‘‘మైక్రో దారుణాలు’’ - 05

మైక్రో ఫైనాన్స్‌ల మాయాజాలం - ప్రపంచీకరణ

- సిహెచ్‌.నరసింగరావు
ప్రభుత్వం మైక్రో సంస్థల గురించి నంగనాచి కబుర్లు చెబుతున్నది. సూక్ష్మ రుణ సంస్థలను నియంత్రించేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చానంటోంది. ఆ ఆర్డినెన్సులోని ప్రధాన లోపం పేదల నుంచి ఇబ్బడిముబ్బడిగా వడ్డీలు వసూలు చేయడంపై పూర్తిగా మౌనం వహించడం. కీలకమైన ఈ అంశంపై ఆర్డినెన్స్‌లో ఎక్కడా ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. ఒకవైపు పావలా వడ్డీ గురించి ప్రచారం చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్యాంకు వడ్డీలే వసూలు
చేయాలి అని నిబంధన విధించడానికి ఎందుకు జంకుతున్నట్లు? సూక్ష్మ రుణాలపై సంవత్సరానికి ఒకసారి వసూలు చేయడం కాకుండా మొదటి వారం నుంచే వసూలు చేస్తూ రుణ గ్రహీతపై కనిపించని భారాలు మోపుతోంది. 40 నుంచి 60 శాతం వరకూ వడ్డీ పిండుకుంటున్నది. దీనిని అదుపు చేయడానికి ఈ ఆర్డినెన్సులో ఎటువంటి చర్యలూ లేవు. ప్రభుత్వ బ్యాంకులు అర శాతం వడ్డీ పెంచాలన్నా, తగ్గించాలన్నా అనేక సార్లు ఆలోచించే రిజర్వ్‌బ్యాంకు ఈ సంస్థల అడ్డూ ఆపూ లేని వడ్డీలను ఎందుకు అదుపుచేయడం లేదు? ప్రభుత్వాలు ఎందుకిలా చేష్టలుడిగినట్లు వ్యవహరిస్తున్నాయి? ప్రైవేటు సంస్థలపై శిక్షల గురించి ఆర్డినెన్సులో చెప్పారు. మంచిదే. కానీ ఈ శిక్షలు అమలు జరిపేదెవరు? మహిళల అత్యాచారాలపై అనేక చట్టాలు వచ్చాయి. యాసిడ్‌ దాడులపై కఠిన శిక్షలు ప్రకటించారు. కానీ ఈ చట్టాలు పెద్దలకు చుట్టాలుగా ఉన్నాయి. పేదలకు డబ్బులు ఆశ చూపి శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. అనేక మంది ఆత్మహత్యలకు కారణమైన దుందుడుకు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను ఇప్పుడున్న సాధారణ చట్టాల ద్వారా శిక్షించవచ్చు. కానీ, ఎన్ని కేసులు ఇంతవరకు నమోదయ్యాయి? ఎంతమందిని జైలుకు పంపించారు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వం ప్రైవేట్‌ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రజలను మోసగిస్తున్నది.
ప్రభుత్వం ఇచ్చిన అలుసుతోనే మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఈనాడు ఇలా చెలరేగుతున్నాయి. వాటి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ప్రతి వీధికి, వాడకు వీటి దురాగతాలు విస్తరించాయి. వెలుగులోకి వచ్చే వాటికంటే వెలుగుచూడని మరణాలు, ఆఘాయిత్యాలే అధికం. ఈ ఆగడాలు తట్టుకోలేక పేదలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆంధ్రరాష్ట్రంలో ఇటీవలె ఈ మైక్రో ఆగడాలకు 30 మంది మరణించారు. మైక్రో మాయలు సామాన్యులకు కూడా నేడు అర్ధమవుతున్నాయి. వీటి వెనుక వున్న రాజకీయాలు, విధానాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానిని వివరించడమే ఈ వ్యాసం ముఖ్య ఉద్ధేశం.
ప్రపంచీకరణ విధానంలో భాగంగా 1991లో స్వయం సహాయక గ్రూపులు భారతదేశంలో ప్రవేశించాయి. పేద మహిళలు గ్రూపులుగా ఏర్పడ్డం, ఈ గ్రూపులకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం, తిరిగి చెల్లించినవారికి మళ్లీ రుణాలు ఇవ్వడం నిరంతరం రుణాలను మహిళలకు అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు వీటికి మార్గదర్శకాలు రూపొందించి, ప్రోత్సహించాయి. అనేక రాష్ట్రాలు రుణాలు ఇప్పించడంలో పోటీ పడ్డాయి. ఈ స్వయం సహాయక గ్రూపులను ఎన్నికల ముందు చురుగ్గా కదిలించి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం క్రమేణా పెరిగింది. ఆ క్రమంలో రూపాయి వడ్డీ కాస్తా పావలా వడ్డీగా మారింది. రుణాలు చెల్లించకపోయినా పరవాలేదనే వరకూ పోయింది. బకాయిలు వసూలు చేసుకోవడం ప్రభుత్వ రంగ బ్యాంకులకు కష్టసాధ్యం అయ్యే పరిస్థితి ప్రభుత్వాలే కల్పించాయి. ప్రభుత్వ బ్యాంకులు సరిగా రుణాలివ్వడం లేదన్న వంకతో వాటి స్థానే మైక్రో సంస్థలను ముందుకు తీసుకొచ్చాయి. ఈ విధంగా ప్రైవేటే సంస్థల ఇష్టారాజ్యంగా సాగుతున్న లాభార్జనకు ప్రభుత్వమే తోడ్పడుతున్నది. మైక్రో ఫైనాన్స్‌ భాగోతం స్క్రిప్టును ప్రపంచబ్యాంకు రాయగా, కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ దీనికి దర్శకత్వం వహిస్తున్నాయి. దీంట్లో సమిధలవుతున్నది పేదలే.
ఇందుగలడందు లేడను సందేహం వలదు అన్నట్లు మైక్రో సంస్థలు ఇక్కడ అక్కడా అని కాదు రాష్ట్ర నలుమూలలకూ విస్తరించాయి. వీటి పునాదులు చాలా బలీయంగా వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందే దేశాల్లో పేద ప్రజల్లోకి ఇవి వేగంగా దూసుకుపోతున్నాయి. లాటిన్‌అమెరికా , ఆఫ్రికా ఖండాలకు విస్తరించాయి. భారత దేశంలో అందునా మన రాష్ట్రంలో చాలా వేగంగా విస్తరించాయి.. భారతదేశంలో 20 లక్షల మందికి 51 వేల కోట్లు అప్పులు ఇచ్చాయి. ఈ సంస్థలు పేదల ముంగిట్లోకి వెళ్లి అప్పులు ఇవ్వడమే కాదు, బలవంతపు వసూళ్లు కూడా అలాగే చేస్తున్నారు. అప్పులు తీసుకున్న పేదలను నిత్యం వేధింపులతో నంజుకుతింటున్నారు.
ప్రపంచీకరణ విధానాల్లో ముఖ్యమైనది పెట్టుబడీదారీ మార్కెట్‌ విస్తరణ. తమ సరుకులు ప్రపంచంలో ఎక్కడికైనా పంపి ఏ దేశంలోనై అమ్ముకునే అవకాశాలు కల్పించుకోవడం కోసం కార్పొరేట్‌ సంస్థలు పోటీ పడుతున్నాయి. యూరపు ఖండంలోని ప్రజలందరూ కలర్‌ టి.వి. సెట్‌లు ఎన్ని కొనగలరో భారత దేశంలోని మధ్యతరగతి ప్రజలే అన్ని కొనగలరు. అధిక జనాభా గల భారతదేశంలో నిరుపేదలను, సామాన్య ప్రజలను ఈ ప్రపంచీకరణ విధానాలు ఊరకనే వదులుతాయా? పెట్టుబడీదారులు తమ సరుకులు విచ్చలవిడిగా అమ్ముడుకావాలంటే విచ్చవిడిగా అప్పులు ఇవ్వాలి. మధ్య తరగతి నికరాదాయం వచ్చే ఉద్యోగులకు కార్లు, స్కూటర్లు, ఫ్రిజులు, ఏ.సి.లు, కంప్యూటర్లు, టి.విలు ఇళ్లకు వచ్చి అప్పులు ఇస్తున్నారు.
స్వయం సహాయక గ్రూపుల ద్వారా గతంలో సామాన్య కుటుంబాల మహిళలలో ప్రవేశించారు. ప్రభుత్వ బ్యాంకుల స్థానంలో ప్రైవేట్‌ సంస్థలకు రిజర్వ్‌బ్యాంకులు ద్వారా అప్పులు ఇప్పిస్తున్నారు. బ్యాంకులకు వసూళ్లు చేసుకునే ఇబ్బందులు లేకుండా నేరుగా ప్రైవేటు సంస్థల నుంచి తమ రుణాలు రాబట్టుకోగలుతుతున్నారు. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ప్రజలను రాబందుల్లాగా అధిక వడ్డీతో పీక్కుతింటారు. అయినా ఈ విషయాల్లో వడ్డీ, ఒత్తిడి విషయాల్లో జోక్యం చేసుకోరాదని ప్రభుత్వమూ,రిజర్వు బ్యాంకు ఒక విధానంగానే పెట్టుకున్నట్లుగా అనిపిస్తున్నది. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు అప్పు ఇచ్చిన వారంలోనే వడ్డీలు పిండడం మొదలెడుతున్నాయి. చివరి వాయిదా వరకూ అదే మొత్తాన్ని చెల్లించాలి. తడిగుడ్డతో గొంతుకోసిన విధంగా తెలియకుండానే సామాన్యుల నుంచి అత్యధిక వడ్డీలు రాబట్టుకుంటున్నాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పోగుపడుతున్నాయంటే కారణం ఇదే.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రుణ సౌకర్యాలు కల్పించడం నానాటికీ తగ్గిస్తున్నాయి. నేటికీ మన దేశంలో అత్యధిక మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రుణాలు , వ్యవసాయ పెట్టుబడులు నానాటికీ తగ్గిపోతున్నాయి. 1990లో వ్యవసాయంలో 14 శాతం కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులుంటే అవి 2009 నాటికి 6 శాతానికి తగ్గిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలు ఖరీఫ్‌ సీజన్‌ దాటుతున్నా నేటికీి 50 శాతం కూడా రుణాలు చెల్లించడం లేదు. స్వయంసహాయక గ్రూపులకు ఈ వార్షిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.760 కోట్లు పావలా వడ్డీ కిింద రుణాలు ఇవ్వాలి. కానీ నేటికీ రూ.150 కోట్లు కూడా దాటలేదు. రాష్ట్రంలో ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలకు, ఇందిరమ్మ ఇళ్లకు ప్రజల వాటాగా అప్పులు చేయాల్సి వస్తున్నది. ప్రైవేటు రుణాలపై ఇప్పటికీ ఆధారపడి ఉన్న ప్రజలకు కొంతకాలం స్వయం సహాయక గ్రూపులు ఇతర రకాల రుణాలు సేదతీర్చే విధంగా ఉపయోగపడిన మాట నిజం. అయితే అదంతా ఎన్నికలస్టంట్‌ అని నేడు రుజువైంది. 2009 ఎన్నికల తరువాత సంక్షేమ పథకాలపైనే కాక అన్ని రకాల ప్రభుత్వ బ్యాంకుల రుణాలకు కోతబడ్డాయి. దీనివల్ల ప్రజలు అందుబాటులోని మైక్రో సంస్థల నుంచి అప్పులు విరివిగా తీసుకుంటున్నారు. ప్రభుత్వం బ్యాంకుల నుంచి ప్రజలకు రుణాలు ఇప్పిస్తే సామాన్య ప్రజలు ఈ మైక్రో సంస్థలనాశ్రయించాల్సిన అవసరమే ఉండదు.
మైక్రో సంస్థలకు కొన్ని విధానాలున్నాయి. ఇవి సరళీకరణ విధానాల్లో భాగం. డబ్బును ప్రజలకు సదా అందుబాటులోకి తీసుకురావడం, తిరిగి బలవంతంగానైనా వసూలు చేసుకోవడం ఇందులో కీలకం. దానికనుగుణంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటారు. భారతదేశంలో నేడు అధికారికంగా 89 మైక్రో సంస్థలు నడుస్తున్నాయి. ఒక్క ఆంధ్రరాష్ట్రంలో సుమారు 50 వేల కోట్ల రూపాయల రుణాలు మైక్రో సంస్థల ద్వారా సామాన్యులకు అందుతున్నాయి. అంటే రాష్ట్ర బడ్జెట్‌లో సగభాగమంత రుణాలు నేడు ఈ సంస్థల ద్వారా అప్పులిస్తున్నారన్నమాట. అప్పులిచ్చే ముందు ప్రతి గ్రూపుకు రెండు రోజులు శిక్షణాతరగతులు పెడతారు. అప్పును ఎలా వసూలు చేయాలో నేర్పుతారు. గ్రూపులోని వారిదే వసూలు చేసే బాధ్యత. గ్రూపులో ఏ ఒక్కరు చెల్లించకపోయినా గ్రూపు సభ్యులు చెల్లించని మిగతా సభ్యులపై ఎలా ఒత్తిడి చేయాలో కూడా తర్ఫీదు ఇస్తారు. అయినా సాధ్యం కాకపోతే తమ సిబ్బంది పేరుతో రౌడీ గ్యాంగ్‌లను ఇళ్లపైకి పంపిస్తారు. మగవాళ్లు లేని సమయంలో ఆడవాళ్లను వేధిస్తారు. వ్యభిచారం చేసైనా తమ అప్పు తీర్చమంటారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలో ఆర్‌.వెంకటలక్ష్మి అనే అమ్మాయిని స్పందన మైక్రో సంస్థ సిబ్బంది వ్యభిచారం చేసి తమ అప్పు తీర్చమని రెండు రోజులు హెచ్చరించారు. మూడవరోజు పక్కనున్న లాడ్జికి తీసుకువెళ్లి అప్పగిస్తామని బెదిరించారు. అదే రోజు ఆ మహిళ వంటిపై కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇందిరమ్మ ఇంటికోసం తల్లిదండ్రులు చేసిన అప్పుకు వెంకటలక్ష్మి బలైంది. ఇలాంటి అనేక ఉదాహరణలు నేడు ప్రతి జిల్లాలోనూ వెలుగుచూస్తున్నాయి. మైక్రో సంస్థల యంత్రాంగం గురించి ప్రభుత్వానికి తెలియనిదేమీ కాదు. అయినా గుడ్లప్పగించి చోద్యం చూస్తోంది.
ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా వచ్చిన ఈ విధానాలు ప్రపంచీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం ద్వారానే అరికట్టగలం. ఈ లోగా మైక్రో ఫైనాన్స్‌ సంస్థల రుణాలపై బ్యాంకు రుణాల లాగా వడ్డీలు వసూలు చేయాలని మైక్రో సంస్థలు వసూళ్లు సందర్భంలో జరిగే దౌర్జన్యాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు ఉద్యమించాలి.

 

0 comments: