సంక్షోభంలో ఉన్నత విద్యారంగం

విద్యావేత్తలతోగానీ, రాష్ట్రాలతోగానీ ఈ విషయమై చర్చించటానికి కూడా కేంద్రం సుముఖంగా లేదు. పలు రంగాలలో అమెరికాతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకున్న యుపిఏ ప్రభుత్వం విద్యారంగంలో సైతం అమెరికా, ఇంగ్లండు తదితర ధనిక దేశాల ఒత్తిళ్ళకు తలొగ్గుతున్నది. తమతమ దేశాలలోని ఉన్నత విద్యారంగం సంక్షోభంలో చిక్కుకోవటంతో ధనిక దేశాలు బయటి దేశాలవైపు దృష్టి సారించాయి. ఉన్నత విద్యారంగానికి సంబంధించి అమెరికా, ఇంగ్లండు దేశాలతో ఇప్పటికే భారత ప్రధాన మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత-అమెరికా విద్యా మండలిని ఏర్పాటు చేయాలని గత ఏడాదే నిర్ణయించారు.


ఉన్నత విద్యారంగాన్ని సమూలంగా మార్చివేయటానికే యుపిఏ-2 ప్రభుత్వం నిర్ణయించుకున్నది. విద్యావేత్తలతోగానీ, రాష్ట్రాలతోగానీ ఈ విషయమై చర్చించటానికి కూడా కేంద్రం సుముఖంగా లేదు. పలు రంగాలలో అమెరికాతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకున్న యుపిఏ ప్రభుత్వం విద్యారంగంలో సైతం అమెరికా, ఇంగ్లండు తదితర ధనిక దేశాల ఒత్తిళ్ళకు తలొగ్గుతున్నది. తమతమ దేశాలలోని ఉన్నత విద్యారంగం సంక్షోభంలో చిక్కుకోవటంతో ధనిక దేశాలు బయటి దేశాలవైపు దృష్టి సారించాయి. ఉన్నత విద్యారంగానికి సంబంధించి అమెరికా, ఇంగ్లండు దేశాలతో ఇప్పటికే భారత ప్రధాన మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత-అమెరికా విద్యా మండలిని ఏర్పాటు చేయాలని గత ఏడాదే నిర్ణయించారు. విద్యా రంగంలో ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఈ మండలి వారథిగా ఉంటుందని, దీనివల్ల దేశంలోని విశ్వవిద్యాలయాలకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయని ప్రధాన మంత్రి చెప్తున్నారు.

అమెరికా, బ్రిటన్‌లు ఉన్నత విద్యా రంగంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం వాటితో చర్చలు జరిపింది. ఆ దేశాలలో విద్యారంగ బడ్జెట్‌లో పెద్దయెత్తున కోతను విధించటమే కాక ఫీజులు విపరీతంగా పెంచివేయటం, వివిధ కోర్సులకు చెందిన విభాగాలను మూసివేయటం, ఉపాధ్యాయుల తొలగింపు వంటివి సంభవిస్తున్నాయి. దీనితో ఆ రెండు దేశాలలోనూ తల్లిదండ్రులు, ఉద్యోగులు నిరసనలు తెలపటం సాధారణమైపోయింది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకై గత మార్చి 4న అమెరికాలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరలా అక్టోబరు 7న ప్రజలు నిరసన తెలిపారు. తిరిగి వచ్చే జనవరిలో కార్యాచరణకు దిగాలని ఆందోళనకారులు భావిస్తున్నారు. ఇదేవిధంగా ఇంగ్లండులో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నాయి. ఆర్థిక సంక్షోభం తలెత్తిన నాటినుంచి అమెరికాలో ఉన్నత విద్యారంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. కేటాయింపులు తగ్గటంతో దేశవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తగ్గిన ప్రభుత్వ కేటాయింపులను భర్తీ చేయడానికిగాను ఈ సంస్థలు ఫీజులను భారీగా పెంచాయి.

అమెరికాలోని వివిధ రాష్ట్రాలు విద్యారంగానికి చేసే కేటాయింపులను తగ్గించటంతో 2010-11లో ఫీజులు 8 శాతం నుంచి 23 శాతం వరకు పెరిగాయి. ఆరిజోనా రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఈ పెరుగుదల 9 నుంచి 20 శాతం వరకు ఉన్నది. అదేసమయంలో బోధకుల వేతనాలలో 2.75 శాతం కోత విధించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 32 శాతం మేరకు ఫీజులు పెంచివేసింది. దీనితోపాటే విద్యార్థుల సంఖ్యను తగ్గించింది. 2010-11 విద్యా సంవత్సరానికిగాను ఫ్లోరిడాలోని 11 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 15 శాతం మేరకు ఫీజులను పెంచాయి. ఉన్నత విద్యకు చేసే కేటాయింపులలో జార్జియా రాష్ట్రం 2011 సంవత్సరానికిగాను 15.1కోట్ల డాలర్లను లేదా 7 శాతాన్ని తగ్గించింది. తత్ఫలితంగా ఒక్కొక్క సెమిస్టర్‌కు 500 డాలర్ల మేరకు ఫీజులు పెరిగాయి. ఇదేవిధంగా వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలు ఫీజులను పెంచివేశాయి. దీనితోపాటే బోధనా సిబ్బంది తగ్గింపు, కొన్ని విభాగాల మూసివేత, ఉపకార వేతనాల తగ్గింపువంటి చర్యలను కూడా చేపట్టాయి. సీట్ల సంఖ్యను కూడా బాగా తగ్గించాయి. వీటన్నిటి కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. గత రెండేళ్ళుగా విద్యాలయాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఆందోళనలో భాగంగా గత డిసెంబరులో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫ్రభుత్వ విశ్వవిద్యాలయ భవనాన్ని విద్యార్థులు ఆక్రమించుకున్నారు. దాదాపు 24 గంటలపాటు గదుల్లో ఉండి లోపలవైపున తాళాలు వేసుకున్నారు.

పోలీసులు తలుపులు పగులగొట్టి 26గురు విద్యార్థులను అరెస్టు చేశారు. మరో మూడు రాష్ట్రాలలో కూడా ఇదేవిధంగా విద్యార్థులు భవనాలను స్వాధీనం చేసుకున్నారు. గత మార్చి4న కాలిఫోర్నియా, ఓక్‌లాండ్‌లలో విద్యార్థులు ఆందోళనకు దిగటంతో పోలీసులు 160 మందిని అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలో దాదాపు వేయిమంది విద్యార్థులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రమ్ములు, బూరలు మోగించారు. అక్టోబరు 7న ప్రభుత్వ పరిరక్షణ జాతీయ దినాన్ని నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు నల్లరంగు దుస్తులు ధరించి ఒక శవపేటికను మోసుకుని తిరిగారు. ఈ పేటికపై 'విద్య' అని రాశారు. చివరకు అంత్యక్రియలు నిర్వహించారు. విద్యార్థుల ఆందోళన దేశప్రజల దృష్టిని ఆకర్షించటంతో వారు కూడా విద్యార్థులకు మద్దతుగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. విదేశాలలో సైనికుల కోసం వేలకోట్ల డాలర్లను ఖర్చుచేస్తున్న ప్రభుత్వం విద్యారంగానికి ఎందుకు ఖర్చు చేయదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో విద్యాబోధనకు పెట్టుబడులను తగ్గించటమేకాక, విద్యాసంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ వైఖరి ప్రజల్లో తీవ్రమైన నిరసనకు కారణమవుతున్నది.

బ్రిటన్‌లో సైతం తప్పని కోతలు

ఇంగ్లండులో కూడా ప్రభుత్వ కేటాయింపులను తగ్గించి ఫీజులను పెంచటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరసనలు తెలుపుతున్నారు. విశ్వవిద్యాలయాలకు 110 కోట్ల పౌండ్ల మేరకు కోత పడింది. ఇక్కడ కూడా విశ్వవిద్యాలయ భవనాలను విద్యార్థులు ఆక్రమించు కోవటం మనకు కనపడుతుంది. కొంతమంది సిబ్బందిని కూడా ప్రభుత్వం తొలగించింది. ఈ చర్య ప్రజలలో నిరసనకు కారణమైంది. ఆగ్రహించిన విద్యార్థులు వైస్‌ ఛాన్సలర్‌ గదిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. చివరకు పోలీసులు వచ్చి విద్యార్థులను తొలగించవలసి వచ్చింది. ఉద్యోగాలలో కోత విధింపును నిరసిస్తూ లండన్‌లోని కింగ్‌ కాలేజి, వెస్ట్‌ మినిస్టర్‌ యూనివర్శిటీతో సహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన బోధనా సిబ్బంది ఇటీవలి కాలంలో సమ్మెలు చేశారు. ఒక అంచనా ప్రకారం తొలగించిన ఉద్యోగాలు వేల సంఖ్యలో ఉంటాయి.

ఉత్తర ఇంగ్లండులోని లీడ్స్‌ విశ్వవిద్యాలయం నాలుగు వందలమందిని తొలగించింది. 2010-11 సంవత్సరానికిగాను ఇంగ్లండులోని విశ్వవిద్యాలయ నిధులపై 39.80 కోట్ల పౌండ్ల మేరకు ప్రభుత్వం కోత విధించింది. లండన్‌ బిజినెస్‌ స్కూల్‌కు కేటాయించే నిధుల్లో 12శాతం, అంటే, 58 లక్షల పౌండ్ల కోతను ప్రభుత్వం విధించింది. నిధుల కొరత కారణంగా విద్యార్థులు మధ్యలోనే చదువును మానవలసిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రతి ముగ్గురిలోనూ ఒకరు ఈ రకంగా మధ్యలో చదువును మానుతున్నారు. మరికొంతమంది ఆహారంపై వినియోగించే ఖర్చును తగ్గించటంతో వారి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పరాయి దేశాల నుంచి వచ్చే విద్యార్థుకు కొన్ని విశ్వవిద్యాలయాలు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. దేశీయ విద్యార్థులు చెల్లించేదానికన్నా ఇలాంటి వారు దాదాపు పదిరెట్లు ఎక్కువగా ఫీజులు చెల్లించవలసి వస్తున్నది. ప్రభుత్వ కేటాయింపుల్లో కోత కారణంగా కొన్ని విద్యా సంస్థలు మూతపడే ప్రమాదం ఉన్నట్లు విద్యావేత్తలు తెలుపుతున్నారు.

ఇలాంటి పరిస్థితిలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన విద్యాసంస్థలు విదేశీ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. సహజంగానే వారి దృష్టిలో భారత్‌ ఉంటుంది. ఇప్పటికే మన ప్రధాన మంత్రీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రీ అమెరికా, బ్రిటన్‌లతో ఉన్నత స్థాయి చర్చలను నిర్వహించారు. అంతేకాక, గత మే నెలలో విద్యా రంగానికి సంబంధించిన బిల్లులను కూడ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యా రంగంలో నయా ఉదారవాద అజెండాను అమలు చేయటానికిగాను యుపిఏ-2 ప్రభుత్వానికి ఈ బిల్లులు ఉపయోగపడతాయి. దేశీయంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలకు, విదేశీ విద్యాసంస్థలకు భారతీయ విద్యా రంగంలో స్థానాన్ని కల్పించటమే ఈ అజెండా లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరితే ఉన్నత విద్యా రంగంపై సామాజికమైన అదుపు ఏమాత్రం ఉండదు. విదేశీ విద్యా సంస్థలకు మన దేశంలోకి ప్రవేశం సులభంగా లభించటమేకాక, వాటికి నిర్వహణాపరమైన స్వేచ్ఛ కూడా లభిస్తుంది. అంటే, ఫీజుల పెంపు, బోధనా సిబ్బంది తగ్గింపు వంటివి వాటి ఇష్టానుసారం సాగుతుంటుంది. కనుక ఈ దోపిడీదారుల నుంచి విద్యారంగాన్ని రక్షించవలసిందిగా మనం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే డిసెంబరు 2వ తేదీన ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన జరగబోతున్నది. విద్యార్థులు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఈ ప్రదర్శనలో పాల్గొని దీనిని జయప్రదం చేయాలి.


- విజేందర్‌ శర్మ

 

0 comments: