మీకు తెలిసిన చరిత్రేమిటి కామ్రేడ్?
- తమ్మినేని వీరభద్రం
ప్రకాశ్‌కరత్ లాంటి జాతీయ నాయకుడిపై వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ముందూ,వెనకా చూసుకోవాలి. కేంబ్రిడ్జిలో తాను (కరత్) చేసిన ప్రసంగాన్ని మీడియా తప్పుగా రిపోర్టు చేసిన విషయం తెలియగానే ఆయన ఖండన విడుదల చేశారు. తాను చెప్పిందేమిటో అందులో ఆయన స్పష్టంగా వివరించారు. అయినా అదేమీ పట్టించుకోకుండా పట్టాభి రామారావు ఆయనపై కత్తులు దూయటం విజ్ఞత అనిపించుకోదు.అక్టోబరు 27 జ్యోతి పత్రికలో సిపియం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్ ఇటీవల కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఒక స్మారకోపన్యాసంలో చెప్పిన విషయాలపై మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలను ఆధారం చేసుకుని 'చరిత్ర తెలియని కరత్' అంటూ పరకాల పట్టాభిరామారావు నోరుపారేసుకోవటం విచారకరం. మొదటి విషయమేమంటే ప్రకాశ్‌కరత్ లాంటి జాతీయ నాయకుడిపై వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ముందూ,వెనకా చూసుకోవాలి. కేంబ్రిడ్జిలో తాను (కరత్) చేసిన ప్రసంగాన్ని మీడియా తప్పుగా రిపోర్టు చేసిన విషయం తెలియగానే ఆయన ఖండన విడుదల చేశారు. తాను చెప్పిందేమిటో అందులో ఆయన స్పష్టంగా వివరించారు. అయినా అదేమీ పట్టించుకోకుండా పట్టాభి రామారావు ఆయనపై కత్తులు దూయటం విజ్ఞత అనిపించుకోదు.
ఇక రెండోవిషయమేమంటే కరత్‌కు చరిత్ర తెలియదని అంటూ, ఆ చరిత్రను మనకు తెలియజేస్తూ, ఆయన చెప్పిన చారిత్రక సంగతుల గురించి కొంత చెప్పాలి. లెనిన్ 'కలోనియల్ థీసిస'్ కేవలం ఇండియాలో జరిగే జాతీయ పోరాటం గురించే కాదు. మొత్తం ప్రపంచంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగే జాతీయ పోరాటాల పట్ల కమ్యూనిస్టుల వైఖరిని అది తెలియజేసింది. కమ్యూనిస్టులు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికవర్గం సాగించే పోరాటాలలో మాత్రమే కాక, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జాతీయ బూర్జువాలు సాగించే ప్రజాతంత్ర పోరాటాలలో కూడా చురుకైన పాత్ర నిర్వహించాలని, ఈ పోరాటంలో కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకు పోవాలని ఆ సిద్దాంతం పిలుపు ఇచ్చింది. కలుపుకు పోవటం వేరు. కలిసి పోవటం వేరు. పట్టాభిరామారావు తన 'బుద్ధ్ది'కి తోచినట్లు ఆ మాటను మలిచి కాంగ్రెస్‌తో కలిసి పోవాలని సిద్దాంతీకరించటం, దానిని లెనిన్‌కు అంటగట్టటం మహా పాపం. వర్గసంకర సిద్దాంతవేత్తలు కమ్యూనిస్టు ఉద్యమానికి కొత్తేమీ కాదు. మార్క్స్ కాలంలో బెర్న్‌స్టీన్, మొదటి ప్రపంచ యుద్ధ కాలం(లెనిన్ కాలం) లో కాట్క్సీ ఈ పాత్రలు నిర్వహించారు. అయితే మాటలు మార్చే నంగనాచితనం బహుశా వాళ్లు అనుసరించలేదు.
పైగా లెనిన్ ఆనాటి తన థీసిస్‌లో ఈ పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ప్రతిపాదించాడు. ఆ వ్యూహం ప్రకారం కమ్యూనిస్టులు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జాతీయ బూర్జువాలతో కలిసి పోరాడుతూనే, తమ ''స్వతంత్రత'ను కాపాడుకోవాలని స్పష్టంగా చెప్పారు. బహుశా ఆనాటినుండీ నెరిపిన స్నేహంలో నెహ్రూలో, బారత బూర్జువాలలో 'సోషలిజం' కనిపించిన మా రివిజనిస్టు మిత్రులకు ఈ మాట సహజంగానే చెవికెక్కదు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు జాతీయ కాంగ్రెస్‌తో కలిసి భారతదేశంలో సోషలిజం సాధించే సిద్దాంతాలను వారు ప్రతిపాదించారు. సమరశీల పోరాటాలన్నింటినీ కాగ్రెస్‌తోక పట్టించటానికి నానా అగచాట్లు పడ్డారు. చివరికి పార్టీ చీలికకే కారకులయ్యారు. కాంగ్రెస్‌గానీ, ఇంకెవరైనాగానీ ప్రజోపయోగకరమైన పాత్ర నిర్వహిస్తే సమర్థించటానికి, సహకరించటానికి అప్పుడుగానీ, ఇపుడు గానీ కమ్యూనిస్టులకు అభ్యంతరముండాల్సిన అవసరమేమీలేదు. కానీ వారిది సోషలిస్టునైజంగా చిత్రీకరించటం వెనుక సైద్దాంతిక దివాళాకోరుతనం ఉంది. అది అపుడే కాదు, ఇప్పటికీ వదలలేదని పట్టాభిగారు తన మాటల ద్వారా పబ్లిగ్గా చెప్పటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేకపోయినా, వారి ''సృజనాత్మక మార్క్సిజాన్ని'' మాకు అంటగట్టజూడటమే ఆగ్రహించాల్సిన విషయం.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment