అమెరికా వ్యూహంలో పావుగా మారిన భారత్‌

 - సీతారాం ఏచూరి

ఒబామా పర్యటన అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనను బట్టి, 'నిత్య హరిత విప్లవం' ద్వారా ఆహార భద్రతను పెంపొందించే పేరుతో భారతీయ మార్కెట్లోకి అమెరికన్‌ వ్యవసాయోత్పత్తులకు ప్రవేశం కల్పించనున్నారనేది అర్థమవుతున్నది. ఇప్పటికే, తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న భారతీయ వ్యవసాయ రంగం దీనితో 'మరణ శయ్య''పైకి చేరే పరిస్థితులు దాపురిస్తాయి. అత్యధిక సబ్సిడీలతో కూడిన అమెరికన్‌ వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారతీయ మార్కెట్లను ముంచెత్తినట్లయితే, ఇప్పటికే దేశాన్ని కలవరపెడుతున్న ఆత్మహత్యలు మరింతగా పెరుగుతాయి.
అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వచ్చాడు, చూశాడు, ఒక విధంగా చెప్పాల్సివస్తే, అమెరికా వాణిజ్య ప్రయోజనాలను సాధించుకోవటంతోపాటు, అమెరికా భౌగోళిక, రాజకీయ వ్యూహంలో భారత్‌ను మరింతగా ఇరికించటంలో కృత కృత్యుడయ్యాడు. ''పలు అమెరికన్‌ కంపెనీలను తీసుకురావడం, మార్కెట్లను తెరిపించడం, ఆ రకంగా ఆసియాలోనూ, ప్రపంచంలోనూ త్వరితగతిన పెరుగుతున్న మార్కెట్లలో మన అమ్మకాలు సాగించడమూ, దేశీయంగా ఉద్యోగాలను సృష్టించడమూ తమ యాత్ర ప్రాథమిక ఉద్దేశమని'', వాషింగ్టన్‌ నుండి బయలు దేరటానికి ముందు ఒబామా చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికలలో డెమొక్రాట్లు పరాజయం పాలైన పూర్వరంగంలో చెప్పిన పై మాటల్లో నిరాశ ధ్వనించినప్పటికీ యుక్తియుక్తంగానే ఉన్నాయి. నిరుద్యోగం 10 శాతానికి చేరింది, ఆర్థికంగా కోలుకునే అవకాశం దరిదాపుల్లో కనిపించటం లేదు, కనుక, తన ఉత్పత్తులను అమ్ముకోవడానికిగాను అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ్ధల మార్కెట్లను తెరిపించటం ఇప్పుడు అమెరికాకు అవసరం. 1500 కోట్ల డాలర్లతో కూడిన ఒప్పందాల కారణంగా అమెరికాలో సుమారు 75,000 మందికి ఉద్యోగాలు లభించగలవని, ఆయన భారత్‌ను విడిచివెళ్ళే సమయంలో విడుదలైన ఒక ప్రకటన వెల్లడించింది. ''అవి (ఒప్పందాలు) అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తాయి, ఇది వాస్తవమే, అయితే, అదే సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి భారతీయ పరిశ్రమలకు వీలు కల్పిస్తుంది'',, అని ఒబామా పేర్కొన్నారు. ఇవి భారత్‌ను ఊరడించేందుకు చెప్పిన మాటలు మినహా మరొకటి కావు.
పర్యటన అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనను బట్టి, 'నిత్య హరిత విప్లవం' ద్వారా ఆహార భద్రతను పెంపొందించే పేరుతో భారతీయ మార్కెట్లోకి అమెరికన్‌ వ్యవసాయోత్పత్తులకు ప్రవేశాన్ని కల్పించనున్నట్లు అర్థమవుతున్నది. ఇప్పటికే, తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న భారతీయ వ్యవసాయ రంగం దీనితో 'మరణ శయ్య''పైకి చేరే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అత్యధిక సబ్సిడీలతో కూడిన అమెరికన్‌ వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారతీయ మార్కెట్లను ముంచెత్తినట్లయితే, ఇప్పటికే దేశాన్ని కలవర పెడుతున్న ఆత్మహత్యలు మరింతగా పెరుగుతాయి. అణు రియాక్టర్లకూ, అదేవిధంగా తన రక్షణ పరికరాలకూ పెద్దయెత్తున కొనుగోలు ఆర్డర్లు రాగలవని అమెరికా ఊహిస్తున్నది. అమెరికా ప్రత్యేక జాబితా నుంచి భారతీయ సంస్థ్ధలను తొలగించడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఈ తొలగింపులో అణు ఇంధన సంస్థ్ధను చేర్చలేదు. సాంకేతిక పరిజ్ఞానం బదిలీతో సహా పౌర అణు సహకారానికి సంబంధించిన భారత్‌-అమెరికా ఒప్పందం ఆచరణ రూపాన్ని దాల్చలేదన్న విషయం దీనితో స్పష్టమవుతున్నది.
భారతదేశం ఇప్పటికే అభివృద్ధి చెందిందంటూ విందు సమయంలో ఒబామా ఘనంగా కీర్తించాడు. ఆర్థిక సహకారానికి సంబంధించిన సంయుక్త ప్రకటన మన మార్కెట్లను మరింత తెరిపించేదిగా ఉన్నది. ఔట్‌ సోర్సింగ్‌కు అవకాశాన్ని ఇవ్వకుండా విధానపరమైన నిర్ణయాలతో అమెరికన్‌ సంస్థలను ఒబామా ప్రభుత్వం నిరోధిస్తున్న సమయంలో ఈ విధంగా మార్కెట్లను తెరవటానికి ఒప్పందం జరిగింది. ఒబామా నిర్ణయం కారణంగా భారత్‌లో ఉపాధి అవకాశాలపై దుష్ప్రభావం పడుతుంది. ఐరాస భద్రతా మండలిలోకి శాశ్వత సభ్యునిగా భారతదేశ ప్రవేశానికి అమెరికా అంగీకరించటంతో ' వెలిగిపోతున్న భారతం'లో సంతోషం ఉరకలు వేసింది. పార్లమెంటులో మమ్ములను, మా ద్వారా భారతావనిని ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతీయ మూర్తిమత్వాన్ని కొనియాడారు. సున్నాను కనుగొనడంతో సహా భారతదేశ ఆధ్యాత్మిక తత్వాన్నీ, శాస్త్ర విజ్ఞానాన్నీ స్మరించారు. చాందినీ చౌక్‌, పంచాయతీలనూ, పంచతంత్రాన్ని ప్రస్తావించారు. ''పెరిగిన శక్తి, పెరిగిన బాధ్యతలతో కలసి వస్తుందని'' చెప్పటానికి ముక్తాయింపుగా పైమాటలను ఆయన చెప్పారు. తరువాత, బర్మాలో ప్రజాస్వామ్యం గురించి భారత్‌ నొక్కి చెప్పకపోవటాన్ని ఒకరకంగా మందలించినంత పని చేశారు. అటు పిమ్మట, సంపూర్ణ అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నందుకుగాను భారత్‌ను అభినందించాడు. అంటే, ఇరాన్‌పై ఆంక్షల విధింపుపై అమెరికా దారిలోనే మనం కూడా నడవాలని చెప్పడమన్న మాట. శాంతి, భద్రత, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అన్న విశ్వవ్యాప్త విలువలను ప్రస్తావించే సందర్భంలో అధ్యక్షుడు ఒబామా ఈ అంశాలను ప్రస్తావించారు.
విశ్వవ్యాప్త విలువలనేవి తప్పనిసరిగా విశ్వవ్యాప్తంగా వర్తించేవిగా ఉండాలి. బర్మాలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన ఒబామా అదేసమయంలో పాలస్తీనియన్ల మానవ హక్కులను ఇజ్రాయిల్‌ కాలరాయటం, ఈనాడు అమెరికాకు చెందిన దాదాపు 50,000 మంది సైనికులు ఇరాక్‌లో నిర్దాక్ష్యిణ్యంగా అమాయక పౌరులను ఊచకోత కోయటం లేదా క్యూబాపై అక్రమ ఆర్థిక దిగ్బంధనాన్ని అమలు చేయటం వంటి వాటిపై పూర్తిగా మౌనం వహించాడు. ఇలా చేయడంలో కేవలం రాజకీయమేకాక, బోళాతనం కూడా వున్నది. అణువ్యాప్తిని అరికట్టాల్సిన ఆవశ్యకత గురించీ, ఇరాన్‌పై ఆంక్షల గురించీ మాట్లాడి, ఇజ్రాయెల్‌పై పెదవి విప్పకపోవటం సామ్రాజ్యవాదుల వ్యూహాత్మక అజెండానే వెల్లడిస్తున్నది.
అమెరికా చేపట్టిన భౌగోళిక రాజకీయ ప్రపంచ సైనిక వ్యూహం అమెరికా ప్రయోజనాల పరిరక్షణ పేరుతో ప్రపంచంలో నియంతృత్వాలను నెలకొల్పటానికే దారితీస్తున్నది. కనుక, 'ఆవిర్భవించిన శకి'్తగా భారత్‌ను చూసేటందుకు అమెరికా సిద్ధపడుతున్నదంటే దానర్థం అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు భారతదేశం 'పెరిగిన బాధ్యత'తో మద్దతు ఇవ్వాలన్నదే. ఐరాస భద్రతా మండలిలో రెండేళ్ళపాటు తాత్కాలిక సభ్యురాలిగా భారతదేశం ఇలాంటి పాత్రనే పోషించాలని పార్లమెంటు ప్రసంగంలో ఒబామా పలుసార్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఆ రకంగా ఆయనగారు భారతదేశాన్ని శిక్షణలో ఉంచారు. ఈ రెండేళ్ళ శిక్షణా కాలంలో అమెరికా వైఖరిని బలపరచినట్లయితే, భారతదేశ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇవ్వటం గురించి అమెరికా నిశ్చయిస్తుందన్నమాట.
ఉగ్రవాద విషయంలో చిట్టచివరకు పాకిస్తాన్‌ను అమెరికా చివాట్లు వేసినందుకుగాను 'వెలిగిపోతున్న భారతం' విజయాన్ని సాధించినట్లుగా ఉబ్బితబ్బిబ్బవుతోంది. తమ భూభాగంపై 'ఉగ్రవాద శిబిరాలను' ధ్వంసం చేయాల్సిన అవసరం పాకిస్తాన్‌కు ఉన్నదని 26/11 విద్రోహులపై చర్య తీసుకోవాలని ఆయన అన్నారు. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ వ్యతిరేక చర్యలకు సైనికంగా, ఇతరత్రా సహకరిస్తున్నందుకుగాను పాకిస్తాన్‌కు కోట్లాది డాలర్ల సహాయం చేస్తున్న సమయంలో ఆయన ఈ మాట చెప్పారు. అసలు సంగతేమంటే, ఈ వ్యవహారాలలో అమెరికాకు పాకిస్తాన్‌ సహాయం కావాలి. కనుక, పాకిస్తాన్‌ను విడిచిపెట్టి, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికా మనతో కలిసి వస్తుందనుకోవటం అమాయకత్వమే అవుతుంది. అమెరికా రూపొందించుకున్న 'ఆఫ్‌పాక్‌' వ్యూహం పాకిస్తాన్‌ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు.
చివరగా తేలేదేమంటే ఉగ్రవాదాన్ని భారతదేశం తన స్వశక్తితోనే ఎదుర్కొనవలసి ఉంటుంది. కాని అందుకు బదులుగా మనం అమెరికా ఇచ్చే భ్రమాజనిత మద్దతుపై ఆధారపడాలనుకుంటున్నాము. డేవిడ్‌ హెడ్లీ అప్పగింత వ్యవహారాన్ని లేవనెత్తటంలో భారత్‌ ఎందుకు విఫలమైందో వివరించాల్సివుంది. ఇదేవిధంగా పారిశ్రామిక ప్రమాదాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని ఒబామాకు గుర్తుచేయటంలో కూడా భారత్‌ విఫలమైంది. మెక్సికన్‌ గల్ఫ్‌లో చమురు తెట్టు పేరుకున్నందుకుగాను బిపి షెల్‌ నుంచి కోట్లాది డాలర్లను డిమాండు చేసిన ఒబామా భోపాల్‌ దురంతంలో డోవ్‌ జోన్స్‌ కంపెనీని కచ్చితంగా బాధ్యురాల్ని చేయాల్సి ఉంది. కానీ, ఆయన ఆ ఊసే ఎత్తలేదు. దీనిపై మన్మోహన్‌ ప్రభుత్వమూ మాట్లాడదు.
అంతిమంగా తేలిందేమిటంటే, ప్రపంచదేశాలలో భారతదేశం తన అంతర్గత శక్తితోనే నిలవాలి. ప్రపంచంలో నిలచేటందుకుగాను అమెరికాకు అంతేవాసిగా మారాలన్న భారత ప్రభుత్వ వైఖరి సరిగ్గా ఈ శక్తినే దెబ్బతీస్తున్నది. అత్యధిక సంఖ్యాకులుగా ఉంటూ, నిజమైన భారతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నిరుపేద భారతీయుల జీవితాన్ని మెరుగుపరచటం కోసం మనం చేసే పోరాటంలో ఇవీ, వీటితోపాటు అనేక కీలకాంశాలు ఉండనున్నాయి. భారతీయ వామపక్షవాదులమైన మేము ఒబామా మాటలు విన్నాము. మా మాటలు కూడా ఆయన వినాలనే మేము కోరుకుంటున్నాము.

 

0 comments: