‘‘మైక్రో దారుణాలు’’ - 01

మానవ మారణహోమం సాగిస్తున్న మైక్రో ఫైనాన్స్‌
- సారంపల్లి మల్లారెడ్డి
మాసం రోజులలో 45 మందిని ఆత్మహత్యలకు గురిచేసిన మైక్రో ఫైనాన్స్‌ రుణాలు స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి)కు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ రోజు రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు రూ.15వేలకోట్ల రుణాలిచ్చాయి. ఈ రుణవసూళ్ళ చర్యలు అత్యంత దుర్భరంగానూ, భయంకరంగానూ ఉన్నాయి. కిడ్నాపులు, అవమానాలు, వేధింపులు లాంటి చర్యలు రుణ వసూళ్ల సందర్భంగా మైక్రో ఫైనాన్స్‌ సిబ్బంది అవలంభించడం
ఫలితంగా గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమైనాయి. ఈ ఆందోళనలు గమనించిన ప్రభుత్వం సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపుల మహిళా రక్షణ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం 'మైక్రో సంస్థలు వాటిని రిజస్టర్‌ చేసుకోవాలి. వసూళ్లలో ఎలాంటి నిర్బంధ విధానం అనుసరించరాదు. అలా నిర్బంధం ప్రయోగించిన వారిపై ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తుంది. ' ఈ ఆర్డినెన్స్‌ వల్ల రుణగ్రస్తులకు ఎలాంటి సౌకర్యం లభించలేదు. ఆర్డినెన్స్‌ వచ్చిన తరువాత కూడా పది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌలుదారులు తమ భార్యల పేరుతో మైక్రోఫైనాన్స్‌ నుండి అప్పు పొందడం ఫలితంగా తిరిగి వారం వారం చెల్లించలేక వారు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకీ పరిస్థితి?
ప్రపంచంలో మైక్రో రుణాలను విస్తరించడానికి బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనస్‌ అనే వ్యక్తికి నోబుల్‌ ప్రైజ్‌ ఇచ్చి ప్రచారంలోకి తెచ్చారు. మైక్రో రుణాల ద్వారా దారిద్య్ర నిర్మూలన జరుగుతుందని చెప్పారు. అలా చెప్పి ప్రపంచబ్యాంకు, రిజర్వుబ్యాంకు, కేంద్రప్రభుత్వం కలిసి ఈ మైక్రో ఫైనాన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టాయి. బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాలను మైక్రో సంస్థల ద్వారా రుణమిచ్చిన ప్రయివేటు సంస్థలు అత్యధిక వడ్డీరేటును వసూలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ వ్యవస్థను అభివృద్ధి పర్చడానికి ప్రపంచబ్యాంకు రూ.1900కోట్లు రుణసౌకర్యం ఇప్పించింది. రాష్ట్రంలో 9.35లక్షల స్వయం సహాయ గ్రూపులలో 1.20కోట్ల మంది సభ్యులున్నారు. వీరందరినీ మైక్రోఫైనాన్స్‌ కిందకు తీసుకురావాలన్న లక్ష్యం నిర్ణయించింది. ప్రపంచబ్యాంకు ఆదేశంతో 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక బృందాలను తమ డిపాజిట్లకు తోడు బ్యాంకు కొంత మొత్తాన్ని ఇచ్చి ప్రతి గ్రూపుకు (15 మంది) రూ.50వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని ప్రచారం చేశారు. బ్యాంకులకు లక్ష్యాలను నిర్ణయించారు. కానీ ఆ లక్ష్యాలు పూర్తిగాకుండానే గ్రూపుల్లో ఉన్న మహిళలను మైక్రోఫైనాన్స్‌ కిందికి తెచ్చారు. మైక్రోఫైనాన్స్‌ రుణాలు కుటుంబ అవసరాలకే కాక ఎక్కువమందికి బహుళజాతి కంపెనీలు ఉత్పత్తి చేసిన సరుకులను రుణంపై విక్రయించి ఆ విక్రయధనాన్ని రుణంగా మార్చుకున్నారు. ఈ రుణాన్ని వారం వారం చెల్లించాలన్న షరతు పెట్టారు. రుణదాతలుగా పేరుమోసిన ఎల్‌ అండ్‌ టి కంపెనీ, స్పందన, స్వయం కృషి సంస్థ (ఎస్‌కెఎస్‌), షేర్‌ లాంటి సంస్థలు వచ్చాయి. భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి), ప్రపంచబ్యాంకు మధ్య కుదిరిన ఒప్పందం సిడ్బి మైక్రోఫైనాన్స్‌ సంస్థలకురుణాలివ్వాలి.
ఎస్‌కెఎస్‌ సంస్థ ఛైర్మన్‌ విక్రమ్‌ ఆకుల తన సంస్థ గురించి వివరిస్తూ తాము బ్యాంకు నుండి 8.5శాతానికి వడ్డీకి తెచ్చి 27.5శాతానికి సంస్థలకు రుణం ఇస్తున్నట్లు తెలిపారు. దానికి వివరణ ఇస్తూ సిబ్బంది వేతనాల కింద 5.4శాతం, నిర్వహణ ఖర్చులు 3.4శాతం, రుణాల నుండి వచ్చే నష్టాల కింద 1.5శాతం, కార్పొరేట్‌ టాక్సు కింద 2.8శాతం, సంస్థ లాభాల కింద 5.1శాతం విధిస్తున్నట్లు తెలిపారు. సంస్థ యాజమాన్యం చెప్పిన దానిని బట్టి చూసినా ఈ సంస్థ లాభాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతోంది. వాస్తవానికి సంస్థ ఇచ్చిన వివరణకు మించి 33శాతం వరకు వివిధ ఖర్చుల పేరుతో (కార్డుఖరీదు, ఇన్సురెన్సు, అపరాదపు వడ్డీ, త్రిఫ్ట్‌, ప్రాసెస్‌ఖర్చు, జరిమానా మొదలగునవి చేర్చి) వసూలు చేస్తోంది. కానీ కార్డుపైన మాత్రం 12.50శాతం ఫ్లాట్‌రేటు వడ్డీకి ఇస్తున్నట్లు చూపిస్తున్నారు. చివరకు ఆ సంస్థే అంగీకరించినట్లు 27.5శాతం వసూలు చేయడం అత్యంత దారుణం. ఈ సంస్థ 19 రాష్ట్రాల్లో రూ.14వేలకోట్ల రుణ వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థ వాటాల సేకరణకు పబ్లిక్‌ ఇషఉ్యకు వెళ్లింది. పది రూపాయల వాటా విలువ నేడు రూ.140గా ఉందంటే ఈ సంస్థ లాభాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
మరో సంస్థ 'స్పందన' 11 రాష్ట్రాలలో 1608 బ్రాంచీలతో 14వేల మందికిపైగా ఉద్యోగులతో పనిచేస్తున్నాయి. దీనికి 60 లక్షల మంది రుణగ్రస్తులు సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 808 బ్రాంచీలు, 4,900 మంది ఉద్యోగులు 25 లక్షల మంది రుణగ్రస్తులు సభ్యులుగా ఉన్నారు. దేశంలో ఈ సంస్థ ఆరువేలకోట్ల రూపాయల వార్షిక టర్నోవర్‌తో ఉన్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పద్మజరెడ్డి టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించారు. రాష్ట్రంలో రూ.2,500కోట్ల పెట్టుబడులు పెట్టారు. ప్రతి బ్రాంచి నెలకు నిర్వహణ ఖర్చులు పోగా రెండు లక్షల రూపాయల లాభం సంపాదిస్తోంది.
ఈ సంస్థలు ఒకే వ్యక్తికి మూడు, నాలుగు రకాల రుణాలను అంటగడ్తాయి. ప్రత్యేకరుణాలని, పండుగ రుణాలని, సరుకుల కొనుగోలుకు రుణాలని ఒత్తిడి చేసి అంటగడ్తాయి. దీనికి తోడు రుణగ్రస్తులు వాయిదాలు చెల్లించడానికి ఇతర మైక్రో సంస్థల వద్ద రుణాలు తెచ్చి వాయిదాలు చెల్లిస్తుంటారు. ఈ విధంగా ఒక సంస్థే నాలుగైదు రుణాలు ఇవ్వడం కాక నాలుగైదు సంస్థల నుండి రుణాలు ఇస్తున్నారు. ఒక ప్రాంతంలో ఒకే సంస్థ వ్యాపారం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఇద్దరు ముగ్గురికి రుణం అవసరం ఉండి ఒకగ్రూపును ఏర్పాటు చేసి ఆ గ్రూపు సభ్యులకు తెలియకుండా మరొకరుణం పొందిన ఘటనలు అనేకం. ఈ మోసాలన్నీ నిర్వహణ అధికారులకు తెలుసు. అయినా తాము దారిద్య్ర నిర్మూలనకు కొనుగోలు శక్తి పెరుగుదలకు రుణాలిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.
ఈ సంస్థలలో ఉద్యోగుల నియామకంలో కూడా నిర్బంధం కొనసాగుతున్నది. అందులో ఉద్యోగిగా చేరిన వ్యక్తి తన ఒరిజినల్‌ సర్టిఫికేట్లను సంస్థ ఆధీనంలోపెట్టాలి. వెయ్యి నుండి రెండు వేల వరకు ఫిక్సుడ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డి) చేయాలి. వసూళ్ల కొరకు అతనికి మోటార్‌ సైకిల్‌కు 18శాతం వడ్డీపై రుణం ఇస్తారు. ఆర్‌సి బుక్కు సంస్థ ఆధీనంలో ఉంటుంది. రుణం వసూలు చేయకపోతే ఆ నెల జీతంలో కోత విధిస్తారు. ఒకసారి నియామకం అయిన వ్యక్తి ఆ సంస్థ నుండి బయటకు రావడం అసాధ్యం. తన రుణం తీర్చడమే కాక, సర్టిఫికేట్లను పొందలేరు. ఈ విధంగా సిబ్బందిని కూడా చక్రబంధంలో పెట్టారు.
బ్యాంకులు ఏం చేస్తున్నట్లు?
మైక్రో సంస్థలకు రుణసౌకర్యం కల్పించిన రిజర్వుబ్యాంకు, వాణిజ్యబ్యాంకులు స్వయం సహాయక బృందాలకు రుణాలివ్వడానికి కూడా లక్ష్యాలు నిర్ణయిస్తున్నాయి. కానీ బ్యాంకులు మాత్రం లక్ష్యాలు ప్రకటించడమే తప్ప రుణాలు ఇవ్వడం లేదు. 2008-09 సంవత్సరంలో రూ.8,200కోట్లు రుణ సౌకర్యం కల్పించారు. 2010-11లో లక్ష్యం నిర్ణయించారే తప్ప ఆ లక్ష్యంలో 25శాతం కూడా రుణాలివ్వలేదు. ఈ సంస్థలకు మూడు దశలుగా రుణ లక్ష్యం నిర్ణయించారు. ప్రతిగ్రూపుకు మొదటి దశలో రూ.1.75లక్షలు రెండో దశలో రూ.2.50లక్షలు, మూడోదశలో రూ.5.00లక్షలు రుణాలివ్వాలి. బ్యాంకుల నుండి వచ్చే తక్కువ వడ్డీ రుణంతో అంతకుముందు ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను తీర్చడానికి రుణాలిచ్చే విధానాన్ని కూడా ప్రకటించారు. కానీ ఈ విధానం సంపూర్తిగా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా రుణగ్రస్త పేద కుటుంబాలు మైక్రోఫైనాన్స్‌ ఊబిలోకి జారుకుంటున్నాయి. చివరకు ఆత్మహత్యలకు దారితీసాయి. మైక్రోఫైనాన్స్‌ సంస్థలను నాబార్డు అజమాయిషీ కిందకు తెస్తున్నట్లు కేంద్ర విత్తమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రకటించారు. నాబార్డు ఇప్పటికే తన ఆధీనంలోని సహకారబ్యాంకులకు రుణాలు ఇవ్వడం లేదు. సహకారబ్యాంకులు స్వయం సహాయక బృందాలకు రుణాలివ్వలేని స్థితిలోకి చేరాయి. తిరిగి ఆ బ్యాంకు అజమాయిషీ కిందకు తీసుకురావడం సమస్యను పరిష్కరిస్తుందా?
రాష్ట్రంలోని బ్యాంకుల వద్ద 31.3.2010 నాటికి డిపాజిట్ల రూపంలో రూ.2.30లక్షల కోట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్ల నుండి స్వయం సహాయక బృందాలకు రుణం ఇవ్వడానికి అవకాశాలున్నాయి. అప్పుడు ఈ వడ్డీభారం తగ్గుతుంది. ప్రస్తుతం మైక్రోఫైనాన్స్‌ సంస్థలు అన్ని ఖర్చుల పేరుతో 20శాతం మార్జిన్‌ వడ్డీని వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం నాబార్డు నుండి రుణం పొంది రెండు శాతం మార్జిన్‌తో రాష్ట్ర సహకార బ్యాంకులు నాలుగువేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుండగా ఆ సంస్థకు ఏటా నిర్వహణ ఖర్చులు పోగా రూ.20 కోట్ల లాభం వస్తున్నది. ఈ లెక్కన చూసినప్పుడు 20శాతం మార్జిన్‌ పొందుతున్న సంస్థలకు ఎన్ని వేలకోట్ల రూపాయల లాభం వస్తుందో ఊహించవచ్చు. ప్రస్తుతం ఈ సంస్థలు రాజీ, బేరం పేరుతో 24శాతానికి తగ్గించుకుంటామని, నెలకు ఒకసారి వసూళ్లు చేపడతామని, వసూళ్లప్పుడు నిర్బంధం ప్రయోగించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడానికి టోల్‌ఫ్రీ నెంబర్‌ ప్రవేశపెడతామని చెబుతూ తమ పాత విధానాన్ని కొనసాగించే ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. మరో విచిత్రమేమిటంటే ఈ మైక్రోసంస్థలు రుణగ్రస్తులను ఇన్స్యూర్‌ చేస్తూ నామినీగా సంస్థ పేరును నమోదుచేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. ఇన్సూరెన్స్‌లో నామినీగా ఆ కుటుంబ సభ్యులుండాలి తప్ప సంస్థలను నామినీగా పెట్టడం బీమా చరిత్రలోనే లేదు. అంటే ప్రమాదవశాత్తు రుణగ్రస్తుడు చనిపోతే ఆ బీమా సొమ్ముతో తన బాకీని తీర్చుకుంటారన్నమాట. ఇంతకన్న దుర్మార్గం లేదు.
ఫైనాన్స్‌ పెట్టుబడి ప్రపంచీకరణ విధానంలో మైక్రోఫైనాన్స్‌ రుణాలు భాగంగా ఉంటాయని గతంలోనే మార్క్సిస్టు సిద్ధాంత వేత్తలు చెప్పారు. నేడు అదే విధానం భారతదేశంలో కొనసాగుతున్నది. వడ్డీరాజ్యాలు, రుణగ్రస్త రాజ్యాలుగా ప్రపంచం విభజించబడుతుందని చెప్పినదానికి అనుగుణంగానే నేడు దేశంలో ప్రతీ పెట్టుబడిదారుడు వడ్డీ వ్యాపారంవైపు మొగ్గుచూపుతున్నారు. బహుళజాతి సంస్థలు కూడా వడ్డీ వ్యాపారంలోనే కేంద్రీకరిస్తున్నాయి. నేడు బ్యాంకులు పెట్టుబడిదారులకు రుణాలిచ్చే సంస్థలుగా మారుతున్నాయి. కానీ పేదలకు రుణాలివ్వడం లేదు. కేంద్రప్రభుత్వం ఒకవైపున దారిద్య్రనిర్మూలన కొరకు సంక్షేమ పథకాలు చేపడుతున్నామని చెబుతూనే మరోవైపున పేదలను మైక్రోఫైనాన్స్‌ కబంధ హస్తాలలోకి నెడుతున్నాయి. మానవ మారణహోమం సృష్టిస్తున్న మైక్రోఫైనాన్స్‌ రుణ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి.

 

0 comments: