‘‘మైక్రో దారుణాలు’’ - 03
మైక్రో దా'రుణాలు'
'మైక్రో మ'రుణాలు ', 'మైక్రోభూతానికి మరో ఇద్దరు బలి', 'రుణం ఒక వల.. మరణం దాని వెల'... ఇవీ గత కొన్ని రోజులుగా పత్రికల్లో వస్తున్న ప్రధాన శీర్షికలు. రాష్ట్రంలో సూక్ష్మ రుణ సంస్థల దుర్మార్గాలకు ఇవి కేవలం కొన్ని మచ్చుతునకలు మాత్రమే.ఇంకా వెలుగుచూడని దా'రుణాలెన్నో'! పేదరికం ఆసరాగా అధికలాభాలు పిండుకునే రాక్షసులెలా వుంటారో రాష్ట్రంలో సాగుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల దారుణాలు తెలియజేస్తున్నాయి. అపారమైన
లాభాలకు దగ్గర దారిగా వున్న ఈ చిన్న రుణాల వ్యవస్థ ప్రపంచ బ్యాంకు సంస్కరణల ప్రయోగశాలగా పేరొందిన మన రాష్ట్రంలోనే ఎక్కువగా విస్తరించడం గమనార్హం. పేదరికంలో వున్న వారికి రుణాలిచ్చి వారిని పైకి తీసుకొచ్చేందుకే ఈ సూక్ష్మ రుణ వ్యవస్థ ఉద్దేశించబడిందని దీని ప్రతిపాదకులు చెప్పిన మాటలు వట్టి బూటకమని తేలాయి. ప్రైవేటు పెట్టుబడికి కావాల్సింది లాభం. అది లాభం కోసం ఎంతకైనా తెగిస్తుంది, మానవత, జాలి దానికి ఏమీ ఉండవు అన్న మార్క్స్ మహనీయుని మాటలు అక్షర సత్యాలని మైక్రో దా'రుణాలు' మరోసారి నిరూపించాయి. ఆసియా ఖండంలో ఈ సూక్ష్మ రుణ వ్యవస్థను మొదట ప్రారంభించింది బంగ్లాదేశ్ ఆర్థిక వేత్త మహ్మద్ యూనస్. ఇందుకోసమే ఆయనను 2006లో నోబెల్ శాంతి పురస్కారంతో సత్కరించారు. పచ్చటి కాపురాల్లో చిచ్చు రగిల్చి పల్లెల్లో అశాంతి, అలజడులకు కారణమతున్న ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థల విచ్చలవిడితనాన్ని చూసి నేడు ఆయన పశ్చాత్తాప పడుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు వగచి ప్రయోజనం ఏమిటి? సూక్ష్మ రుణ వ్యవస్థను మొదట ఆరంభించిన బంగ్లాదేశ్‌లో ఈ కాలంలో పేదరికం పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్రపంచ బ్యాంకు పుర్రెలో పుట్టిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ మైక్రో ఫైనాన్స్ వ్యవస్థ అన్నది మరచిపోరాదు. ప్రపంచబ్యాంకు ప్రోదబ్బలంతో ఈ సూక్ష్మ రుణ వ్యవస్థ అనతి కాలంలోనే దేశ దేశాలకు విస్తరించింది. వడ్డీ రేట్లు ఒక్కో ప్రాంతానికి ,ఒక్కో దేశానికి ఒక్కో విధంగా వున్నా, పేదలను కొట్టి పెద్దలకు వేసే దాని స్వభావంలో ఎలాంటి తేడా లేదు. అటు మెక్సికో నుంచి ఇటు ఆంధ్ర ప్రదేశ్ వరకూ ఒకటే అనుభవం. ఈ చిన్న రుణాలు పెను విషాదాలకు దారితీసిన ఉదాహరణలు కోకొల్లలు. పదేళ్ల క్రితం పదుల సంఖ్యలో వున్న మైక్రో ఫైనాన్స్ సంస్థలు నేడు లెక్కించడానికే వీలులేనంతగా పెరిగిపోయాయంటే ఇది ఎంత లాభసాటి వ్యాపారంగా వున్నదీ అర్థమవుతుంది. ప్రజలను మభ్య పుచ్చడానికి 'సామాజిక పెట్టుబడి' (సోషల్ ఇన్వెస్ట్‌మెంట్) అని దీనికి ఒక ముసుగు తగిలించినంత మాత్రాన దాని స్వభావం మారిపోదు. బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా విస్తరిస్తూ మన రాష్ట్రంలో పెద్దయెత్తున ఇది అశాంతిని సృష్టిస్తోంది. దేశంలోని మైక్రో ఫైనాన్స్ సంస్థల మొత్తం పెట్టుబడుల్లో 60 శాతం దాకా ఇక్కడే పెట్టడం కూడా ఇందుకు ఒక కారణం. సూక్ష్మ రుణాలపై వడ్డీ వాణిజ్య బ్యాంకుల రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్ల కన్నా అనేక రెట్లు అధికం. అయినా ఇంటి ముందుకు వచ్చి తియ్యని మాటలు చెప్పి అప్పులు ఇస్తుంటే అమాయకులైన బడుగు జనం సులువుగా ఆకర్షితులవుతున్నారు. ఆ విషవలయంలోంచి బయటపడలేక విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏర్పాటైన లక్షలాది స్వయం సహాయక గ్రూపులను తమ వ్యాపారానికి చక్కటి సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. అధిక వడ్డీ దొరుకుతుందన్న యావతో పోటీపడి రుణాలు ఇస్తూ ప్రజలను అప్పుల ఊబిలోకి దించుతున్నాయి. రుణగ్రహీతకు తిరిగి చెల్లించే సామర్థ్యం వుందా, లేదా అని పరిశీలించుకోకుండా విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నాయి. అవి తిరిగి రాకపోయేసరికి గూండాగిరికి పాల్పడుతున్నాయి. సామాజిక ఒత్తిడిని పెంచుతున్నాయి. పరువుకోసం ప్రాణాలు విడిచే పరిస్థితిని సృష్టిస్తున్నాయి. సిపిఎం నాయకులు రాఘవులు చెప్పినట్లు 'హత్యలు' చేస్తున్నాయి. అవి విధించే వడ్డీ రేట్లు, అపరాథ రుసుము, నిర్వహణా చార్జీలు ఎంత దారుణంగా వున్నాయంటే ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి సంపాదించిన కూలి డబ్బులు వీటికి కిస్తీల కింద చెల్లించడానికే సరిపోవడం లేదు. మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి పేదలు తీసుకునే రుణాల్లో ఎక్కువ భాగం పిల్లల చదువులు, వైద్యఖర్చులు, పెళ్ళిళ్లు, ఇతర అత్యవసర ఖర్చులకు, తాగుబోతు భర్తలుంటే మద్యం దుకాణాలకు ఉపయోగిస్తున్నారు. తాత్కాలికంగా కష్టాల నుంచి బయటపడ్డామని అనుకుంటున్నారు.కానీ, శాశ్వతంగా రుణ వలయంలో ఇరుక్కుపోయామనే సంగతి ఆ తరువాత గానీ తెలియడం లేదు. ఈ రుణాలపై విధించే అధిక వడ్డీలు, జరిమానాలు, నిర్వహణా చార్జీలు భరించలేని విధంగా వుంటున్నాయి. ఎక్కువ శాతం మంది చేసిన ఆప్పు తిరిగి చెల్లించలేకపోవడానికి ఈ అధిక వడ్డీ రేట్లే కారణం. పాత అప్పును తీర్చడానికి కొత్త అప్పు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క కుటుంబం మూడేసి, నాలుగేసి మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద అప్పులు చేసి పీకల్లోతున రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సర్వేే చూసినా, కాకతీయ యూనివర్సిటీ అర్థ శాస్త్ర విభాగం వారి సర్వే చూసినా ప్రస్తుత ఆత్మహత్యలకు ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం ఒక వైపు విద్య, వైద్యం వంటి కనీస ప్రాథమిక సదుపాయాలను ప్రైవేటీకరిస్తూ, అభివృద్ధి ఫలాలకు వారికి దూరం చేస్తూ ఇంకోవైపు మైక్రో ఫైనాన్స్ వంటి రాబందులను వారిపైకి వదులుతోంది. ఫలితమే రంగారెడ్డి జిల్లాలో నెల రోజుల పసికందును అనాథను చేసి ఓ మాతృమూర్తి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన. అప్పు తీర్చేందుకు నిజాయితీగా ప్రయత్నించిన అమె ఇంట్లో విలువైన వస్తువులు, వంటి మీద నగలు, పుస్తెల తాడు అమ్మినా వడ్డీ తీర లేదు. మైక్రో వేధింపులకు భయపడి భర్త ఇళ్ళదిలి పారిపోయాడు. దీనిని బట్టి మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఎంత పాశవికంగా వ్యవహరిస్తున్నదీ అర్థమవుతోంది. శరీరాన్ని అమ్ముకొనైనా అప్పు తీర్చాలని మైక్రో సంస్థలు శాసించే స్థాయికి చేరాయి. చట్టం, విలువలు వంటివి ఈ సంస్థల ముందు ఎందుకూ కొరగానివయ్యాయి. హృదయవిదారక సంఘటనపై మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెం కూడా కదలిక లేదంటే ఆమ్ ఆద్మీ ప్రాణాలకు అది ఇచ్చే విలువ ఏపాటిదో తెలుస్తూనేవుంది. పేదల్లో కొనుగోలు శక్తి పెరగడం వల్లే మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయని చెప్పే మంత్రులు దాని వెనక వున్న ఈ గుట్టును ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నారు. పావలా వడ్డీకే రుణాలిచ్చి మహిళలను లక్షాధికారులను చేస్తామని డాంబికాలు పలికిన ప్రభుత్వం ఆచరణలో మోసం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం పావలా వడ్డీకి రుణాలిస్తే ఇంత మంది మహిళలు ఇలా బలవన్మరణాల పాలయ్యేవారా? ప్రభుత్వ బ్యాంకుల ద్వారా చౌక వడ్డీకి స్వయం సహాయక బృందాలకు రుణాలందించినా ఈ దుస్థితి వచ్చేది కాదు. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు తలగ్గిన ప్రభుత్వం ఒక పథకం ప్రకారమే మైక్రో ఫైనాన్స్ సంస్థలను ప్రోత్సహిస్తున్నది. ప్రణాళికాబద్ధమైన రుణ పరపతి వ్యవస్థను కూలదోసి ఆ శిథిలాలపై అరాచకత్వంతో కూడిన మైక్రో ఫైనాన్స్ సంస్థలకు బాటలు వేయడం ప్రభుత్వం ఒక విధానంగా పెట్టుకున్నది. కాబట్టి ఈ మైక్రో మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మైక్రో సంస్థల ఆగడాలను అరికట్టేందుకు సత్వరమే ఒక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలి. భారత రిజర్వు బ్యాంకు ప్రేక్షక పాత్రను విడనాడి వెంటనే జోక్యం చేసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలకు కళ్ళెం వేయాలి.
0 comments:
Post a Comment