'మైక్రో'కు నాబార్డు అండ

  • రీఫైనాన్స్‌పై వడ్డీ తగ్గింపు
  • విరివిగా బ్యాంకు రుణాలు
  • సూకë సంస్థలకు 9 శాతం.. డ్వాక్రా గ్రూపులకు 12 %
చిన్న అవసరానికి అప్పు తీసుకున్న పేదలను జీవితాంతం రుణ గ్రస్తులుగా మారుస్తున్న మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డు) అండగా నిలిచింది. సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం మూలంగానే నాబార్డు మైక్రోలకు 'సాయం' చేసింది. ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకులకు రీఫైనాన్స్‌
పద్ధతిపై నాబార్డు ఇచ్చే రుణాల్లో అత్యధిక శాతం మైక్రోలకు అందే విధంగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. వ్యవసాయం, స్వయం సహాయ సంఘా (ఎస్‌హెచ్‌జి)లకు ఇచ్చే రుణాలపై కంటే మైక్రోలకు ఇచ్చే రుణాలపై వడ్డీని మూడు శాతం తగ్గించింది. ఈ మేరకు గత ఏడాదే నాబార్డు నిర్ణయం తీసుకుంది. మైక్రోలకు అప్పులివ్వడానికి నాబార్డు తక్కువ వడ్డీకి రీఫైనాన్స్‌ చేస్తుండటంతో జాతీయ బ్యాంకులు కూడా ఇతర రుణాలపై కంటే తక్కువ వడ్డీకి మైక్రోలకు విరివిగా రుణాలిస్తున్నాయి. భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్‌ (సిడ్బీ) సైతం మైక్రోలకు తక్కువ వడ్డీకి రుణాలిస్తుండటంతో జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేట్‌, విదేశీ బ్యాంకులు కూడా సూక్ష్మ సంస్థలకు తక్కువ వడ్డీపై పెద్ద మొత్తంలో అప్పులిస్తున్నాయి. బ్యాంకుల నుండి తక్కువ వడ్డీపై రుణాలు తీసుకుంటున్న మైక్రోలు అడ్డూ అదుపూ లేకుండా మహిళా గ్రూపులకు, ఇతర వర్గాలకు సూక్ష్మ రుణాలిచ్చి తమకిష్టమొచ్చినట్లు అధిక వడ్డీలు గుంజుతున్నాయి. అప్పులను, వాటిపై వడ్డీలను తిరిగి చెల్లించలేని పేదలను చిత్రహింసలకు గురి చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి.
వాటికే బ్యాంకు రుణం
బ్యాంకులతో సమానంగా మైక్రోలు చిన్న రుణాలివ్వడానికి కారణం వాటికి ఇబ్బడిముబ్బడిగా అందుతున్న 'నిధులే'. దేశ వ్యాప్తంగా మైక్రోలిచ్చిన రుణాలు రూ.40 వేల కోట్లుగా చెబుతున్నారు. సూక్ష్మ సంస్థలు తమ వ్యాపారం కోసం సేకరించే నిధుల్లో 80 శాతం వివిధ బ్యాంకుల నుండి పొందుతున్నాయి. మైక్రోలకు అప్పులిచ్చేందుకు బ్యాంకులను కేంద్రం, ఆర్‌బిఐ ప్రోత్సహిస్తున్నాయి. ప్రాధాన్యతా రంగ రుణాల జాబితాలో చేర్చాయి. ఒక్క సిడ్బీయే మైక్రోలకు లేదా వాటికి రుణాలిచ్చే ఆర్థిక సంస్థలకు 2009-10లో 9-10 శాతం వడ్డీపై రూ.32 వేల కోట్లు పంపిణీ చేసింది. నాబార్డు సైతం తానేమీ తక్కువ తిననట్లు వ్యవహరించింది. జాతీయ బ్యాంకులకు రీఫైనాన్స్‌ చేసే అన్ని రకాల రుణాలపై తాను వసూలు చేసే కనీస వడ్డీని 10.25 శాతంగా నిర్ణయించింది. అదే మైక్రోల కోసం బ్యాంకులకు రీఫైనాన్స్‌ చేసే రుణాలపై మూడు శాతం వడ్డీని తగ్గించింది. వ్యవసాయం, ఎస్‌హెచ్‌జి తదితరాలకు 10.25 శాతంగా, మైక్రోలకు 7.25 శాతంగా వడ్డీని నిర్ణయించింది. మైక్రోలకు రుణాలిస్తే నాబార్డు తక్కువ వడ్డీ ఛార్జి చేస్తున్నందున జాతీయ బ్యాంకులు వ్యవసాయం, ఎస్‌హెచ్‌జిల కంటే సూక్ష్మ సంస్థలకు అప్పులివ్వడానికి ఉత్సాహం చూపుతున్నాయి.
జాతీయ బ్యాంకులు మైక్రోలకు రుణాలిస్తున్నప్పుడు ప్రైవేట్‌ బ్యాంకులు ఊరుకుంటాయా? అవీ మైక్రోల దారి పట్టాయి. సిడ్బీ నేతృత్వంలో ఐడిబిఐ, అన్ని జాతీయ బ్యాంకులు, ప్రైవేట్‌ బ్యాంకులైన ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌ఎస్‌బిసి, యుబిఐ, యాక్సిస్‌, రాబో ఇండియా, రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్‌లాండ్‌ (ఆర్‌బిఎస్‌), ఇండస్‌ఇండ్‌ కలిపి మైక్రోలకు దాదాపు రూ.30 వేల కోట్లకుపైగా అప్పులిచ్చాయి. మైక్రోలకు ప్రతి వారం రూ.600 కోట్లు అప్పులిచ్చే స్థాయిలో బ్యాంకుల ప్రోత్సాహం ఉంది. బ్యాంకులు ఎక్కువ మందికి చిన్నచిన్న రుణాలిచ్చేదాని కంటే పెద్ద మొత్తంలో మైక్రోలకు రుణాలివ్వడానికే మొగ్గు చూపుతున్నాయి. కచ్చితంగా సంవత్సరంలో ఇన్ని రుణాలివ్వాలని బ్యాంకులకు ఆర్‌బిఐ టార్గెట్లు పెడుతోంది. దీంతో సకాలంలో రీపేమెంట్‌ చేస్తున్న మైక్రోలకు బ్యాంకులు పెద్ద మొత్తంలో రుణాలిస్తున్నాయి.
దారి దోపిడీ నయం
వ్యవసాయ రుణాల కోసం రాష్ట్ర సహకార బ్యాంక్‌ (ఆప్కాబ్‌)కు నాబార్డు 9.25 శాతం వడ్డీపై ఏడాదికి దాదాపు రూ.5 వేల కోట్లు రీఫైనాన్స్‌ చేస్తోంది. రైతులకు 12 శాతం వడ్డీపై ఆప్కాబ్‌ అప్పులిస్తోంది. నాబార్డుకు అసలు, వడ్డీ చెల్లించగా అన్ని ఖర్చులూ పోను ఆప్కాబ్‌కు 20 కోట్లు లాభం వస్తోంది. మైక్రోల విషయానికొస్తే జాతీయ బ్యాంకులకు నాబార్డు 7.25 శాతం వడ్డీకి రీఫైనాన్స్‌ చేస్తోంది. బ్యాంకులు 8.5-9 శాతం వడ్డీకి సూక్ష్మ సంస్థలకు రుణాలిస్తున్నాయి. సూక్ష్మ సంస్థలు మహిళలకు 40-50 శాతం వడ్డీకి అప్పులిస్తున్నాయి. మైక్రోల వాదన ప్రకారం చూసినా గరిష్టంగా మహిళల నుండి 26 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఆప్కాబ్‌ 2-2.75 శాతం వడ్డీ మార్జిన్‌పై ఐదు వేల కోట్ల వ్యాపారం చేసి 20 కోట్లు లాభం సంపాదిస్తే బ్యాంకుల నుండి తొమ్మిది శాతానికి అప్పులు తీసుకున్న సూక్ష్మ సంస్థలు 17 శాతం వడ్డీ మార్జిన్‌పై మహిళలకు రుణాలిస్తే వాటికి ఎంత లాభం వస్తుంది? ఊహించడానికే భయ మేస్తుంది. రాష్ట్రంలో మైక్రో సంస్థలు 15 వేల కోట్ల వరకూ అప్పులిచ్చినట్లు చెబుతున్నారు. ఆర్థిక సంస్థల నుండి తొమ్మిది శాతం వడ్డీకి నిధులు సేకరించి, వాటినే 26 శాతం వడ్డీకి మహిళలకు అప్పులిస్తే... వడ్డీ మార్జిన్‌ 17 శాతం... లాభం 400 కోట్లు. ఏడాదిలో మైక్రోలు 15 వేల కోట్లు అప్పులిచ్చి 400 కోట్లు లాభం కళ్ల జూస్తున్నాయి. మైక్రోల ఈ చౌక బేరానికి కేంద్రం, ఆర్‌బిఐ, నాబార్డు, సిడ్బీ, ఇతర బ్యాంకులు అండగా నిలిచాయి. ఎస్‌కెఎస్‌కు ఈ ఏడాది రెండో త్రైమాసిక ఫలితాల్లో 116 శాతం లాభాలొచ్చాయి. నికరంగా 80 కోట్లు లాభాలు పొందింది.
ఆర్థిక వ్యవస్థతో లింకు
అధిక వడ్డీలపై నిరసనలొస్తున్నందున మైక్రోలు ఒక వేదికపైకొచ్చి స్వచ్ఛందంగా ఆడిట్‌ చేయించుకోవాలన్న ప్రతిపాదనను సిడ్బీ ముందుకు తెచ్చింది. ఈ నెలలో చర్చలు జరిగాయి. ఎటువంటి నియంత్రణా లేని మైక్రోలకు అప్పులివ్వడం అనేది బ్యాంకులకు ప్రాధాన్యతగా ఉండకూడదని ఆర్‌బిఐ నియమించిన అధ్యయన కమిటీ నొక్కి చెప్పింది. అయినా ఆర్‌బిఐ వినిపించుకోలేదు. మైక్రోల ఆగడాలపై ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తడంతో మరో కమిటీని ఇటీవల నియమించింది. నాబార్డే మైక్రోలకు తక్కువ వడ్డీకి అప్పులిప్పించే ఏర్పాట్లు చేస్తుండగా, మైక్రోలపై నియంత్రణ నాబార్డుకు అప్పగించాలన్న ప్రతిపాదనలు రావడం విచిత్రం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ నేపథ్యంలో దేశంలోని మైక్రోలన్నీ ఒకటై తాము బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించబోమని బెదిరిస్తున్నాయి. చెల్లింపులపై మారటోరియం విధించాలని కోరుతున్నాయి. కొసమెరుపు...మైక్రోలకు 9 శాతానికి రుణాలిస్తున్న బ్యాంకులు ఎస్‌హెచ్‌జిలకు ఇచ్చే రుణాలపై 12 శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి.

 

0 comments: