జాతి అమూల్య సంపద మన యువత

అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలలో భారత్‌ ఒకటి. మన దేశంలో 13 నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న వారు 45.9 కోట్లమంది ఉన్నారు. అంటే, దేశ జనాభాలో వీరు 37.9 శాతంగా ఉన్నారు. 2003నాటి జాతీయ యువజన విధానాన్ని అనుసరించి ఈ వయస్కులందరూ యువజనులుగా లెక్కకు వస్తారు. ఈ యువశక్తిని సక్రమంగా వినియోగించు కోగలిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.


కామన్‌వెల్త్‌ క్రీడలకు సంబంధించి మనమందరం శిరసెత్తుకుని నిలిచేలా చేసిన యువతీ యువకులను యావజ్జాతి ముక్తకంఠంతో అభినందిస్తున్నది. అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలలో భారత్‌ ఒకటి. మన దేశంలో 13 నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న వారు 45.9 కోట్లమంది ఉన్నారు. అంటే, దేశ జనాభాలో వీరు 37.9 శాతంగా ఉన్నారు. 2003నాటి జాతీయ యువజన విధానాన్ని అనుసరించి ఈ వయస్కులందరూ యువజనులుగా లెక్కకు వస్తారు. ఈ యువశక్తిని సక్రమంగా వినియోగించు కోగలిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. యువజనులలో వ్యాపించివున్న ధోరణులు ఎలాంటివో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తరపున నిర్వహించిన జాతీయ యువజన పాఠక సర్వేలో వెల్లడయ్యాయి. ఈ సర్వే ప్రకారం యువజనులలో 72.8 శాతం లేదా 33.3 కోట్లమంది అక్షరాస్యులు. ఇలాంటి వారిలో ఐదవ వంతుమంది ఇంటి చాకిరీలో మునిగి ఉన్నారు. కేవలం పది మందిలో ఒకరు మాత్రమే వేతన ఉద్యోగులుగా లేదా ఆదాయం వచ్చే వృత్తులలో ఉన్నారు. అక్షరాస్యులైన యువజనుల్లో షెడ్యూల్డ్‌ కులాలకు చెందినవారు 22.7 శాతంగానూ, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వారు 9.8 శాతంగానూ, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు 40.3 శాతంగానూ ఉన్నారు.
అక్షరాస్యులైన యువజనులలో 76 శాతం మంది కళాశాల విద్యకు నోచుకోలేదు. కళాశాల చదువులకు పోవాలని ప్రతియేటా దాదాపు 93 లక్షలమంది కోరుతున్నారు. అయినప్పటికీ 30 లక్షల సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నట్లు మరొక సర్వే ద్వారా తెలుస్తున్నది. మన దేశంలోని ప్రధానమైన విద్యా సంస్థలలో అవసరాలకూ, లభ్యతకూ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నది. ఐఐటి ప్రవేశ పరీక్షలో ఏటా 7000 మంది పాల్గొంటున్నారు. కాగా వివిధ కారణాల రీత్యా పలువురు యువతీ యువకులు తమ చదువును మధ్యలో నిలిపి వేస్తున్నారు. సంబంధిత వయస్కులలో కేవలం 10 శాతం మాత్రమే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రపంచ లేదా ఆసియా సగటుకన్నా ఇది చాలా తక్కువ. తమ కలలను నిజం చేసుకునే అవకాశాలు మన యువజనులకు అందివచ్చినట్లయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పురోగమనం వైపుకు దేశం వడివడిగా అడుగులు వేస్తుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఈ అధ్యయనాలు మరో వాస్తవాన్ని కూడా ముందుకు తీసుకు వచ్చాయి. తమ ప్రయత్నాలలో విజయం సాధించిన వారిలో అత్యధికులు మధ్య తరగతికి లేదా ఉన్నత మధ్యతరగతికి చెందినవారే. విద్యా రంగాన్ని ప్రైవేటీకరించటం లేదా వ్యాపారమయం చేయటంతో ధనిక కుటుంబాల వారికే విద్య అందుబాటులోకి వస్తున్నది. ఆసక్తి ఉన్నప్పటికీ పేదరికం కారణంగా చాలామంది విద్యకు దూరమవుతున్నారు. ఎవరు ఏ చదువులు చదవాలో ఎంతవరకు చదవాలో నిర్ణయించేది డబ్బే, ప్రతిభకు ఆ అవకాశం ఉండటం లేదు. సమస్త జనావళికి విద్య అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రతిభకు పట్టం కట్టినట్లవుతుంది. జాతి నిర్మాణానికి అదెంతో ఉపకారిగా ఉంటుంది. ఉపాధి రంగంలో సైతం ఇదే ధోరణి కనపడుతున్నది. కోట్ల సంఖ్యలో యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. లేదా వారికి నికరమైన పని లేకుండా పోయింది. కార్మిక మంత్రిత్వ శాఖ సేకరించిన వివరాల ప్రకారం 2004-05లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 15-24 మధ్య వయసున్న వారిలో 12 నుంచి 15 శాతం మందికి ఉపాధి కరువైంది. హామీతో కూడిన ఉపాధి లేకపోవటంతో భవిష్యత్‌ జీవితం గురించి యువజనులు ఆందోళనకు గురవుతున్నారు. జనాభా పెరుగుదల రేటుకన్నా శ్రామికుల పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా జిడిపి పెరుగుదల రేటుకు తగినట్లుగా ఉపాధి రేటు ఉండటం లేదు.
ప్రైవేటు రంగంలోని పరిశ్రమల్లోనూ, సేవా రంగంలోనూ నిస్తబ్దత నిండివుండటంతోపాటు, ప్రభుత్వ రంగం కుదించుకు పోతుండటంతో ఉపాధి అవకాశాలు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించ వలసిన ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చున్నది. ఉదారవాద ప్రపంచంలో అవకాశాలు అందచేయవలసింది మార్కెట్‌ అన్న వాదనను అది ముందుకు తీసుకు వస్తున్నది. అయితే నయా ఉదారవాద విధానాల డొల్లతనమేమిటో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం తెలియ చెప్తున్నది. భారతదేశంలో సైతం సంక్షోభం కారణంగా అనేకమంది నిరుద్యోగులుగా మారారు. దాదాపు 80 లక్షల ఉద్యోగావకాశాలు ఉనికిలోకి రాకుండా పోయాయి. దీనితో నిరుద్యోగం మరింతగా పెరిగింది. ప్రస్తుతమున్న ఉద్యోగార్థులకు, 2020 నాటికి మరో 11 కోట్లమంది యువజనులు తోడుకానున్నారు. కాని ఉపాధి అవకాశాలకు సంబంధించి భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నది. ప్రత్యేకించి విద్యాధిక యువజనులలో నిరుద్యోగం పెరుగుతుండటంతో విద్య నిమిత్తం ఖర్చు చేసిన సామాజిక, పాదార్థిక పెట్టుబడులు వృథా అవుతున్నాయి.
వారి ఉత్పాదక శక్తినీ, సామర్ధ్యాన్నీ దేశం ఉపయోగించు కోలేక పోతున్నది. మరో విషయమేమంటే, ఉపాధి అవకాశాలకు దూరంగా ఉన్నవారు రకరకాలైన దురలవాట్లకు లోనవుతున్నారు. గత పదేళ్ళలో యువజనులలో మద్యం అలవాటు రెట్టింపు అయినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. యువజనులకు ప్రాధాన్యతను ఇస్తామంటూ ప్రథమ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచీ ప్రభుత్వం చెప్తున్నది. కాని ప్రభుత్వం ఎన్నడూ తన మాటను నిలబెట్టుకోలేదు. అంతేకాక తన వైఫల్యానికి కారణాలను కూడా పరిశీలించలేదు. ప్రస్తుత ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలకు ప్రాధాన్యతను ఇస్తున్న రీత్యా యువజనులకు సంబంధించి నిర్ధేశిత లక్ష్యాలను సాధించే అవకాశాలు సన్నగిల్లిపోయాయి. ఈ పరిస్థితిని మార్చటానికి మారుగా దీనిని కప్పిపుచ్చటానికే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. యువజనుల్లో దాదాపు 77 శాతం సంగీతం, చలన చిత్రాలు, టెలివిజన్‌లపట్ల మక్కువ చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. విశేషమేమంటే, కేవలం 3.7 శాతం యువజనులకు మాత్రమే ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నది. ప్రసారమాధ్యమ ప్రభావం యువజనులపై బలంగా ఉన్నది. వినియోగదారీతత్వాన్నీ, వ్యక్తిగతవాదాన్నీ నూరిపోయటమేకాక ఏదోఒక విధంగా ధనికులుగా మారటమే లక్ష్యమన్న భావనను వారిలో నాటుతున్నది. కోకాకోలా చేసిన సర్వే ఈ విషయాన్నే ధ్రువపరిచింది.
విజేతలకు అక్కడికక్కడే డబ్బును ఇచ్చే రియాల్టీ షోలకు యువజనులు ఎగబడుతున్నారంటే అందులో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. వర్తమాన వాస్తవాలను గుర్తించటానికి బదులు ఈ భ్రమాత్మక ప్రపంచంలో అడుగుబెట్టటానికే యువజనులు ఆతృత పడుతున్నారు. ఇది చాలదన్నట్లుగా రాజకీయాల పట్లా, రాజకీయ నాయకుల పట్లా యువజనులలో విముఖతను కల్పించే ధోరణి ప్రసారమాధ్యమంలో పెరుగుతున్నది.
కేవలం 30 శాతం యువజనులు మాత్రమే రాజకీయాలపట్ల ఆసక్తిని చూపుతున్నారు. కాగా 72 శాతం వర్తమాన వ్యవహారాలపట్ల ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. దేశానికి సంబంధించిన వ్యవహారాలలో కొంతమంది ఆసక్తిని చూపుతున్నప్పటికీ, అత్యధికులు రాజకీయాలలో భాగస్వాములు కావటానికి సిద్ధంగా లేరన్న విషయం దీనితో స్పష్టమవుతున్నది. మొదటి అంశం ఆశావహమైనదైనప్పటికీ, రెండవది నిరాశను కలిగించేదని చెప్పక తప్పదు. ఈ మొత్తం ఒక ప్రమాదకరమైన పరిస్థితినీ, అనిశ్చిత తత్వాన్నీ తెలియ చేస్తున్నది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లటం, వారి కలలు నిజమయ్యే పరిస్థితి లేకపోవటం ఈ దురదృష్టకర స్థితికి కారణం. రాజకీయాలంటే ఏహ్యభావం కలగటానికి కూడా ఇదేకారణం.
ఈ దుస్థితిని విచ్ఛిన్న శక్తులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఒక్కసారి కాశ్మీర్‌ వైపుకు చూడండి. అక్కడి యువజనులకు ఉపాధి అవకాశాలు కొరవడ్డాయి. పాలక వర్గాలు వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. తత్పలితంగా వారిలో పరాయీకరణ భావన చోటుచేసుకున్నది. ఈ స్థితిని వేర్పాటువాదులు తమకు అనుకూలంగా మలచుకునేందుకు, తమ విచ్ఛిన్న కార్యకలాపాలకు వారిని పావులుగా వాడుకునేందుకూ ప్రయత్నిస్తున్నారు. ఈ దుస్థితిని మతోన్మాదులు కూడా వినియోగించుకోవటానికి విశేష ప్రయత్నం చేస్తున్నారు. యువజనుల్లో అత్యధికులు, అంటే, 59 శాతంమంది మతం పట్ల విశ్వాసాన్ని కలిగివున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని తమవైపుకు వారిని ఆకర్షించేటందుకు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలను సాగనీయకుండా చూసేటందుకుగాను ప్రభుత్వమే చొరవచూపి ఉపాధి అవకాశాలను పెంచేటందుకు పూనుకోవాలి. విద్య, ఉపాధి కల్పన ద్వారా యువతను విధాన నిర్ణయాలలో భాగస్వాములగా మార్చాలి. యువతలో అనూచానంగా వస్తున్న సంస్కృతీ వారసత్వాన్నీ, కళా ప్రతిభను గుర్తించి వారికి ప్రోత్సాహమివ్వాలి. సుసంపన్నమూ, బహుళత్వమూ, లౌకికత్వంతో కూడిన మన దేశ సంస్కృతినీ, సహనాన్నీ వారికి తెలియచెప్పాలి.
తమ ప్రతిభకూ, ఆసక్తికీ అనుగుణమైన విద్యను అభ్యసించే అవకాశం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చినపుడు యువజనులే దేశానికి అమూల్యమైన ఆస్తిగా మారతారు. ఉపాధి అవకాశాలు కూడా వారికి అందుబాటులోకి రావాలి. ఏమాత్రం అవకాశాలు లభించినా మన యువతీయువకులు ఎంతటి విజయాలను సాధించగలరో ఇటీవలి కామన్‌వెల్త్‌ క్రీడలు నిరూపించాయి. ''మాకు అవకాశం లభించినట్లయితే మేము ఏంచేయగలమో'', నాకు, నా సహచరులకూ లభించిన బంగారు పతకాలే తెలియ చేస్తున్నాయంటూ డిస్కస్‌ త్రోలో బంగారు పతకాన్ని సాధించిన కిృష్ణ పూనియా చెప్పటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అనిశ్చితమైన 'అయితే' అన్నదాని స్ధానంలో, విశ్వసనీయమైన 'అవును' అన్న భావన రావాలంటే అందుకు నికరమైన పోరాటమే జరగాలి. పాలక వర్గాలు కప్పే భ్రమాత్మకమైన ముసుగును తొలగించటానికిగాను ఈ పోరాటం ఎంతైనా అవసరం.
గ్రామ్స్‌స్కీ చెప్పినట్లుగా, అణగారిన జీవుల చైతన్యం వారి పాలకుల నుంచి గ్రహించిన విలువల, తమ ఆచరణాత్మక అనుభవం నుంచి నేరుగా పుట్టుకు వచ్చిన భావనల వైరుధ్యపూరిత సమ్మిశ్రమంగా ఉంటుంది. ఈ రెండూ పరస్పర విరుద్ధంగా ఉంటూ ఘర్షణకు తావిస్తాయి. వారి ఆచరణాత్మక అనుభవానికీ, వాస్తవ పరిస్థితులకూగల కారణాలను వివరించటం ద్వారా నయా ఉదారవాద విలువలను ప్రశ్నించటంలో మనం ప్రజానీకానికి తోడ్పడాలి. వారి నిజమైన హక్కుల కోసం సాగే పోరాటాన్ని ముందుకు నడిపించాలి. యువజనుల నిజమైన సామర్ధ్యం వెలికి తీయటానికి ఇదొక్కటే సరైన మార్గం. ఆ విధంగా దేశం రాబోవు కాలంలో శిరసెత్తుకుని, చెక్కుచెదరని ఐక్యతా భావనతో ముందడుగు వేస్తుంది.

- ఆర్‌.అరుణ్‌ కుమార్‌

 

0 comments: