ఒబామా బృందం ఆశిస్తున్న ఒప్పందాలు

వ్యవసాయం : వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్‌ రంగాల్లో అమెరికా అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు భారతదేశం ముందుకు రావాలి. ఈ మేరకు అమెరికా సంస్థలకు తగు అవకాశాలివ్వాలి. జన్యు మార్పిడి (జిఎం) పత్తి విత్తనాలను ఇప్పటికే మోన్‌శాంటో అందిస్తోంది. ఇదే తరహాలో కార్గిల్‌, మెక్‌ డొనాల్ట్స్‌, హింజ్‌, తదితర సంస్థలకు విస్తృత అవకాశాలివ్వాలి. రైతుల నుంచి నేరుగా వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్‌ సంస్థకు
అవకాశమివ్వాలి. 'భారత్‌-అమెరికా వ్యవసాయ ఒప్పందం' మరింత ముందుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలి. తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, డైరీ, ఉద్యాన ఉత్పత్తుల విషయంలో పన్నులను సరళీకృతం చేయాలి. తద్వారా రెండు దేశాల మధ్య ఈ ఉత్పత్తుల వ్యాపారం రెట్టింపవుతుంది. ఆహార ప్రాసెసింగ్‌ యంత్రాలు, రెస్టారెంట్ల ఉపకరణాలపై పన్నులను తగ్గించాలి. అమెరికాలో తయారయ్యే వస్తువులపై పన్నులను తగ్గిస్తే, భారత మార్కెట్‌లో వాటి వినియోగంపై కార్పొరేట్‌ సంస్థలకు ఒక అవగాహన వస్తుంది. భవిష్యత్‌ పెట్టుబడి ప్రణాళికలకు అది దోహదం చేస్తుంది.
రక్షణ : రానున్న ఐదేళ్లలో భారత్‌ తన రక్షణరంగంపై 4,500 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. అమెరికా కంపెనీలకు ఇది సువర్ణావకాశం. రక్షణ పరిశ్రమలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుత 26 శాతం నుంచి 74 శాతానికి పెంచాలి. పది సి17 గ్లోబ్‌మాస్టర్‌-3 భారీ రవాణా విమానాలు, నాలుగు పి8ఐ విమానాలు, వంద జిఇ 414 విమాన ఇంజన్లతో పాటు ఇతర కంపెనీల రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు భారత ప్రభుత్వం ఒప్పందాలు సిద్ధం చేయాలి. ఎన్‌పిటి, తదితర ఒప్పందాలపై భారత ప్రభుత్వం సత్వరం సంతకం చేయాలి. అమెరికా ప్రభుత్వం రూపొందించిన సిస్‌మో (కమ్యూనికేషన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌), బెక ( బేసిక్‌ ఎక్సేంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌)పై భారత ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయాలి. తద్వారా మరిన్ని రక్షణ ఉత్పత్తులను, రక్షణరంగ పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అవకాశం లభిస్తుంది.
విద్య : భారత్‌లో విద్యారంగం ఆధునీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశానికి భారత్‌ అనుమతించాలి. తద్వారా అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల విద్యా సంస్థలు భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశముంటుంది. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న విదేశీ విద్యా బిల్లుకు భారత ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం పొందాలి.
స్వేచ్ఛా వాణిజ్యం-చిల్లర వర్తకం : అమెరికాతో ప్రత్యేకంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కుదుర్చుకునేందుకు భారత ప్రభుత్వం ముందుకు రావాలి. స్వేచ్ఛా వాణిజ్యానికి అడ్డుగా ఉన్న పన్నులు, ఇతర ఆటంకాలపై దృష్టి పెట్టేందుకు రెండు దేశాలు ప్రత్యేకంగా ఒక్కో ఉన్నతాధికారిని నియమించాలి. బహుళ ఉత్పత్తుల చిల్లర వర్తకంలో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించాలి. వాల్‌మార్ట్‌కు చెందిన 'హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ' స్టోర్లను విస్తృతంగా ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాలి. ద్వంద్వ లైసెన్సుల విధానాన్ని అమలు చేయడం ద్వారా అమెరికా కంపెనీలు తమ వస్తువులు, సాఫ్ట్‌వేర్‌, ఇతర పరిజ్ఞానాన్ని, తమ భారత భాగస్వామ్య కంపెనీలకు ముందస్తు అనుమతి లేకుండా తరలించేందుకు అనుమతించాలి.
మౌలిక వసతులు - ఆర్థిక సేవలు : మౌలికవసతుల రంగంలో ప్రైవేటురంగాన్నీ ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో అమెరికా కంపెనీల నైపుణ్యాన్ని, అనుభవాన్ని భారత ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. రోడ్లు, పోర్టులు, వ్యూహాత్మక కారిడార్లు, రవాణా హబ్స్‌, విమానాశ్రయాలు, విద్యుదుత్పత్తి పరిశ్రమ రంగాల్లో అమెరికా-భారత్‌ కంపెనీలు సంయుక్తంగా కృషి చేయాలి. భవిష్యత్తులో భారీగా అమెరికా కంపెనీలు ప్రవేశించే అవకాశం ఉన్నందున భారత బీమా, బ్యాంకింగ్‌ రంగాలనూ సరళీకరించాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింతగా అవకాశం ఇవ్వాలి.

 

0 comments: