'అణు' ప్రమాదం ముంగిట ప్రపంచం: క్యూబా విప్లవనేత ఫైడల్ కాస్ట్రో
మానవాళిపైనా, భూమండలంలోని జీవులపైనా అణు యుద్ధ ప్రమాదం, దానివల్ల కలిగే దుష్ఫలితాలు ఏ మేరకు ఉంటాయి?
కొన్నేళ్లుగా ముఖ్యంగా ఇటీవలి కొద్ది నెలలుగా ప్రపంచ గమనం అణు యుద్ధం దిశగా సాగుతున్న తీరు నాకు ఆందోళన కల్గిస్తోంది. సాధారణంగా పెట్టుబడిదారీ విధానాన్ని విశ్లేషించే ముందు నేను మానవత్వం మీద సామ్రాజ్యవాద దాడి దుష్ఫలితాలపై దృష్టి పెట్టాను. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఎవరూ అణ్వాయుధాల గురించి మాట్లాడలేదు. ప్రజలందరూ శాంతి గురించే మాట్లాడేవారు. యుద్ధం సంభవిస్తే పరస్పర విధ్వంసం అనివార్యమన్న భావన అప్పటి సోవియట్ యూనియన్, అమెరికా మధ్య ఉండేది. దీనితో అందరూ శాంతిని కోరుకునే వారు. ప్రపంచమంతా చిరకాలం శాంతి విలసిల్లాలన్న భావన అందరిలో ఉండేది.
ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడటంతోనే 'పరస్పర విధ్వంసం అనివార్యమన్న' భావనకు కూడా తెరపడింది. ఆ తరువాత అణుయుద్ధ తంత్రం పునర్నిర్వచింపబడింది. ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అణు యుద్ధం అన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. ఇప్పుడు ఆ ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాన్ని రాబర్ట్ మెక్‌నమారా కూడా కొంతకాలం క్రితం అంగీకరించారు. అయితే ప్రచ్ఛన్న యుద్ధానంతరం ముఖ్యంగా 2001, సెప్టెంబర్ 11 తరువాత అమెరికా తన అణుయుద్ధ తంత్రాన్ని పునర్నిర్విచించడం ప్రారంభించింది.
అణు యుద్ధ ప్రమాదం ముంచుకొస్తోందన్న భావన మీకెప్పుడు కలిగిందని మీరు నన్ను అడుగుతున్నట్లుంది. దాదాపు ఆర్నెల్ల క్రితం దక్షిణ కొరియాకు చెందిన యుద్ధ నౌక మునిగిపోయిన ఘటన అణు యుద్ధ ప్రమాదంపై హెచ్చరిక సంకేతాలు పంపింది. ఎప్పుడో ఆరు దశాబ్దాల నాడు సోవియట్ రష్యా తయారు చేసిన జలాంతర్గామి, దానిలో ఉపయోగించిన కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ అత్యాధునిక యుద్ధ నౌకను ముంచివేయడం అసాధ్యమన్న విషయాన్ని గ్లోబల్ రిసెర్చ్ జర్నలిస్ట్‌ల నివేదిక మనకు వెల్లడించింది. అమెరికా నౌకలతో కలిసి యుద్ధ విన్యాసాలు జరుపుతున్న నౌకను రష్యా జలాంతర్గామి గుర్తించి నీట ముంచివేసిందన్న వాదన అసంబద్ధమని ఈ ఉదంతం మనకు తెలియజేస్తోంది. దక్షిణ కొరియా తన నౌక ముంచివేతపై ఉత్తర కొరియాను హెచ్చరించి కవ్వించడం వంటి చర్యలు ఇరాన్‌పై దురాక్రమణకు జరుగుతున్న చర్యల పట్ల కలుగుతున్న మన ఆందోళనను రెట్టింపు చేశాయి. 1950 దశకంలో బ్రిటీష్ పెట్రోలియం కంపెనీ (ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ)ని ఇరాన్ జాతీయం చేసినప్పటి పరిణామాలు మనందరికీ తెలిసినవే. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఈ ఏడాది జున్ 9న ఐరాస భద్రతా మండలి ఆమోదించిన 1929వ తీర్మానానికి అనుకూలంగా 12 సభ్య దేశాలు ఓట్లు వేశాయి. వాటిలో ఐదు దేశాలకు వీటో హక్కు ఉంది. ఒక దేశం ఓటింగ్‌కు గైర్హాజరు కాగా బ్రెజిల్, టర్కీ వ్యతిరేకంగా ఓటు చేశాయి. ఈ తీర్మానానికి భద్రతా మండలి ఆమోదముద్ర పడిన వెంటనే యుద్ధ విమానాలతో కూడిన అమెరికా విమాన వాహక నౌక, ఒక అణు జలాంతర్గామి ఈజిప్ట్ ప్రభుత్వ సహాయంతో సూయజ్ కాల్వ ద్వారా ఇరాన్ సమీపానికి చేరుకున్నాయి. వీటికి ఇజ్రాయిల్ నౌకా దళం జత కలిసింది. ఇరాన్‌పై అమెరికా, దాని మిత్రదేశాలు విధించిన ఆంక్షలు అర్థరహితమైనవి, అభ్యంతరకరమైనవి. భద్రతా మండలి ఆమోదించిన అత్యంత ప్రమాదకరమైన 1929వ తీర్మానంపై చైనా, రష్యా ఎందుకు వీటో చేయలేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అరబ్ అణు పరిశోధనా కేంద్రాలపై గతంలో ఇజ్రాయిల్ జరిపిన దాడులు నాకు ఇంకా గుర్తున్నాయి. ముందుగా వారే దాడి చేసి 1981లో ఇరాక్‌లోని అణు పరిశోధనా కేంద్రాన్ని ధ్వంసం చేశారు. అందుకు వారు ఎవరి అనుమతీ కోరలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. 2007లో సైతం సిరియా నిర్మించిన ఇటువంటి పరిశోధనా కేంద్రంపై కూడా ఇజ్రాయిల్ ఇదే తరహాలో దాడులు చేసింది. అయితే సిరియా ఈ దాడులను ఖండించలేదు. నిస్సందేహంగా అక్కడేదో జరుగుతోంది. వారు ఉత్తర కొరియా సహకారంతో కొన్ని పరిశోధనలు కొనసాగిస్తున్నారు. కొంత వరకూ అది చట్టబద్ధమైనదే. ఇందులో వారు ఎటువంటి ఉల్లంఘనలకూ పాల్పడలేదు. నిజాయితీగా చెప్పాలంటే వారు దీన్ని ఎందుకు ఖండించలేదో నాకు అర్థం కాలేదు.
ఇరాన్‌కు రష్యా, చైనా అందిస్తున్న సైనిక సహకారాన్ని ఐరాస భద్రతా మండలి తీర్మానం రద్దు చేస్తుందన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రష్యా తన వద్ద ఉన్న ఎస్-300 తరహా వాయు రక్షణ వ్యవస్థను ఇరాన్‌కు అందజేయడాన్ని ఈ తీర్మానం నిరోధిస్తుంది. అయితే ఇరాన్‌కు తమ సైనిక సహకారాన్ని ఐరాస తీర్మానం రద్దు చేయజాలదంటూ రష్యా విదేశాంగ మంత్రి ఇటీవల ప్రకటించారు. అయితే కొద్ది నెలల అనంతరం తాము ఇరాన్‌కు సైనిక సహకారాన్ని నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఇప్పుడు ఇరాన్ అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రష్యా అందజేసిన ఎస్-300 తరహా వాయు రక్షణ వ్యవస్థ నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం దానికి అందకపోవడమే ఇందుకు కారణం.
రష్యా, చైనాకు వ్యతిరేకంగా అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. వాస్తవానికి చైనా సరిహద్దులు 'దక్షిణ సముద్రం, పసుపు సముద్రం, ఆఫ్ఘనిస్తాన్‌తో ఉన్న సరిహద్దు ప్రాంతం, తైవాన్ జలసంధి, తదితర ప్రాంతాలన్నీ పూర్తి సైనికీకరణతో నిండి ఉన్నాయి. ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు చైనా, రష్యా ముందుకు రాకపోవడానికి ఇది ఒక కారణం కూడా. కనీసం ఇరాన్ విషయంలో కూడా రెండు దేశాలూ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా భద్రతామండలి ఆమోదించిన తీర్మానంపై రష్యా, చైనా వీటో చేసి ఉండాల్సిందన్నది నా అభిప్రాయం. ఎందుకంటే నా అభిప్రాయంలో ప్రతి అంశం అనేక విధాలుగా సంక్లిష్టంగా మారుతోంది. ఇందులో ఆయుధ సరఫరాలు, ఇంధన సరఫరాల వంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరాల విషయంలో చైనాలో డిమాండ్ బాగా పెరుగుతోంది. ఆర్థికంగా శరవేగంతో పురోగమిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థలో చమురు, గ్యాస్‌కు డిమాండ్ బాగా ఉంది. చమురు, గ్యాస్ సరఫరాల కోసం రష్యాతో చైనా ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు చైనా సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిపై దృష్టి సారించింది. మరో మాటలో చెప్పాలంటే చైనాలో ఇంధన వనరులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. వాస్తవానికి ఇంధన వనరుల విధ్వంసానికి అమెరికా ఖర్చు పెడుతున్న పెట్టుబడులతో చైనా తనకు అవసరమైన వనరులను సమృద్ధిగా సమకూర్చుకోగలదు. అయితే ఇరాన్‌తో యుద్ధంతోనే అసలు ముప్పంతా పొంచి ఉంది. ముస్లిం ఆధిపత్య దేశమైన ఇరాన్‌లో పోరాట పటిమ కలిగిన లక్షలాది మంది సుశిక్షితులైన సైనికులున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి గెలవడం అసాధ్యం. అంతకు మించిన వెర్రితనం ఇంకోటి లేదు.
సంప్రదాయ యుద్ధంలో పాల్గొనే సైనిక బలగాలు విస్తృత స్థాయిలో ఉంటాయన్నది వాస్తవం. ఇరాన్ ఒక్కరోజులోనే ఇరాక్, ఆఫ్ఘన్లతో ఉన్న తన సరిహద్దులకు లక్షలాది మంది సైన్యాన్ని తరలించగల శక్తి కలిగి ఉంది. ఈ ప్రాంతంలో అమెరికా తన సైనిక స్థావరాలకు సమీపంలోనే సంప్రదాయ యుద్ధాన్ని ప్రారంభించినా గెలిచే ప్రసక్తి లేదు.
అవును. సంప్రదాయ యుద్ధంలో అమెరికా ఓడిపోవడం ముమ్మాటికీ ఖాయం. లక్షలాది మంది ప్రజలపై సంప్రదాయ యుద్ధాన్ని తలపెడితే ఎవరూ గెలవలేరు. మేము గతంలో కొనసాగించిన గెరిల్లా యుద్ధతంత్రాన్ని గుర్తు తెచ్చుకుంటే నేను ఏనాడూ ఒకే చోట బలగాలపై దృష్టి పెట్టలేదు. బలగాలపై దృష్టిపెడితే వారు ఉపయోగించే ఆయుధాలతో విధ్వంసంతో పాటు ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment