హత్యలకు, దాడులకు వెరవని మన్యం మార్క్సిస్టు ఉద్యమం
- బండారు రవికుమార్
అది 1985వ సంవత్సరం సెప్టెంబర్ నెల. సి.పి.ఎం. ఖమ్మం జిల్లా మహాసభలు వైరాలో జరుగుతున్నాయి. ఆ మహా సభలో భద్రాచలం డివిజన్ సి.పి.ఎం. నాయకులు బండారు చందర్రావు అన్న మాటలు ఆ సభలో పాల్గొన్న ప్రతినిధులకు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి. ''భద్రాచలం డివిజన్‌లో నరహంతక నగ్జలైట్ల దాడులు, బెదిరింపుల మధ్య పనిచేయాల్సిన పరిస్థితి. నక్సలైట్ల బెదిరింపులకు భయపడి ఎత్తిన జెండాను దించేదిలేదు. నన్ను, అలాగే మన బీష్మారావు, వెంకటరెడ్డిలాంటి అనేకమంది నాయకులను, కార్యకర్తలను చంపడమే వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. మా హత్య వార్త ఎపుడైనా రావచ్చు. మా చావు అతి దగ్గరలోనే ఉంది. అది మాకు తెలుసు. కాబట్టి రాబోయే జిల్లాస్థాయి సమావేశాల్లో మీ అందరినీ కలుసుకునే అవకాశం మళ్ళీ మాకు కలుగకపోవచ్చు. మీ అందరికీ మా రెడ్ సెల్యూట్ '' ఇవీ ఆయన ప్రసంగంలోని కొన్ని వాక్యాలు.
విలువైన విప్లవోద్యమ కార్యకర్తల ప్రాణాలు కసాయి, కిరాయి మూకల హత్యాకాండకు బలికాకూడదని పార్టీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నవంబర్ 5న దారి కాచి దాడిచేశారు. ఆ రోజు జీడిగుప్ప గ్రామానికి (ఇది భద్రాచలంకు 80 కి.మీ.ల దూరంలో ఉంది) వెళ్ళి తిరిగి వస్తుండగా ఉదయం పదకొండున్నర ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సమాచారంతో నక్సల్స్ ఈ దారుణానికి తెగబడ్డారు. మారుమూల ప్రాంతాల్లో కనీస సౌకర్యాల ఏర్పాటు కోసం సాగిన ఆ యాత్రలో నాటి శాసనసభ్యులు కుంజా బొజ్జి కూడా వున్నారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. చింతూరు ఏరియా పార్టీ నాయకుడు భీష్మారావు (34)ను గొడ్డళ్ళతో నరికి చంపారు. భీష్మారావును వదిలిపెట్టి తనను చంపుకోండి అన్న చందర్రావు (52) కాళ్ళూ, చేతుల్ని గొడ్డలితో నరికారు. తుపాకులు కాళ్ళకు గురిపెట్టి కాల్చారు.ఈ దాడిలో భీష్మారావు అక్కడికక్కడే చనిపోగా, చందర్రావు 38 రోజుల పాటు ఉస్మానియా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి డిసెంబర్ 13న తుది శ్వాస విడిచారు.
మార్క్సిస్ట్ యువ కిశోరం భీష్మారావు
భీష్మారావు సి.పి.ఎం. భద్రాచలం డివిజన్ కమిటీ సభ్యులు. హోల్‌టైౖమర్. నాటి వి.ఆర్.పురం సమితిలోని చింతూరు అటవీప్రాంత నాయకుడు. తాను టింబర్ కార్మికుడిగా ఉన్నప్పుుడే ఆదివాసీలపట్ల ప్రేమాభిమానాలు, దోపిడీని ఎదిరించే మనస్తత్వం స్వతహాగా కలిగి వున్న వ్యక్తి. ఇదే ఆయనను పార్టీనేత చందర్రావుకు చేరువయ్యేలా చేసింది. వీరిద్దరూ కలిసి అధ్యక్ష, కార్యదర్శులుగా టింబర్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్‌ను ఏర్పాటు చేశారు. శ్యామల వెంకటరెడ్డి ఆ ప్రాంతంలో భీష్మారావుకు తోడయ్యారు. వీరి కృషి ఫలితంగా భద్రాచలం పేపర్ బోర్డు యాజమాన్యం, అటవీశాఖ, కాంట్రాక్టర్లు చేసే దోపిడీని మౌనంగా భరించే స్థితి నుండి గిరిజనులు ఎదరించే స్థితి వచ్చింది. ఆ క్రమంలో వీరిపై అక్రమ కేసులు బనాయించి, జైళ్ళలో నిర్భంధించారు. అయినా లెక్కచేయలేదు. ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగారు. చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం మండలాల్లో పార్టీ పటిష్టంగా ఉండడంతో దోపిడీదారుల ఆగడాలు అక్కడ సాగలేదు. తమ దోపిడీకి సిపిఎం అడ్డంకిగా వుండడం సహించలేక దోపిడీదారులు హత్యాకాండకు తెగబడ్డారు. భీష్మారావు జీవితం అనేకమందిని ప్రభావితం చేసింది. ఆయన కుటుంబం యావత్తూ ఉద్యమంలో ఉన్నది. నేడు ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వున్న హైమావతి భీష్మారావు జీవిత భాగస్వామి. ఆయన కుమారుడు బి లెనిన్ నేడు పాలేరు డివిజన్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
స్ఫూర్తిదాయక ఉద్యమ నేత చందర్రావు
ఆదివాసీ గిరిజనేతర పేదలతో మమేకమైన వ్యక్తి బండారు చందర్రావు. డివిజన్ కార్యదర్శిగా, గిరిజన పక్షపాతిగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం సాగించారు. కార్యకర్తలను తయారు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు అజ్ఞాతంలో వుంటూ ఉద్యమాన్ని కాపాడుకోవడానికి కృషిచేశారు. 1985 నాటి ఘటనతో డివిజన్‌లో పార్టీ పని అయిపోయినట్లే అని శత్రువులు భావించారు. కానీ, అలా జరగలేదు. 1978, 1983, 1985 శాసనసభ ఎన్నికల్లో వరుసగా గెలిచిన పార్టీ, ఆ తరువాత 1989, 1994, 1999, 2004 ఎన్నికల్లోనూ అదే విజయపరంపర కొనసాగించింది. 2006 స్థానిక ఎన్నికల్లో కూడా 5 జడ్.పి.టి.సి.లు, 4 ఎం.పి.పి.లు, జిల్లాలోని 126 గ్రామ పంచాయతీకు గాను యాభై ఆరింటిని కైవసం చేసుకుంది. వారాల తరబడి గిరిజన గ్రామాల్లోనే బస చేయడం, మారుమూల పార్టీ శాఖలను కూడా చురుగ్గా పని చేయించడం, పత్రికలను నడిపించడంలో (విశాలాంధ్ర, జనశక్తిల నాటి రోజుల నుండి ప్రజాశక్తి వార, ద్వైవార, దినపత్రికలుగా నడిచిన నాటిదాకా) ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. పార్టీ ప్రజా పునాది విస్తరణపై నిరంతరం దృష్టిపెట్టేవారు. నేటి అంగన్‌వాడీ రాష్ట్రవ్యాపిత సంఘం నాడు భద్రాచలం ఏజెన్సీలో పురుడుపోసుకున్నదే. ఆనాడు రాష్ట్ర కేంద్రంగా వున్న విజయవాడకు ఎప్పుడు వెళ్ళినా పార్టీ సాహిత్యంతో భద్రాచలానికి తిరిగిరాని సందర్భం దాదాపు ఉండదు. పార్టీ శ్రేణులచేత, తను ప్రభావితం చేయగలిగే అందరితోనూ, కుటుంబంతోనూ పుస్తకాలు చదివించడం, అందులో విషయాలపై వారితో చర్చకు పెట్టేవారు. అందువల్ల కుటుంబాలకు కుటుంబాలే వచ్చి పార్టీలో ప్రజాసంఘాల్లో పనిచేస్తున్నాయి. ఆ విధంగా వచ్చినవారిలో చాలా మంది పార్టీలో కార్యకర్తలుగా, ప్రజా ప్రతినిధులుగా వివిధ బాధ్యతల్లో వున్నారు. (ఈ ప్రభావంతోనే చందర్రావు పెద్ద కొడుకైన ఈ వ్యాసకర్త పార్టీ పూర్తికాలం కార్యకర్తగా గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు). చందర్రావు కలిగించిన స్ఫూర్తిలో ఇదొక ప్రత్యేకత.
ఎందుకీ నక్స్జల్స్ హత్యాకాండీ
నక్సలైట్ల రిక్రూట్‌మెంట్ ఈ ప్రాంతంలో లేనప్పటికీ 1980 నాటి నుండి ఉత్తర తెలంగాణా నుండి వలస వచ్చిన దళాలు, నేడు చత్తీస్‌గఢ్‌ను కేంద్రంగా చేసుకున్న మావోయిస్టు దళాలు ప్రజాతంత్ర ఉద్యమంపై దాడులు, హత్యాకాండ కొనసాగిస్తున్నాయి. ప్రజా శత్రువుల జోలికి, పెత్తందార్లపై, దోపిడీచేసేవారిపై, అవినీతితో ప్రజలను పీడిస్తున్న రాజకీయ నాయకుల జోలికి వారు అంతగా వెళ్ళరు. ఒక్క ఎకరం భూమి పంచడంగానీ, ఒక రూపాయి కూలి పెంచడం దిశగాకానీ, నగ్జలైట్ల పోరాటాలు ఎన్నడూలేవు. సి.పి.ఎం.- కూలి, భూమి, పోడు భూములు, అటవీ ఉత్పత్తుల ధరల కోసం అన్ని తరగతుల హక్కుల కోసం పోరాడుతున్న మార్క్సిస్టు పార్టీ నాయకులను టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. వెట్టికి, మేకల పుల్లరి లాంటి దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర మార్క్సిస్టు పార్టీకి వుంది. రాష్ట్రంలోని ఏ జిల్లాలోని ఏ ఏజెన్సీ అసెంబ్లీ నియోజకవర్గంతో పోల్చుకున్నా భద్రాచలం ఏజెన్సీ అభివృద్ధివనరుల్లో, జీవన ప్రమాణాల్లో ముందున్నది. ఇందుకు పార్టీ చేస్తున్న పోరాటాలు, ప్రజా ప్రతినిధుల కృషే కారణం. ప్రజలు ఎర్రజెండావైపే దశాబ్దాలుగా మొగ్గడానికి ఇదొక ముఖ్య కారణం. రాష్ట్రంలో 1/70 తదితర గిరిజన చట్టాల సవరణలను, గిరిజన సలహా మండళ్ళలోనూ, శాసనసభలోనూ వ్యతిరేకించి గిరిజన చట్టాలకు పార్టీ అండగా నిలిచింది.
ఖమ్మం జిల్లాలో గోదావరి నది పరీవాహక అవతలి ప్రాంతంగానేకాక, చత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దులను భద్రాచలం డివిజన్ కలిగి వున్నది. మరోవైపు వాజేడు, వెంకటాపురం మండలాలకు గోదావరికి ఎదురొడ్డుగా వరంగల్, కరీంనగర్ ఏజెన్సీ ప్రాంతాలు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలు ఈ డివిజన్‌కు సరిహద్దుగా ఉన్నాయి. అంతులేని హింసకు పేరొందిన చత్తీస్‌గఢ్‌ను ఆనుకుని వున్న ఈ జిల్లాలో దాని ప్రభావం ఏమాత్రం లేదంటే దానికి కారణం ప్రజలను రాజకీయంగా, సైద్ధాంతికంగా చైతన్యపరిచేందుకు పార్టీ నిరంతరం సాగిస్తున్న కృషే. తమ ఆగడాలకు ఇక్కడి ప్రజలు సహకరించకపోవడంతో పార్టీపై నక్సలైట్లు కక్షకట్టారు. నాయకులను, కార్యకర్తలను రాజీనామాలు చేయమని బెదిరించడం, లొంగనివారిని హిట్‌లిస్ట్ పెట్టి చంపడం వంటివి చేశారు. ఉద్యమ నాయకులను చంపినపుడల్లా ప్రజల్లో నక్సల్స్‌పై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. తమకు అత్యంత ప్రియమైన నాయకులను హతమార్చిన నక్సలైట్ దళాలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వకపోవడం, కొన్ని సందర్భాల్లో విల్లంబులతో తరిమి కొట్టడం జరిగింది.
త్యాగాల గడ్డ
1985కు ముందు దాడులు, బెదిరింపులు, చిత్రహింసలు, హత్యాయత్నాలు కొనసాగాయి. 1985 నవంబర్‌లో చందర్రావు, భీష్మారావులను, 1986లో చింతూరు మండలం లక్కవరం వద్ద మడివి మూకయ్యను, 1988లో చింతూరు పి.ఎ.సి.ఎస్. అధ్యక్షుడు కామ్రేడ్ పులి రామయ్యను చంపారు. 1996లో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, డివిజన్ అగ్ర నాయకుడు కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డిని, 2006లో చర్ల మండలం కుర్నపల్లి ఉప సర్పంచ్, గ్రామ శాఖ కార్యదర్శి యిరపా వీరయ్యను, 2007లో చింతూరు మండలంలో పి.ఎన్.ఎం. డివిజన్ కమిటీ సభ్యుడు మడకం గంగరాజును, 2009 డిసెంబర్‌లో దుమ్ముగూడెం మండల కమిటీ సభ్యుడు, కొత్తపల్లి సర్పంచ్ కనితి రాజులును, గ్రామ పెద్ద కనితి సుబ్బయ్యను వీరు హత్య చేశారు. నేటికీ నాయకులు, కార్యకర్తలు హిట్‌లిస్ట్‌లో ఉంటూ ప్రమాదకర పరిస్థితులలో బెదిరింపులకు వెరవకుండా పనిచేస్తున్నారు.దేశంలోనూ, ప్రత్యేకించి బెంగాల్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాల్లో నక్సల్స్ ద్వారా విప్లవోద్యమానికి జరిగిన నష్టం, పాలకవర్గాలు కలిగించిన నష్టాలకు తీసిపోవు. సి.పి.ఎం.నే ప్రధాన శతృవుగా చేసుకున్న వారి సైద్ధాంతిక, రాజకీయ దివాళాకోరుతనాన్ని ప్రజలకు, పార్టీ శ్రేణులకు వివరించటం ద్వారా మరింత అప్రమత్తం చేయాలని సి.పి.ఎం. ఖమ్మం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. 1985 నాటి ఘటన జరిగి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నవంబర్ 5 భీష్మారావు వర్థంతి నుండి డిసెంబర్ 13 చందర్రావు వర్థంతి వరకూ ప్రచార క్యాంపెయిన్, సభలు, సెమినార్లు నిర్వహిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment