అమెరికా ప్రయోజనాలే ఎజెండా : యుఎస్‌ అధ్యక్షుని పర్యటనపై సిపిఎం పొలిట్‌బ్యూరో

ఒబామా భారత పర్యటన అమెరికా ప్రయోజనాలే ప్రధాన అజెండాగా సాగినట్లు సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఒబామా నాలుగు రోజుల పర్యటన ఫలితాలపై ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒబామా పర్యటన అమెరికాతో వ్యూహాత్మక పొత్తును మరింత పటిష్టపరిచింది. భారతీయ మార్కెట్లను అమెరికా వ్యాపార, వాణిజ్య ప్రయోజనాల కోసం తెరవడం, భారత్‌ను మరింతగా భద్రత, సైనిక బంధం దిశగా నడిపేందుకు అది చేసిన యత్నాలను పర్యటన ముగింపులో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన
వెల్లడించింది. తీవ్ర మాంద్యం, పెద్ద ఎత్తున నిరుద్యోగం దాని ఆర్థిక వ్యవస్థను కుదుపుతున్న నేపథ్యంలో అమెరికా తన దిగుమతులను తగ్గించుకొనేందుకు, ప్రపంచవ్యాప్తంగా తన ఎగుమతులను పెంపొందించు కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్థిక సహకారానికి సంబంధించిన ప్రణాళిక ఉమ్మడి ప్రకటనలో ప్రస్ఫుటంగా బహిర్గతమైంది. ఆహార భద్రతను ప్రోత్సహించడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే పేరిట వాల్‌మార్ట్‌, మోన్‌శాంటో వంటి అమెరికా బహుళజాతి కంపెనీల లాభాల కోసం భారతీయ వ్యవసాయాన్ని, రిటైల్‌ వ్యాపారాన్ని తెరిచే అజెండాను ఈ పర్యటన ముందుకు నెట్టినట్లు పొలిట్‌బ్యూరో ఆ ప్రకటనలో తెలిపింది. ఇది భారత్‌లోని కోట్లాది పేద, మధ్య తరగతి రైతులు, అసంఘటిత రంగ చిల్లర వ్యాపారుల ప్రయోజనాలకు హానికరంగా ఉంటుంది. విదేశీ బహుళజాతి విత్తన కంపెనీల ప్రయో జనాలను ప్రోత్సహించే, భారతీయ రైతుల విత్తన హక్కులను కాలరాసేవిత్తన చట్టాన్ని ఆమోదించడంలో భారత ప్రభుత్వ అజెండా దాగి ఉంది. అమెరికా కంపెనీలకు భారతీయ ఆర్థిక, ఉన్నత విద్యా రంగాన్ని తెరవడానికి మార్గం సుగమం చేస్తోంది. అమెరికా-భారత్‌ సిఇఓ వేదిక ఆదేశాల మేరకే ఇదంతా చేస్తున్నారు.


యుపిఎ ప్రభుత్వ వైఖరి కూడా ఈ పర్యటనలో వెల్లడైందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. విస్తృత ప్రజానీకాన్ని పేదరికం, ఆకలి, వ్యాధుల నుంచి విముక్తి చేయడం భారత ప్రాధాన్యతగా ఉంటుందని, ఈ దిశగానే అమెరికాతో సంబంధాలను రూపొందిస్తానని నొక్కి చెప్పడానికి బదులు ప్రపంచ శక్తిగా భారత్‌ను ఒబామా గుర్తించడంతో భుజాలు చరుచుకుంటూ అమెరికా వ్యాపార, వ్యూహాత్మక ప్రయోజనాలను కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కాపాడిందని పేర్కొంది. పెద్ద ఎత్తున అమెరికా ఆయుధాలను కొనుగోలు చేసే విధంగా సన్నిహిత భద్రత, రక్షణ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, మానవహక్కులు, ప్రజాస్వామ్యం, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై అమెరికా మోసపూరిత, స్వప్రయోజనాలతో కూడిన మాటల్లో పడి కొట్టుకుపోవడం వంటివి ఉమ్మడి ప్రకటనలో వెల్లడయ్యాయి. ఇదంతా మన్మోహన్‌ సింగ్‌-బుష్‌ 2005, 2006లో చేసిన ఉమ్మడి ప్రకటనల కొనసాగింపు, పునరుద్ఘాటనేనని పొలిట్‌బ్యూరో తెలిపింది. ఇరాన్‌పై ఆంక్షలను భారత్‌ అంగీకరించింది. అయితే ఇజ్రాయిల్‌, దాని అణు ఆయుధాగారంపై మౌనం వహించింది. అమెరికా ఎగుమతి చేసే ప్రజాస్వామ్యం, మానవహక్కుల జోక్యాలకు సంబంధించి 'బాధ్యతాయుతంగా' ఉండాల్సిందిగా భారత్‌కు చెప్పింది.

ఈ ఏకపక్ష వ్యాఖ్యానంలో గాజాలో పాలస్తీనా మానవహక్కులు లేదా క్యూబాపై అక్రమ ఆంక్షలు లేదా గత ఏడేళ్ళ సైనిక దురాక్రమణలో ఇరాక్‌ పౌరుల ఊచకోత వంటి వాటి ప్రస్తావనే లేదు. ఐక్యరాజ్యసమితిని, దాని స్వతంత్ర పాత్ర, ప్రపంచ వ్యవహారాల్లో దాని ప్రభావం ప్రాతిపదికన ప్రజాతంత్రీకరించినప్పుడు భారత్‌ భద్రతా మండలిలో శాశ్వత సభ్యురాలు కాగలదు. అమెరికా మద్దతిచ్చినందుకు దాని వ్యూహాత్మక ప్రయోజనాలకు తల వంచరాదు. మండలిలో భారత్‌ రెండేళ్ళ పదవీకాలం అమెరికాకు సంబంధించినంత వరకూ ప్రొబేషనరీ కాలమేననేది ఉమ్మడి ప్రకటనలో నిక్షిప్తమై ఉంది. 2009లో తుది వినియోగ ఒప్పందంపై సంతకం చేసిన అనంతరం అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తామనే వాగ్దానం వచ్చింది. అలాంటి ఆయుధ కొనగోళ్ళ ద్వారా భారత్‌ ఏమాత్రం లాభపడదు. ఆ ఒప్పందం ద్వారా ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించడానికి గానీ, విడిభాగాలు తయారు చేయడం గానీ చేయజాలం. పైగా వార్షిక తనిఖీలకు అనుమతించాల్సి వచ్చింది. కొన్ని భారతీయ కంపెనీల కోసం ద్వంద్వ వినియోగ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటుపై షరతులు తొలగించినందుకు ఆయుధాలు కొనుగోలు చేయడం, రెండు దేశాల సాయుధ దళాలను దగ్గరికి చేర్చే చర్యలు సహా కొత్త ఒప్పందాలేమైనా మున్ముందు ఉన్నాయా అనే విషయాన్ని యుపిఎ ప్రభుత్వం వివరించాల్సి ఉందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.

ఉమ్మడి ప్రకటనలో ఆమోదించిన అమెరికా 'ఆఫ్ఘన్‌-పాక్‌' విధానం వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో సమస్య పరిష్కారం కాదు. దానికి బహుళపక్ష వైఖరి అవసరం. ఉగ్రవాదంపై పోరాటంలో సహకారంపై చర్చ ఉన్నప్పటికీ హెడ్లీని విచారించేందుకు పంపాలనే ఒత్తిడి భారత్‌ పక్షం నుంచి లేదు. తన దేశ వ్యవసాయానికి పెద్ద ఎత్తున సబ్సిడీలను అనుమతిస్తూనే వర్ధమాన దేశాల మార్కెట్లను తెరవాలనే అమెరికా అసంగత అజెండా డబ్ల్యుటిఒ దోహా రౌండ్‌ను గురించి ప్రస్తావించడంలో వెల్లడైంది. అనుబంధ పరిహారంపై సదస్సుపై భారత్‌ సంతకాలు చేస్తుందని, ఆమోదిస్తుందనే ప్రస్తావన ఉమ్మడి ప్రకటనలో ఉంది. ఇది పౌర అణు పరిహార సమస్యకు సంబంధించింది. అణు ప్రమాదాలు జరిగినప్పుడు నష్టాలకుగాను విదేశీ సరఫరాదార్లు పరిహారం చెల్లించాలనే చట్టాన్ని భారతదేశ పార్లమెంటు ఆమోదించింది. అనుబంధ పరిహారంపై సదస్సులో చేరాలనే యుపిఎ ప్రభుత్వ నిర్ణయం దేశంలోని చట్టాన్ని ఉల్లంఘించేదిగా ఉంది. భారత్‌-అమెరికా సంబంధాల్లో అత్యంత ముఖ్యమైనదైన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన బాధితులకు న్యాయం చేయడానికి సంబంధించిన అంశాన్ని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం లేవనెత్తకపోవడం దురదృష్టకరం. అమెరికాతో ఏక పక్ష, అసమాన సంబంధాలను కార్పొరేట్‌ మీడియా పూర్తిగా ప్రశంసించినప్పటికీ అలాంటి సంబంధాల ద్వారా భారతదేశ ప్రజల నిజమైన ప్రయోజనాలు నెరవేరవని పొలిట్‌బ్యూరో తెలిపింది. సమానత్వం, పరస్పర ప్రయోజనం ప్రాతిపదికన ఉండే భారత్‌-అమెరికా సంబంధాలు అవసరమని ఆ ప్రకటన స్పష్టం చేసింది.

 

0 comments: