షరతులు అంగీకరించరాదు : భద్రతా మండలిలో సభ్యత్వంపై ఏచూరి

  • అమెరికాది ఒక్కో దేశానికీ ఒక్కో నీతి
  • పార్లమెంటులో 'మైక్రో ఫైనాన్స్‌'పై ప్రస్తావన
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత ప్రభుత్వం ఒబామా నిర్ధేశించిన షరతులకు అంగీకరించరాదని సిపిఎం రాజ్యసభ నేత సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అమెరికా దయాదాక్షిణ్యాల ద్వారా భారతదేశం ఎన్నటికీ సూపర్‌ పవర్‌ కాలేదని స్పష్టం చేశారు. పార్టీ లోక్‌సభ నేత వాసుదేవ ఆచార్యతో కలిసి మంగళవారం ఆయన
పార్లమెంటు భవనంలో విలేకరులతో మాట్లాడారు. ''భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం ఒబామా అనేక షరతులు పెట్టారు. గొప్ప అధికారాలు కావాలంటే గొప్ప బాధ్యతలనూ పంచుకోవాలని చెప్పారు. మయన్మార్‌, ఇరాన్‌ దేశాలకు సంబంధించి అంతర్జాతీయ వేదికల్లో భారత్‌ వైఖరిని ఆయన మన పార్లమెంటులోనే తప్పుబట్టారు. భవిష్యత్తులో ఈ దేశాల విషయంలో అమెరికాకు వంత పాడాలని స్పష్టం చేశారు. విశ్వవ్యాప్త విలువలు, చట్టాల గురించి ఒబామా మాట్లాడారు. విశ్వవ్యాప్త విలువలు విశ్వవ్యాప్తంగా అమలవ్వాలి. మయన్మార్‌లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడుతున్న ఒబామాకు పాలస్తీనాలో పౌర హక్కుల ఉల్లంఘన కనబడటం లేదా? ఇరాక్‌లో అమెరికా సైన్యం దాష్టీకాలు గుర్తుకురాలేదా? ఇరాన్‌ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాలకు సహకరించడం లేదన్న ఒబామాకు, ఇజ్రాయిల్‌ ఇష్టానుసారంగా అణ్వాయుధాలను తయారు చేస్తున్న విషయం తెలియదా ?'' అని ఏచూరి ప్రశ్నించారు.


అమెరికా ఒక్కో దేశానికీ ఒక్కో నీతిని ప్రవచిస్తోందని విమర్శించారు. భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా రానున్న రెండేళ్లలో భారత్‌ వ్యవహార శైలి ఆధారంగానే శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తామని అమెరికా చెప్పకనే చెప్పిందని ఏచూరి వ్యాఖ్యానించారు. స్వతంత్ర విదేశాంగ విధానం, పొరుగు దేశాలతో సత్సంబంధాల ద్వారా మాత్రమే ప్రపంచ పటంలో భారత్‌కు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద క్యాంపుల గురించి ఒబామా ప్రస్తావించినంత మాత్రాన సంబరపడాల్సిన అవసరం లేదన్నారు. ''భారత్‌ పర్యటనకు రాబోయే ముందు పాక్‌ ప్రభుత్వానికి ఒబామా రెండు బిలియన్ల నిధులు అందించారు. మరోపక్క ఉగ్రవాద క్యాంపులను నిరోధించాలని పాక్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు మనకు చెబుతున్నారు. భారతదేశానికి అమ్ముతున్న ఫైటర్‌ విమానాలను, పాకిస్తాన్‌కూ ఆయన అమ్ముతున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచడానికి ఆయన కారణమౌతున్నారు. ఉగ్రవాద నిర్మూలన అంశంలో మనకు అమెరికానో, మరో దేశమో సహాయం చేస్తుందన్న భ్రమలను భారత పాలకులు వీడాలి'' అని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉద్యోగాల కల్పన కోసం, భారత్‌ ఉద్యోగాల్లో కోత పెట్టాలని ఒబామా తన పర్యటనలో ప్రతిపాదించారని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రయోజనాల కోసమే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నామనడం పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని వ్యాఖ్యానించారు. భారత వ్యవసాయరంగంలోకి అమెరికా కంపెనీలు ప్రవేశిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు.
10 అంశాల ప్రస్తావన
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తమ పార్టీ మొత్తం 10 ప్రధాన అంశాలను ప్రస్తావిస్తుందని ఏచూరి తెలిపారు. ఆదర్శ్‌, 2జి, కామన్వెల్త్‌ కుంభకోణాలపై సభలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఒకరిద్దరి రాజీనామాలతో అవినీతిని మరుగుపర్చాలని చూడటం సరికాదన్నారు. అవినీతితో పాటు, కాశ్మీర్‌ పరిస్థితి, ధరల పెరుగుదల - ఆహార భద్రత, నిరుద్యోగం, అంతర్గత భద్రత - ఉగ్రవాద చర్యల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర, రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక, పొరుగు దేశాలతో సంబంధాలు, అక్రమ మైనింగ్‌ అంశాలను తాము ఉభయ సభల్లోనూ ప్రస్తావిస్తామని చెప్పారు. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ఆగడాలనూ పార్లమెంటు దృష్టికి తీసుకొస్తామన్నారు. పేదలకు సాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన మైక్రో సంస్థలు, వారి ఆత్మహత్యలకు కారణమౌతున్నాయని ఏచూరి వ్యాఖ్యానించారు.

 

0 comments: