‘‘మైక్రో దారుణాలు’’ - 06

మైక్రో మరణాలు-ప్రభుత్వ వైఫల్యాలు

-కె.స్వరూపారాణి
మైక్రో ఫైనాన్స్‌ సంస్థల అకృత్యాలకు గత పక్షం రోజులలో రాష్ట్రంలో ముఫైమంది దాకా బలవన్మరణం చెందారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వారం కిస్తీ కట్టలేదని బకాయి కింద 10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశారు. అదే జిల్లా పూసలవారి పాలెంలో తల్లి రుణం చెల్లించలేకపోవటంతో కూతురును పడుపు వృత్తిలోకి దించమని సూక్ష్మరుణ సంస్థలు ఒత్తిడి తేవటంతో 16 సంవత్సరాల వెంకట లకిë కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లాలో వారం
కిస్తీల కట్టే దగ్గర భార్య భర్తల మధ్య మనస్పర్ధలు పెరిగి జంట విడిపోయారు. మనోవ్యధతో ఆమె హాస్పటల్‌ పాలైంది. కరీంనగర్‌ జమ్మిగుంట నుంచి బతుకుదెరువు కోసం వరంగల్‌ కరీమాబాద్‌కి వలస వచ్చిన ప్రవల్లిక కుటుంబం మైక్రో రుణ బంధంలో చిక్కుకుని తీర్చలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చెన్నాయిపల్లికి చెందిన పద్మ కుటుంబ పోషణ కోసం మైక్రో సంస్థల వద్ద అప్పు తీసుకుంది. రుణం తీర్చే దగ్గర భార్యా భర్తల మధ్య గొడవలై ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి బలవన్మరణం పొందింది. రాజమండ్రి కంతేరు అమ్మాజి (అంగన్‌వాడీ ఆయా) నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం 5 సంస్థల వద్ద రుణాలు తీసుకుంది. ఒక సంస్థ అప్పు తీర్చడం కోసం ఇంకో సంస్థ వద్ద అప్పులు చేసి చివరికి ప్రాణాలు వదిలింది. అనంతపురం జిల్లా కదిరిలో మైక్రో సంస్థల వేధింపులు, అవమానాలు భరించలేక భార్యా భర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో తోటి సభ్యులే ఇంటిలో నుండి బయటికి లాగి ఇంటికి తాళం పెట్టటంతో నిమ్మక చిట్టెమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్‌లో వారం కిస్తీలు కట్టలేక చివరికి కన్నకూతురు మంగళసూత్రాలు కుదువ బెట్టి కిస్తీ కట్టింది. అల్లుడు పుస్తెలు లేకుండా నా యింటికి పంపొద్దని చెప్పడంతో బోరున విలపిస్తోందా ఇల్లాలు..వారంవారం రుణం వసూలు బాధ్యత గ్రూపు సభ్యుల దవటం పైగా సభ్యులలో ఎవరు కట్టక పోయినా మిగతా సభ్యులు కట్టాల్సి రావటం వలన ఆప్యాయతలు కనుమరుగై పగలు రగులుతున్నాయి. మైక్రో సంస్ధల ఆగడాలవల్ల బార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరిగి విడిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇరుగుపొరుగు సంబంధాలు దెబ్బతింటున్నాయి. పైన పేర్కొన్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం, పిల్లల చదువులు, పెళ్ళి ఖర్చులు, కట్నాల కోసం ఎక్కువగా ఈ అప్పులు చేస్తున్నారు. వీటిని తీర్చడం కోసం నివాసముంటున్న ఇంటిని అమ్మిన వారు కొందరైతే, పుస్తెల తాడు మొదలు ఇంట్లో వస్తువులను అమ్ముకునేవారు మరికొందరు.. మైక్రో సంస్థలు రుణాల వసూలు అమానవీయ పద్ధతులకు ఊరు వదిలి వలసలు పోయేవారు ఇంకొందరు.
సామాజికాభివృద్ధి, పేదరిక నిర్మూలన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన మైక్రో సంస్థల విషవలయంలో దళిత, గిరిజన, వెనకబడిన తరగతుల మహిళలు 90 శాతం వున్నారు. ఫైనాన్స్‌ వ్యాపారుల వద్ద 10 రూపాయల వడ్డీకి తెచ్చుకోలేక, ప్రభుత్వం నుండి ఆర్ధిక సాయం అందక సూక్ష్మ రుణ సంస్థల వద్ద అప్పులు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విషవలయంలో పేద మహిళలే వారి టార్గెట్‌. అడక్కుండానే ఇంటికి వచ్చి తియ్యటి మాటలు చెప్పి అప్పు ఇస్తామంటారు. వడ్డీ రెండు రూపాయలని చెపుతారు. వారి ఉచ్చులోకి లాగుతారు. అప్పు ఎవరికి అత్యవసరమో ఆమెనే 5గురితో గ్రూపును తయారు చేయమంటారు. గ్రూపు ఏర్పాటు చేసిన తర్వాత నాల్గు రోజులు సంస్ధ నిబంధనలు చెపుతూ శిక్షణనిస్తారు. సభ్యులు ఎవరైనా చెల్లించకపోతే మేమే చెల్లిస్తాం అని ప్రమాణం చేయిస్త్తారు. రుణం తీసుకుని ఏమి చేస్తావని ప్రశ్నించరు. రుణం ఎంత అయినప్పటికీ 50 వారాలు కట్టాలి. డిపాజిట్‌ 360రూపాయిలు, బ్యాంకు, సర్వీసు చార్జీలు 50రూపాయలు, సభ్యత్వ రుసుం 70 రూపాయిల చొప్పున సభ్యుల వద్ద రుణం ఇవ్వడానికి ముందే వసూలు చేస్తారు. మొదటి అప్పు తీరకముందే మిడిల్‌ లోన్‌ రూ6000లు ఇస్తారు. మొదటి అప్పు తీర్చేందుకు రెండో అప్పు చేస్తున్నారు. ఈ అప్పులు తీర్చేందుకు పుస్తెలు, కాళ్ళపట్టీలు, ఇంట్లో సామాన్లు, బర్రెలు, మేకలు లాంటివి కూడా మైక్రోసంస్ధల వశమవుతున్నాయి.
ఐద్వా రాష్ట్ర కమిటీ జిల్లాలలో చేసిన సర్వేలో ఆందోళనకర అంశాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. కుటుంబంలో పెళ్ళైనా, చావైనా అనారోగ్యంతో వున్నా ఎలాంటి విపత్కర పరిస్ధితులు వున్నా సంస్థ నిర్ణయించిన సమయానికి వెళ్ళి వాయిదా కట్టాల్సిందే. 5 నిమిషాలు లేటయినా వేధింపులు తప్పవు. అసలు+ వడ్డీ వారం వారం కట్టాలి. అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇంటి మీదికి వెళ్ళి నానా దుర్భాషలాడతారు. మైక్రోఫైనాన్స్‌ సంస్ధల పేర్లు వారికి తెలియవు. కిస్తీకట్టే వారం పేరు మాత్రమే తెలుసు. కిస్తీ కట్టే రోజు వస్తుందంటే భయం గుప్పిట్లో బతుకుతూ తిండి, నిద్రకు దూరమవుతున్నారు. ఈ దుస్ధితి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మహిళలను వ్యభిచారం చేసైనా రుణం తీర్చమని దూషించడం సర్వసాధారణం. నీవు చనిపోతే ఇన్సూరెన్స్‌ వస్తుంది. ఆ డబ్బు బకాయి కింద జమ చేసుకుంటాం చావు అని ప్రేరేపిస్తారు. ఇన్సూరెన్స్‌ క్లయిమ్‌ ఎంత మొత్తానికి చేస్త్తారో వారికి తెలియదు. పాలసీలు వాళ్ళ చేతికి యివ్వరు. పత్రాల మీద ముందే సంతకాలు చేయించుకుంటారు.
బ్యాంకు రుణాలు పేదలకు అందుబాటులో లేకపోవటంతో ఎలాంటి పూచీకత్తు లేకుండా సామాజికాభివృద్ధి పేరుతో ప్రారంభించిన సూక్ష్మరుణ సంస్థలు దేశవ్యాప్తంగా మూడు వేల వరకూ వున్నాయి. నూతన ఆర్థిక విధానాల ప్రభావం వల్ల శరవేగంతో విస్తరించాయి. దేశంలో ఇప్పటి వరకూ రైతు, చేనేత ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మైక్రోఫైన్సాన్స్‌ సంస్ధల మాఫియా వలన పేదల ఆత్మహత్యలు కూడా తోడయ్యాయి. ఈవిషయంలో మన రాష్ట్రం అగ్రస్ధానంలో వుంది. 2009లో 85లక్షల రుణగ్రహీతలు వుంటే వారి సంఖ్య కోటికి చేరినట్లుగా లెక్కలు తెలుపుతున్నాయి. ఒక్క ఎస్‌కెఎస్‌ సంస్ధలో 73లక్షల మంది వున్నట్లుగా ఆసంస్ధ అధిపతి విక్రమ్‌ ఆకుల ప్రకటించారు.
1976లో బంగ్లాదేశ్‌లో ప్రొఫెసర్‌ మహమూద్‌ యూనిస్‌ ప్రారంభించిన ఉద్యమం సూక్ష్మరుణంగా రూపాంతరం చెంది మన దేశానికి కూడా విస్తరించింది. 2002 నుండి స్వయం సహాయ సంఘాలకు సమాంతరంగా శర వేగంతో ఈ వ్యవస్థ విస్తరించింది. మన రాష్ట్రంలో ఈ సంస్థలు 25 వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నట్లు లెక్కలు తెలుపుతున్నాయి. మారుమూల గ్రామాలు, పట్టణాల్లోని పేద బస్తీలలోని పేదలే వీరి టార్గెట్‌. ఈ సంస్థల విస్తరణ చూసిన కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్‌ బ్యాంకు వీటికి అనుమతులిచ్చాయి. అంతే కాకుండా విదేశాల నుంచి వాణిజ్యపరమైన అప్పులు తీసుకునేందుకు నిబంధనల్ని సరళీకరించింది.
ఆర్‌.బి.టి చట్టం సెక్షన్‌ (1)ఎ ప్రకారం. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలుగా రిజిస్టర్‌ చేయించుకుంటున్నారు. బ్యాంకుల నుండి 8.5-11 శాతం వడ్డీకి రుణం తీసుకుని నిర్వహణ వ్యయం పేరుతో మరికొంత వడ్డీ కలిపి రుణాలు ఇస్తున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై మొదటి నుండి చివరి వరకూ ప్లాట్‌రేటు పద్ధతిపై కట్టించుకుంటున్నారు. అప్పు తీరే వరకూ మొత్తం రుణంపై వడ్డీ చెల్లించాలి. ఈ పద్ధతి వల్ల వడ్డీ 40 -60 శాతం వరకూ కట్టాల్సివస్తుంది. వీటిపై నిరక్షరాస్యులకు అవగాహన లేదు. ఒకవేళ అవగాహన వున్నా గత్యంతరం లేని పరిస్థితులలో దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. నగదు రూపంలోనే గాక బహుళ జాతి సంస్థల వస్తువుల అమ్మకాలకు ఉపయోగించుకుంటున్నాయి. బంగారం, సెల్‌ఫోన్‌లు, ఫ్రిజ్‌, బీరువాలు, డబుల్‌ కాట్‌లు, వాటర్‌ ఫిల్టర్లు చివరికి రోజువారీ వాడుకునే నిత్యావసర వస్తువులకు కూడా ఈ సంస్థలు రుణాలు ఇస్తున్నాయి. ఉత్పాదక రంగానికి వుపయోగపడే బర్రెలు, వ్యవసాయం, వ్యాపారం, కుట్టుమిషన్స్‌ వంటి వాటికోసం పెట్టుబడి పెడితే కొంత వరకు ఫర్వాలేదు. అనుత్పాదక రంగాలపై ఖర్చు చేయడం వల్ల ఈ రుణాలు తీర్చలేకపోతున్నారు..
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వమూ రెండూ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను ప్రోత్సహించాయి. ఈ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతించాయి. ప్రభుత్వం, ప్రపంచబ్యాంకు, రిజర్వ్‌ బ్యాంకు అండదండలతో ఇవి నేడు ఇంతగా విస్తరించాయి. మన రాష్ట్రంలో ఎస్‌హెచ్‌జిలు 9 లక్షల 32 వేల గ్రూపులలో కోటి మంది సభ్యులతో దేశంలో అగ్రస్ధానంలో వున్నాయి. సభ్యులు తీసుకున్న రుణం 99 శాతం రికవరీ అవుతోందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.. ఎన్నికల ముందు 12 వేల కోట్ల రుణాలు ఇప్పిస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు 1819 కోట్లు మాత్రమే రుణాలు మంజూరు చేసింది. 2008 నుండి పావలా వడ్డీ రుణాలు లేవు, పావలా వడ్డీకి సంవత్సరానికి 800 కోట్లు అవసరం కాగా 2010లో ప్రభుత్వ బడ్జెట్‌లో 200 కోట్లు మాత్రమే కేటాయించింది. కేటాయించిన నిధులు కూడా విడుదల కావటం లేదు. ఈ కాలంలో బ్యాంకులు రుణం కోసం ఒకటికి పది సార్లు తిప్పించుకుంటున్నారు. పరపతి ఉన్న వాళ్ళకు రుణాలు అందుతున్నాయి. దళిత, గిరిజన, వెనకబడిన తరగతి మహిళలకు రుణాలు అందటంలేదు. అనివార్యంగా కుటుంబ ఆర్థిక అవసరాల కోసం ప్రైవేటు సంస్థల వద్దకు పోతున్నారు. పేద కుటుంబాలు ఈ అప్పుల ఊబిలో ఎందుకు కూరుకుపోతున్నాయో ప్రభుత్వాలు పరిశీలించడం లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న అధికధరలు ఉపాధి, విద్య, వైద్యం వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టంలేదు.
అధిక వడ్డీలు, వేధింపులకు గురిచేస్తున్న మైక్రో సంస్థలపై రిజర్వు బ్యాంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొరడా ఝుళిపించాలి. అధిక వడ్డీలు, వేధింపులకు పాల్పడుతున్న సంస్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి. ఆర్డినెన్స్‌ కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. వడ్డీ రేటు వంటి కీలకమైన అంశాలను అది విస్మరించింది. స్వయం సహాయక సంఘాలకు రైతుమిత్ర గ్రూపులకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలి. సూక్ష్మరుణ సంస్థలపైన . వాటికి రుణాలిచ్చే బ్యాంకులపైన పర్యవేక్షణ వుండాలి.

 

0 comments: