‘‘మైక్రో దారుణాలు’’ - 04

 దొంగ చేతికి తాళాలా!
మైక్రోఫైనాన్స్‌ కార్యకాలాపాలపై నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేసే యోచన ప్రస్తుతం లేదని, వడ్డీ రేటుపై ఆ సంస్థలే స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ వాకృచ్చడం దొంగ చేతికి తాళం ఇవ్వడంలా వుంది. మైక్రోఫైనాన్స్‌ సంస్థలు(ఎంఎఫ్‌ఐ) వసూలు చేయాల్సిన వడ్డీ రేటును నియంత్రించే అధికారం తమకు లేదు కాబట్టి కేంద్రమే ఒక ఆర్డినెన్స్‌ తీసుకొస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వట్టి వసంతకుమార్‌ సోమవారం,
మంగళవారం పునరుద్ఘాటించారు. అవి 'వట్టి మాటలే' నని ప్రణబ్‌ముఖర్జీ తేల్చి చెప్పినట్లయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనంతో ఆడుతున్న దొంగాట ఇది. స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) ఇతోధికంగా రుణాలిప్పిస్తామని గత పదేళ్ళగా రాష్ట్రాన్ని ఏలుతున్న పెద్దలు ఊదరకొట్టారు. మహిళలకు అరచేతిలో స్వర్గం చూపారు. కోటిమందిని లక్షాధికారులుగా చేస్తామని 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అదే పనిగా చెప్పింది. కానీ ఏరు దాటిన తరువాత బోడి మల్లయ్య అన్న చందంగా ఎన్నికలు ముగిశాక ఎస్‌హెచ్‌జిల రుణాల గురించి దాదాపు మరిచిపోయారు. పర్యవసానంగా ప్రజల అవసరాలకు మైక్రోఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయించాల్సి వచ్చింది. వెంటబడి రుణం ఇచ్చిన ఆ సంస్థలు వసూళ్ళ సమయంలో తీవ్ర వేధింపులకు దిగడంతో గత నెల రోజుల్లోనే రాష్ట్రమంతటా పదుల సంఖ్యలో రుణగ్రస్తులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జనం ఆందోళన, ప్రతిపక్షాల వత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడి హడావిడిగా ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. కీలకమైన వడ్డీ నియంత్రణ గురించి కనీస ప్రస్తావన కూడా లేని ఆ ఆర్డినెన్స్‌ను నిరుపయోగం అని విపక్షాలు గొంతెత్తాయి. దాంతో వడ్డీ నియంత్రణ అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని, కేంద్రమే చర్యలు చేపడుతుందని మంత్రులు, ముఖ్యమంత్రి ప్రకటనలు గుప్పించారు. తీరా చూస్తే చావుకబురు చల్లగా చెప్పినట్టు వడ్డీరేటును మైక్రోఫైనాన్స్‌ సంస్థలే నిర్ణయించుకోవాలని ప్రణబ్‌ ప్రకటించేశారు. అంతేగాక వడ్డీరేటు అసాధారణమైనంత ఎక్కువగా (ఎబ్‌నార్మల్లీ హై) ఉండకూడదని సలహా ఇచ్చారు. అంటే సాధారణం కంటే ఎక్కువ వసూలు చేసుకొమ్మని అన్యాపదేశంగా చెప్పినట్లే.
సరళీకరణ విధానాలకు మైక్రోఫైనాన్స్‌కు విడదీయరాని బ్రహ్మముడి. నిజానికి సరళీకరణ విధానాల ముద్దుబిడ్డే ఈ మైక్రోఫైనాన్స్‌ విధానం. ప్రపంచబ్యాంకు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకుల కనుసన్నల్లోనే ఈ సంస్థలు యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. మైక్రోఫైనాన్స్‌ తదితర సంస్థల ఆర్థిక కార్యకలాపాలు, వడ్డీరేట్లు తదితర అంశాలను నియంత్రిస్తూ కేంద్ర ప్రభుత్వం 2007లోనే ఒక బిల్లును ప్రతిపాదించింది. కానీ అది ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది..... కాదు ఆపేశారనడం సబబుగా వుంటుంది. రాష్ట్రమంతటా ఇంతగా గగ్గోలు పెడుతున్నా, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా వుంటున్నప్పటికీ ఆ బిల్లు గురించి కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిమ్మనడం లేదు. సరళీకరణ విధానాల ముద్దుబిడ్డను అవే విధానాలను వేగంగా అమలు చేస్తున్న యుపిఎ-2 సర్కారు నియంత్రిస్తుందని ఎవరూ భావించలేరు. అంతేగాక యువరాజావారికి ఈ సంస్థలపట్ల ఎంతో మక్కువ. 'వడ్డించే వాడు మన వాడయితే ఇక వేరే చెప్పాలా' అన్నట్లుంది ఎంఎఫ్‌ఐల వ్యవహారం.
వడ్డీ రేటు విషయంలో ఎంఎఫ్‌ఐలు స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి చెప్పడం మరీ దుర్మార్గం. ఇప్పుడు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నది వారి వడ్డీరేట్లే. అందుకని ప్రభుత్వానికి ఏమాత్రం నిజాయితీ వున్నా వెంటనే వడ్డీరేట్లను నియంత్రిస్తూ చట్టం చేయాలి. అలా కాకుండా వారినే నియంత్రణ విధించుకొండి అని హితవు పలికారు. అంటే పులి గుహలోకి మేకను తోలి పులికి నియంత్రణ సుద్దులు చెప్తే ఫలితముంటుందా? పులి మేకను మింగేయక మానుతుందా? ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమిదే. కేంద్రం చట్టం చేస్తుందని రాష్ట్రం, ఆర్డినెన్సులో నిబంధనలు కఠినతరం చేయాలని కేంద్రం...ఇలా ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ ప్రజలను మోసగిస్తున్నారు. మంత్రి వట్టి వసంతకుమార్‌ మరో అడుగు ముందుకేశారు. పేదలు స్నో, పౌడర్ల కోసమే రుణాలు తీసుకుంటున్నట్లు అభివర్ణించారు. మైక్రో ఫైనాన్స్‌ దుర్మార్గాలను అరికట్టవలసిన మంత్రి అనవలసిన మాటలేనా ఇవి? మైక్రోఫైనాన్స్‌ సంస్థల పట్ల ఎంత శ్రద్ధాసక్తులు లేకపోతే పేద రుణగ్రహీతలను ఇలా చులకన చేస్తారు. పొదుపు గ్రూపులను వినియోగదారులుగా మార్చేసి పొదుపు అన్న మాటకు అర్థాన్నే మార్చేసిన ప్రభుత్వం తన విధానం వల్ల ఉత్పన్నమైన దురవస్థను చూసి చింతించవలసిందిపోయి పేదలను అవమానిస్తోంది. తప్పుడు ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిన మంత్రి వట్టి వసంతకుమార్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పడం సబబుగా వుంటుంది.
నామినేటెడ్‌ పోస్టుల నియామకాల మొదలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకూ అన్నింటికీ హస్తిన వైపు చూడడం మన రాష్ట్ర కాంగ్రెస్‌ పాలకులకు నిత్యకృత్యం. మైక్రో ఫైనాన్స్‌ ఆగడాల విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి తేల్చి చెప్పేశారు గనుక రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రేటు నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలి. నిజానికి ఎంఎఫ్‌ఐల వేధింపులను అరికట్టడానికి ఇప్పటికే ఉన్న చట్టాలు సరిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సింది అమలు చేసే చిత్తశుద్ధి మాత్రమే. ఉన్న చట్టాల ప్రాతిపదికగా ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యల విషయంలో సంబంధిత మైక్రోఫైనాన్స్‌ సంస్థను నిందితులుగా చేర్చి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి.

 

0 comments: