టంగా, తప్పుదోవపట్టించనిదిగా ఉండాలి, రుణవసూలు న్యాయమైనరీతిలో కస్టమర్లను ఒప్పించే రీతిలో ఉండాలి. కస్టమర్లను వారికి ఇష్టం వచ్చిన స్థలంలోనే కలుసుకోవాలి, ప్రైవసీని గౌరవించాలి, కస్టమర్లతో మర్యాదగా వ్యవహరించాలి, కస్టమర్లను సరైన సమయంలో మాత్రమే కలుసుకోవాలి, సాయంత్రం 7 గంటల తర్వాత కలుసుకోకూడదు, బకాయి వసూళ్లలో అపశృతులను నివారించాలి. అంటే ఇప్పుడు మైక్రోసంస్థల విషయంలో మనం వేటినైతే సరిచేయాలని కోరుకుంటున్నామో అవన్నీ సూక్తిముక్తావళి జాబితాలో ఉన్నాయి. ఇదీ మన దేశంలో పరిస్థితి!
వెనిజులాకు సంబంధించి యాక్సియన్ ఇంటర్నేషనల్ నివేదిక ఆరంభంలోనే ఇలా పేర్కొంది- వెనిజులాలో వడ్డీ రేట్లు, మైక్రోఫైనాన్స్‌కు ఇచ్చే కనీస మొత్తాలు మొదలైన అంశాలలో బ్యాంకులు కట్టుదిట్టమైన, కచ్చితంగా అమలుచేయాల్సిన నిబంధనలు ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకులు ఉన్నప్పటికీ అతి పెద్ద బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. బ్యాంకింగ్ రంగాన్ని సంపూర్ణంగా జాతీయం చేస్తానని అధ్యక్షుడు చావెజ్ చెబుతున్నాడు. మైక్రో ఫైనాన్స్‌కు వెనిజులా అనుకూలంగా లేదు. మొత్తం లాటిన్ అమెరికా దేశాలను చూస్తే వెనిజులా స్థానం క్రింది నుండి రెండవదిగా ఉంది. 2008లో బ్యాంకింగ్ చట్టానికి తెచ్చిన సవరణలు దాన్ని మరింత కఠినతరం చేశాయి. వడ్డీరేట్లు, ఫీజులు, కమిషన్లు లాంటి అంశాలలో వెనిజులా చట్టాన్ని మరింత పకడ్బందీగా చేస్తున్నది. వెనిజులాలో బ్యాంకింగ్ రంగాన్ని అజమాయిషీ చేయడానికి సుదెబాన్ అనే సంస్థ ఉంది. చావెజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైక్రోఫైనాన్స్ సంస్థలను అది ప్రోత్సహించడం లేదు. కొత్తగా అనుమతి ఇవ్వడం లేదు. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. ప్రైవేటు, ఎన్జీవోల ఆధ్వర్యంలోని మైక్రోఫైనాన్స్ సంస్థలను సుదెబాన్ నిరుత్సాహపరుస్తున్నది. ప్రభుత్వమే సబ్సిడీ పథకాల ద్వారా ప్రైవేటు, లాభరహిత మైక్రోఫైనాన్స్ సంస్థల కన్నా 6 నుండి 8 శాతం వరకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నది. వెనిజులాలో అధిక నియంత్రణ, జాతీయకరణ వైపు ధోరణి అధికంగా ఉండటంతో సబ్సిడీ రహిత పథకాలను దెబ్బతీస్తూ, ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ఎక్కువ అయ్యే అవకాశం అధికంగా ఉంది.
ఇది వెనిజులా సాధారణ వాతావరణం కాగా, చట్టప్రకారం ఆర్థిక సంస్థలు తప్పని సరిగా అమలుచేయాల్సిన నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం- నూతన చట్టం పారదర్శకత, అధిక వడ్డీలు, తప్పుడు వ్యాపారప్రకటనల విషయంలో చాల కచ్చితంగా ఉంది. ఉల్లంఘించిన వారికి జైలు శిక్షతో సహా విధించే శిక్షల వివరాలను పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం రుణగ్రహీతకు వడ్డీరేటును, సకాలంలో చెల్లించకపోతే విధించే పెనాల్టీలను తెలియచేయాలి. అన్ని రకాల ఫీజులు, కమిషన్లు, చార్జీలు, పాలనాపరమైన, రవాణా సంబంధిత ఖర్చులతో సహా స్పష్టంగా తెలియ చెయ్యాలి. కాంట్రాక్టు మొత్తం కాలంలో రుణ గ్రహీత చెల్లించాల్సిన పూర్తి మొత్తం ఎంతో తెలియచెయ్యాలి. లావా దేవీ ప్రారంభానికి కనీసం ఐదు రోజుల ముందే కాంట్రాక్టు వివరాలను రుణ గ్రహీతకు తెలపాలి. ఇలాంటి కచ్చితమైన నిబంధనలను పొందుపర్చిన ఆ నివేదిక, చివరిలో ఇలా పేర్కొంది- మైక్రోఫైనాన్స్ రంగంలో పోటీని పెంచేందుకు బదులుగా చావెజ్ తన ప్రభుత్వ ఆధ్వర్యంలో సబ్సిడీ, మైక్రోఫైనాన్స్ పథకాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రుణగ్రహీతల రక్షణలో పారదర్శకత అనేది వెనిజులాలో బలమైన నియంత్రణకు కారణమవుతున్నది. నియంత్రణకు లోబడి ఆయా సంస్థలు తమ వివరాలను, ఆడిట్లను, నెలవారీ ఫైనాన్స్ స్టేట్‌మెంట్లను పత్రికల్లో ప్రచురించాలి.
చూశారుగా అసలు రహస్యం ఎక్కడ ఉన్నదో. నేడు మన దేశంలో పరిస్థితికి మూలమైన సరళీకరణ విధానాలను వదిలిపెట్టి మైక్రోఫైనాన్స్ సంస్థల అక్రమాలు, అవకతవకలు, దౌర్జన్యాల గురించి ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం ఉండదు. నయా ఉదారవాద విధానాలపై పోరాటాన్ని తీవ్రం చేయాల్సిన అవసరాన్ని మైక్రో దా'రుణాలు' స్పష్టం చేస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment