‘‘మైక్రో దారుణాలు’’ - 02

మైక్రో అప్పు పేదలకు ముప్పు
ప్రతి మహిళనూ లక్షాధికారిణిని చేస్తామంటూ తియ్యతియ్యటి కబుర్లెన్నో చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌పార్టీ. తమ పొదుపు పథకాల పుణ్యమా అని కోటిమందికిపైగా మహిళలు లక్షాధికారులయ్యారని, మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నామని గత ప్రభుత్వమూ ఊదరగొట్టింది. వాస్తవం మాత్రం దానికి భిన్నంగా వుంది. పావలా వడ్డీకి రుణాలు, రివాల్వింగ్‌ ఫండ్‌ మాట 'దేవుడె'రుగు! సూక్ష్మ రుణ సంస్థల ఊబిలోపడి ఊపిరాడని
మహిళలు అప్పులమీద అప్పులు చేసేస్తున్నారు. తాళిబట్టు, రేషన్‌కార్డుతోసహా ఇళ్లల్లో విలువైన వస్తువులన్నిటికీ రెక్కలచ్చి అప్పులవాళ్ల దగ్గరకు ఎగిరిపోతున్నాయి. ఏం చేసైనా సరే అప్పులు తీర్చాల్సిందేనని పరుష పదజాలాన్ని ప్రయోగించడంతో దిక్కుతోచని మహిళలు వ్యభిచారకూపాల తలుపు తడుతున్నారన్న వార్తలూ వినొస్తున్నాయి. ఏజంట్ల వేధింపులు, అవమానాలు తారాస్థాయికి చేరడంతో పరువుకోసం ప్రాణాలనే వదిలేస్తున్న సంఘటనలూ వున్నాయి. కుటుంబావసరాలు తీర్చే సంగతి అటుంచి భూమిమీదే నూకలు చెల్లేట్టు చేస్తున్న మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు ఇంత శక్తి ఎక్కడినుంచొచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా ఇంత లోతుగా ఎలా వేళ్లూనుకుపోయాయి? డ్వాక్రా గ్రూపులు క్రమేణా సూక్ష్మరుణ బృందాలుగా ఎందుకు మారాయి? ఇది ఒక వ్యూహం ప్రకారమే జరిగిందా? ఈ విషయంలో ప్రభుత్వ, అధికార గణాలు, చట్టాలేం చేస్తున్నాయి? అన్నవి భేతాళ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. వీటికి సమాధానాలు ఏమైనా ప్రభుత్వం మాత్రం ఈ అవాంఛనీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది మాత్రం పచ్చి నిజం. పావలా వడ్డీ రుణాలను విజయవంతంగా అందచేస్తున్నట్టు ఏలికలు చేస్తున్నవి ప్రగల్భాలు మాత్రమే. ఖరీఫ్‌ సీజన్లో 17,473 కోట్ల రూపాయల రుణమిస్తామని చెప్పిన బ్యాంకర్లు 14,259 కోట్లు మాత్రమే ఇచ్చారు. వారు ప్రకటించిందే అరకొర మొత్తం. అందులోనూ కొరవ! ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయ బృందాలకు 11, 755 కోట్ల రుణం ఇస్తామని ప్రకటించి ఆరుమాసాలు గడుస్తున్నా ఇంతవరకు కేవలం 1,890 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీన్నిబట్టే మహిళలపట్ల, స్వయం సహాయక బృందాల పట్ల ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి వున్నదో అర్థంచేసుకోవచ్చు. సరళీకరణ విధానాల పుణ్యమా అని గ్రామీణ బ్యాంకు రుణాలు వాటి ప్రాధమ్యాలు తగ్గిపోవడంతో వ్యవసాయం, చేతివృత్తులు, చిన్నపరిశ్రమలు అప్పులకోసం గతంలోవలే వడ్డీవ్యాపారస్తులనే ఆశ్రయించాల్సివచ్చింది. ఈ నేపథ్యంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు వారిలో ఎన్నో ఆశలు రేపాయి. ప్రభుత్వం చెప్పిన రుణాలు, బ్యాంకు రుణాలు అందే మార్గం లేక మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ఎదుట చేతులు చాస్తున్నారు. రుణం కోసం బ్యాంకుల్లో మాదిరి ఎటువంటి ఆస్తిపాస్తుల హామీ అవసరం లేకపోవడంతో మైక్రో రుణాలవైపు మొగ్గుచూపుతున్నారు. వీటికితోడు అవసరానికి ఆదుకొంటామంటూ మైక్రో ముగ్గులోకి దింపి నిరుపేద డ్వాక్రా మహిళల మూలుగలు పీల్చుతున్నారు. మైక్రో రుణాల కింద సెల్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్జులు, సరకులు ఇస్తామంటూ మారుమూల గ్రామాల్లోని మహిళలను సైతం వినియోగదారీ సంస్కృతికి బలిచేస్తున్నారు. సూక్ష్మరుణ ఊబిలో చిక్కుకున్న ఓ మహిళ ఖమ్మం జిల్లాలో సొంత ఇంటికే అద్దె చెల్లిస్తోంది. తాకట్టుపెట్టిన కుమార్తె తాళిబట్టు తీసుకురానిదే కాపురానికి తీసుకెళ్లనన్నారు మెట్టినింటివారు. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు. ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు. అప్పులు చిక్కనప్పుడు తాకట్టు మంత్రం వుండనేవుంది. వారాంతపు చెల్లింపులు చేయలేని వారు తీవ్ర మానసిక వ్యధకు గురౌతున్నారు. అప్పు చెల్లించేలా ఒత్తిడి చేసేందుకు తోటి సభ్యులనే ప్రయోగించడం మరో అమానవీయ కోణం. సూక్ష్మరుణాలు తీసుకోకముందు కలిసిమెలిసి బ్రతికినవారు నేడు ఒక్కసారిగా బద్ధశత్రువులైపోతున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న మార్క్స్‌ మాటలను అనుక్షణం గుర్తుచేస్తున్నారు.
దేశ జనాభాలో సగభాగంగా వున్న మహిళలు ఆర్థికాభివృద్ధిలోకూడా తమదైన ముద్ర వేయాల్సిన అవసరాన్ని వక్కాణిస్తూ స్వయం సహాయక బృందాలను ఏర్పాటుచేశారానాడు. కానీ పొదుపు డబ్బుతో ఎందరు మహిళలు లక్షాధికారులయ్యారో ప్రభుత్వమే సెలవివ్వాలి. ఏలినవారు విచ్చలవిడిగా అనుమతించిన బెల్టు షాపులు, రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండానే చేసే సూక్ష్మరుణ వ్యాపారం, వాటి అక్రమ వసూళ్లు-పరోక్ష నిర్బంధాలు ఏకంగా మహిళల ఆత్మవిశ్వాసాన్నే దెబ్బతీస్తున్నాయి. ఏర్పాటు లక్ష్యాన్నే నిర్వీర్యం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టనట్టున్న ప్రభుత్వం ఇప్పటికైనా సూక్ష్మరుణ సంస్థలను కట్టడిచేయాలి. వాటి పరిధిని నియంత్రించాలి. ఇవి చేసే వత్తిళ్లు, వేధింపుల నుంచి రుణగ్రహీతలకు విముక్తి కలిగించాలి. ఆ దిశగా రెవెన్యూ, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలి. బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే మహిళలకు రుణాలు ఇప్పించాలి. గిరిజన ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారం చేయరాదంటూ గిరిజన సంక్షేమ శాఖ జారీ చేసిన నిబంధనను కఠినంగా అమలుపర్చాలి. ఎంత వడ్డీకి, ఎంత రుణం ఇవ్వాలి వంటి అంశాలను సునిశితంగా పరిశీలించే సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను కఠినంగా అమలు చేయాలి. మైక్రో రుణాలు తీసుకొన్న వారు అధికంగా పిల్లల చదువు, ఆరోగ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం, కుటుంబ నావను ఒడ్డుకు చేర్చడం కోసం చేస్తున్నవే. ఒకదానితో ఒకటిగా పెనవేసుకొన్న సమస్యలన్నిటినీ ప్రభుత్వం రాజకీయ చిత్తశుద్ధితో పరిష్కరించిననాడే మైక్రో రుణబంధనాల నుంచి బడుగుజీవులకు విముక్తి.

 

0 comments: