'ప్రపంచ పోలీసు' పెత్తనాన్ని మానుకోవాలి

- ప్రకాశ్‌ కరత్‌
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ వారంలో భారత్‌ పర్యటనకు రానున్నారు. గతసారి అంటే 2006లో భారత్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ సందర్శించినపుడు దేశంలో పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తాయి. బుష్‌ పర్యటనకు అంతగా వ్యతిరేకత వ్యక్తం కావడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాక్‌పై జరిపిన యుద్ధం, దురాక్రమణే. ఆ పర్యటనకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత ఒబామా
అధ్యక్షుడిగా ఎన్నిక కావటం, బుష్‌ ప్రభుత్వం అంతమొందడంతో ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అమెరికన్‌ సెనేట్‌లో ఇరాక్‌ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఒబామాపై ప్రపంచ దేశాల ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. నయా కన్జర్వేటివ్‌ దురాక్రమణదారు అయిన బుష్‌ శకానికి ఇక తెరపడుతుందని ప్రపంచం ఆశగా ఎదురుచూసింది. అయితే గడచిన రెండేళ్ల ఒబామా పాలనలో ఈ ఆశలు చాలా వరకు అడియాసలయ్యాయి. పాలనలోనూ, ఒరవడిలోనూ మార్పు వచ్చినా, అమెరికా విదేశాంగ విధాన సారంలో అంతగా మార్పేమీ లేదు.

ఇరాక్‌లోని తమ సైనికులందరినీ ఉపసంహరించుకున్నానని అమెరికా ప్రకటించినప్పటికీ ఇప్పటికి ఇంకా 50 వేల మంది సైనికులు, విదేశీ కిరాయి సైనికులు అక్కడ తిష్టవేసుక్కూర్చున్నారు. ఇరాక్‌లో తన సైన్యాన్ని కొనసాగించటం వెనుక అమెరికా ఉద్దేశం ఆ దేశ చమురు వనరుల్లో ప్రధాన భాగాన్ని తన వశంలోకి తెచ్చుకోవడమే. అణు సమస్యపై ఇరాన్‌ను టార్గెట్‌ చేసే విధానాలను ఒబామా ప్రభుత్వం కొనసాగిస్తోంది. అమెరికా ఐరాస భద్రతా మండలిని పావుగా వాడుకుని నాలుగో విడత ఆంక్షలను విధించింది. పాలస్తీనా సమస్య పరిష్కారానికి చర్చల ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన ఒబామా సర్కారు ఆ పని చేయలేకపోయింది. అమెరికాలోని శక్తివంతమైన యూదు లాబీ ఒత్తిడికి తట్టుకుని అది నిలవలేకపోవడమే ఇందుకు కారణం. ఇజ్రాయిల్‌ తన ఆక్రమిత ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా కొనసాగిస్తున్న విస్తరణ పథకాలను చూసీ చూడనట్లు వదిలేస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్‌కు మరో 30 వేల మంది సైనికులను పంపిన ఒబామా ఆఫ్‌పాక్‌ వ్యూహాన్ని పునర్నిర్వచిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లను అణచివేయటంలో ఘోరంగా విఫలమైన అమెరికా నేతృత్వంలోని నాటో సేనలు అక్కడి ప్రజలను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇక క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా విధించిన అక్రమ ఆర్థిక దిగ్బంధనాన్ని ఒబామా సర్కారు ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఈ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలంటే క్యూబాలో 'ప్రజాస్వామ్యం' నెలకొనాలంటూ గత ప్రభుత్వాల ధోరణిలోనే ముందస్తు షరతులు విధిస్తూ మొండిగా వ్యవహరిస్తోంది. ఒబామా చేసిన ఒకే ఒక్క మంచిపని గత ఏడాది ప్రేగ్‌లో ప్రసంగిస్తూ సార్వత్రిక అణునిరాయుధీకరణకు పిలుపునివ్వటం. అమెరికా రష్యాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (స్టార్ట్‌-3) మేరకు ఆయన ఈ పిలుపునిచ్చారు. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలూ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను, అణు శీర్షాలను మూడో వంతుకు తగ్గించుకోనున్నాయి. అయితే ఈ ఒప్పందం ఇప్పటికీ అమెరికన్‌ సేనేట్‌ ఆమోదముద్ర కోసం ఎదురు చూస్తోంది. ఈ రెండేళ్ల పాలన తరువాత అమెరికాలో డెమొక్రాట్లు అధికారంలోకి వచ్చినా, రిపబ్లికన్లు అధికారంలోకి వచ్చినా అమెరికన్‌ పాలకవర్గాల ప్రయోజనాలకనుగణమైన అమెరికా ప్రపంచ వ్యూహం, విదేశాంగ విధాన లక్ష్యాలు ఎప్పటిమాదిరిగానే కొనసాగుతాయని ఒబామా ప్రభుత్వం రుజువుచేసింది.
అమెరికా చరిత్రలోనే నిరుద్యోగపర్వం అత్యధిక (9.6 శాతం) స్థాయికి చేరుకున్న ప్రస్తుత తరుణంలో ఒబామా భారత్‌ పర్యటనకు వస్తున్నాడు. ఈ పరిణామం ఆయనకు ప్రజల్లో వున్న ఆదరణను గణనీయంగా తగ్గించింది. ఇటీవలి కాంగ్రెస్‌, సెనేట్‌ ఎన్నికల్లో ఒబామా నేతృత్వంలోని డెమొక్రాటిక్‌ పార్టీ చవిచూసిన అపజయాలు ఈ అంశాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక ఒబామా ప్రస్తుత భారత్‌ పర్యటన కూడా తమ దేశ ఉత్పత్తులకు భారత్‌లో మార్కెటింగ్‌ చేసుకోవటానికి, వ్యవసాయ, చిల్లర వర్తక రంగాల్లో అమెరికా కంపెనీల పెట్టుబడులను అనుమతించేలా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికేనన్నది సుస్పష్టం. తమ దేశం నుండి ఔట్‌సోర్సింగ్‌ కార్యకలాపాలను ఆపేందుకు ఒబామా ప్రభుత్వం యత్నించడం, అదే సమయంలో భారత్‌ అమెరికాకు వ్యాపార రంగంలో ఇతోధిక అవకాశాలను కల్పించేందుకు ఆరాటపడుతుండడాన్ని భారతీయులంతా గమనిస్తూనే వున్నారు.
ఒబామా భారత పర్యటనపై రకరకాల వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. అమెరికాతో భారత్‌ వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోటానికి ఈ పర్యటన దోహదపడుతుందంటూ అమెరికా అనుకూల లాబీ ఊదరగొడుతోంది. అమెరికాతో రక్షణ సంబంధాలను మరింత విస్తరించుకోవాలని, కొత్త రంగాలలో అమెరికా పెట్టుబడులకు అవకాశాలు కల్పించాలని ఈ లాబీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తోంది. ఆసియాలోనే అగ్రశక్తిగా ఎదుగుతున్న చైనాకు ప్రతిగా భారత్‌ను తీర్చిదిద్దటమే అమెరికా లక్ష్యమంటూ మితవాద, కార్పొరేట్‌ మీడియాలోని ఒక సెక్షన్‌ బాకా ఊదుతోంది. గతంలో క్లింటన్‌ ప్రభుత్వంతో కలిసి వాజ్‌పేయి ప్రభుత్వం 'ప్రజాస్వామిక కూటమి' పేరుతో యుగళగీతాన్ని ఎలా వినిపించారో చూశాం.
బుష్‌ సర్కారు ఘనకార్యాలను మర్చిపోలేని వ్యక్తులు ఇప్పటికీ భారత్‌లో కొందరు వుండటం విషాదకరం. భారత్‌లో పర్యటించిన అధ్యక్షులలో జార్జ్‌బుష్‌ అత్యుత్తమమైన వ్యక్తి అని అమెరికాలోని భారత్‌ మాజీ రాయబారి రోనెన్‌సేన్‌ కొడుతున్న డబ్బా ఇందుకొక నిదర్శనం. అమెరికాతో మైత్రిని గట్టిగా కోరుకునే వ్యక్తులు బుష్‌ పాలనను తాము కోల్పోయామని ఇప్పటికీ బాధపడుతున్నారు. భారత్‌ను గొప్ప ప్రపంచ శక్తిగా, విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దుతామని పలుమార్లు హామీలు గుప్పించిన అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్‌ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోటీ పడుతున్న భారత్‌ను సమర్థ్ధించటానికి తిరస్కరించిన విషయం వీరికి గుర్తుచేయాల్సిన అవసరం వుంది.
వామపక్షాలు, ముఖ్యంగా సిపిఎంకు సంబంధించినంతవరకూ బుష్‌, ఒబామా మధ్య వున్న వ్యత్యాసాన్ని మేం గుర్తించాం. అదే సమయంలో ప్రపంచాధిపత్యానికి సంబంధించిన అమెరికా మౌలిక వైఖరిని కొనసాగించేందుకే ఒబామా సర్కారు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని కూడా మా గమనంలో ఉన్నది. అందువల్లే అమెరికా సామ్రాజ్యవాద జోక్యాన్ని భారతీయులెంతగా వ్యతిరేకిస్తున్నారో తెలియజేేసేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని వామపక్షాలు నిర్ణయించాయి. తన నయా ఉదారవాద ఆర్థిక విధానాలను భారత్‌పై రుద్దేందుకు అమెరికా పెంచుతున్న ఒత్తిళ్లు, వ్యవసాయం, చిల్లర వర్తకం, ఉన్నత విద్య వంటి కీలక రంగాలను అమెరికన్‌ బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల భారత ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత ఈ నిరసనల రూపంలో వ్యక్తమవుతుంది.
దేశంలోని లక్షలాది మంది చిరువ్యాపారుల పొట్టకొట్టే వాల్‌మార్ట్‌ వంటి కంపెనీల ప్రవేశానికి ఒబామా పర్యటన సోపానం కాకూడదు. కేంద్ర వాణిజ్యమంత్రితో పాటు యుపిఎ ప్రభుత్వంలోని ఇతర సెక్షన్లు మల్టీబ్రాండ్‌ రిటైల్‌ వాణిజ్యంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చొరబాటుకు అనుమతిస్తున్నాయి.
2005లో కుదుర్చుకున్న భారత్‌-అమెరికా రక్షణ ఫ్రేమ్‌వర్కు ఒప్పందం పరిధిలో మరిన్ని ఒప్పందాలపై భారత్‌ సంతకాలు చేయాలని అమెరికా పట్టుబడుతోంది. ఇందులో ముఖ్యమైన రెండు ఒప్పందాలు లాజిస్టిక్స్‌ సపోర్ట్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌ఎస్‌ఎ), కమ్యూనికేషన్స్‌, ఇంటర్‌ఆపరబులిటీ, సెక్యూరిటీ మెమొరాండం ఆఫ్‌ ఆగ్రిమెంట్‌ (సిఐఎస్‌ఎంఓఎ). ఇవి భారత సైనిక దళాలను పెంటగాన్‌ స్వాధీనం చేయటానికి ఉద్దేశించినవి. తమ దేశంలో తయారైన ఆయుధాలను భారత్‌తో భారీయెత్తున కొనిపించాలని ఒబామా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సైనిక రవాణాకు సంబంధించిన సి-17 తరహా విమానాల కొనుగోలుకు భారత్‌ అంగీకరించింది. మరో వెయ్యికోట్ల డాలర్ల విలువైన 126 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకునేలా భారత్‌ను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. భారత స్వతంత్ర విదేశాంగ విధానానికి, వ్యూహాత్మక సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టుగా మారే అమెరికా సైనిక జోక్యాన్ని వామపక్షాలు మొదటినుండీ వ్యతిరేకిస్తున్నాయి.
భోపాల్‌ గ్యాస్‌ బాధితులకు న్యాయం చేసే బాధ్యత తాను తీసుకుంటానని ఒబామా చెప్పగలరా. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఈ పారిశ్రామిక ప్రమాదానికి అమెరికా కంపెనీయే బాధ్యురాలు. గల్ఫ్‌ తీరంలో చమురు కాలుష్యాన్ని తొలగించేందుకు బిపి (బ్రిటిష్‌ పెట్రోలియం) కంపెనీ నుంచి వందల కోట్ల డాలర్లను రాబట్టిన ఒబామా, ఇక్కడి భోపాల్‌ ఫ్యాక్టరీ ఆవరణలో కాలుష్యాన్ని శుద్ధి చేసేందుకు అవసరమైన ఖర్చులను చెల్లించేలా డౌ కెమికల్స్‌ సంస్థపై ఎందుకు వత్తిడి తేవటం లేదు? అరబ్‌ భూభాగాలలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తిష్టవేసుక్కూర్చున్న ఇజ్రాయిల్‌కు సహాయాన్ని అందించటం వెంటనే మానుకోవాలని వామపక్షాలు అమెరికాను డిమాండ్‌ చేస్తున్నాయి. అదే విధంగా క్యూబాపై ఆర్థిక దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని, ఇరాన్‌ అణు సమస్య పరిష్కారానికి వెంటనే చర్చలు ప్రారంభించి ఆ దేశంపై విధించిన అనుచితమైన ఆంక్షలు ఎత్తివేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన పార్లమెంట్‌ ఉభయసభలనుద్దేశించి ఒబామా చేసే ప్రసంగాన్ని ఇతర అన్ని పార్టీల సభ్యులతో పాటు వామపక్ష ఎంపీలు కూడా వింటారు. అదే రోజు భారత ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, సమావేశాలు జరుగుతాయి. ఒబామా కూడా దానిని వినాలి మరి!

 

0 comments: