తీగనూ లాగరేం?

  • ఎమ్మార్‌ వ్యవహారంలో తొలగని అనుమానాలు
  • విజి'లెన్స్‌' బుట్టదాఖలేనా ?
  • మొదలు కాని ఎసిబి దర్యాప్తు
  • అదృశ్యశక్తే కారణామా ?
సంచలనం సృష్టించిన ఎమ్మార్‌ వ్యవహారంలో అసలు దోషులు తప్పించుకున్నట్లేనా? వేలకోట్ల రూపాయల అక్రమ ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో నేరస్తులెవరో వెల్లడయ్యే అవకాశం లేదా? తాజా పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. తీగలాగితే డొంక కదులుతుందంటారు. ఎమ్మార్‌ వ్యవహారంలో డొంకను కదిలించే సంగతి ఎలా ఉన్నప్పటికీ, కనీసం తీగను లాగడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వాన్ని తెరవెనుక నుండి నడిపించే 'అదృశ్యశక్తి' జోక్యమే దీనికి కారణమని సమాచారం. పెద్దల ప్రమేయం బాహాటంగానే ఉండటంతో ఈ
వ్యవహారంలో ముందడుగు వేయవద్దని ఆ అదృశ్యశక్తి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రతిపక్షపార్టీలతో పాటు మంత్రివర్గంలోని ఒకరిద్దరు మంత్రులు, కొందరు కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసినప్పటికీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే దానిని తోసిపుచ్చుతున్నారు. నిపుణులు ఇచ్చిన నివేదికలో క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొన్నప్పటికీ ఎపిఐఐసి ఆ దిశలో ఆలోచించడంలేదు. నష్టపోయిన మొత్తం రాబట్టుకోవడానికే ఎపిఐఐసి తీసుకుంటున్న చర్యలు పరిమితమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మార్‌ వ్యవహారం చుట్టూ ఎన్నో అనుమానాలు అల్లుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న గత ప్రభుత్వ పెద్దలను కాపాడటానికే రోశయ్య నేతృత్వంలోని ప్రభుత్వం సిబిఐ విచారణను దాటవేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజి'లెన్స్‌'లో ఏముందో ...?
ఎపిఐఐసి, ఎమ్మార్‌-ఎంజిఎఫ్‌ వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారుల దర్యాప్తు ఇప్పటికే పూర్తయింది. అక్రమాలకు సంబంధించిన నిర్ధారణలతో కూడిన నివేదికను విజిలెన్స్‌ అధికారులు సంబంధిత ఉన్నతాధికారులకు అందచేసినట్లు కూడా సమాచారం. అయితే, అనేక విజిలెన్స్‌ నివేదికలకు పట్టిన గతే తాజా నివేదికకు కూడా పట్టనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్‌ నివేదికపై సంబంధిత అధికారులెవ్వరూ పెదవి విప్పకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వ పెద్దలు ఆ నివేదిక విషయం తమకు తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజిలెన్స్‌ అధికారులు ఎపిఐఐసి-ఎమ్మార్‌ వ్యవహారంలోనూ, ఎమ్మార్‌, ఎంజిఎఫ్‌ వ్యవహారంలోనూ పలు అవకతవకలను ధృవీకరించారు. ఎమ్మార్‌కు భూకేటాయింపు నుండి వివిధ దశలో చోటుచేసుకున్న అవకతవకలను నిర్ధారించారు. ఉన్నతస్థాయిలో కొందరు అధికారుల పాత్ర పట్ల కూడా విజిలెన్స్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. విజిలెన్స్‌ దర్యాప్తులోనే విల్లాల అమ్మకాలకు సంబంధించి భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బినామీ పేర్లతో పలువురు ఈ విల్లాలను స్వాధీనం చేసుకున్నారని కూడా విజిలెన్స్‌ ధృవీకరించినట్లు సమాచారం.
అప్పటి మార్కెట్‌ విలువకు, ఎమ్మార్‌-ఎంజిఎఫ్‌ విక్రయించినట్లు చెబుతున్నట్లుగా రేట్లకు మధ్య ఉన్న భారీ తేడాను కూడా విజిలెన్స్‌ ఎత్తిచూపినట్లు తెలిసింది. మరింత విస్తృత అధికారాలు ఉన్న దర్యాప్తు సంస్థ చేత విచారణ ప్రక్రియను నిర్వహిస్తే ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న 'అసలు శక్తుల' పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో చొరవచూపడం లేదు. ఎమ్మార్‌ అవకతవకలకు సంబంధించి ఎపిఐఐసి అధికారుల పాత్రను నిగ్గుదేల్చాల్సిన ఎసిబి దర్యాప్తు సైతం ముందుకు కదలడం లేదు. ఈ వ్యవహారంలో విచారణకు ఎసిబికి కొద్దిరోజుల క్రితం హైకోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎసిబి అధికారులు సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. ఎసిబి దర్యాప్తు జరిగితే ఈ వ్యవహారంలో ఎపిఐఐసి అధికారుల పాత్రపై మరికొన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, రాజకీయస్థాయలో చోటుచేసుకున్న జోక్యం ఏమాత్రం వెలుగులోకి వస్తుందన్న అంశంపై అనుమానాలు నెలకొన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి?
వేల కోట్ల రూపాయల అక్రమ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తుండగా ఇతర రాష్ట్రాల్లో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నిర్మాణాల్లో నాణ్యతకు సంబంధించి ఎమ్మార్‌ సంస్థపైనే ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా ఎమ్మార్‌సంస్థ మొత్తాన్ని ఢిల్లీ ప్రభుత్వం స్థంబింపచేసింది. మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఆదర్శ్‌ హౌసింగ్‌ సొసైటీ అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ ప్రారంభించిన సంగతి తెల్సిందే. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్న ఈ హౌసింగ్‌ సొసైటీ అక్రమాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు రాజకీయనేతలకు, ఉన్నతస్థాయి అధికారులకు సంబంధం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.

 

0 comments: