పెంటగాన్‌ చేతికి మన రక్షణ వ్యవస్థ

  • కీలక రహస్య పత్రాన్ని బయటపెట్టిన ఆంగ్ల టీవి ఛానెల్‌
  • ఒబామా పర్యటన ప్రారంభంలోనే వివాద ప్రకంపనలు
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారతదేశంలో అడుగు పెట్టిపెట్టక ముందే కలకలం రేగింది. భారత రక్షణ వ్యవస్థను కబళించేందుకు అమెరికా పన్నిన పన్నాగం బట్టబయలైంది. ఒక జాతీయ ఆంగ్ల ఛానెల్‌ చేతికి ఇందుకు సంబంధించిన కీలక పత్రాలు దొరికాయి. భారత రక్షణ వ్యవస్థపై అమెరికా డేగకన్ను బట్టబయలైన తీరు రక్షణ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అమెరికా రూపొందించిన ఈ డీల్‌ భారత ప్రభుత్వ ఆమోదం పొందితే మన రక్షణ వ్యవస్థ
మొత్తం పెంటగాన్‌ కబంధహస్తాల్లోకి వెళ్లిపోనుండమే దీనికి కారణం. భారత రక్షణ బలగాలపైనా, దేశ త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని రకాల సమాచార వ్యవస్థలపైనా నియంత్రణే లక్ష్యంగా అమెరికా ఈ ఒప్పందాన్ని రూపొందించింది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే భారత శాస్త్రవేత్తలు రూపొందించిన రక్షణశాఖ సమాచార వ్యవస్థకు సంబంధించిన పరికరాల వినియోగానికి కూడా అమెరికా అనుమతి పొందాల్సివస్తుంది. దీని ప్రభావం భారత రక్షణ రంగ పరిశోధనలపై తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. పదేళ్లపాటు (2020 వరకు) రహస్యంగా ఉంచాలని నిర్దేశించిన ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక భాగాలు బట్టబయలయ్యాయి. ఒబామా పర్యటనలో ఈ ఒప్పందానికి కీలకపాత్ర ఉంటుందని భావిస్తున్నారు. ఆరు క్లాజులతో రూపొందించిన ఈ ఒప్పందాన్ని 'ఇంటర్‌ ఆపరేటబిల్టీ అగ్రి మెంట్‌'గా వ్యవహరిస్తున్నారు.

ఇవీ ఆంక్షలు
భారత రక్షణశాఖకు అవసరమైన కమ్యూనికేషన్‌ పరికరాలను అమెరికా వద్దే కొను గోలు చేయాలి. వీటి ఏర్పాటుకు, రవాణాకు అయ్యే ఖర్చును భారతదేశమే భరించాలి. (ఆర్టికల్‌-5)
అమెరికా తాను కోరుకున్నప్పుడు భారత రక్షణ వ్యవస్థలో జోక్యం చేసుకోవచ్చు (ఆర్టికల్‌ - 6).
భారత అధికారులకు అవసరమైన శిక్షణ అమెరికా అధికారు లు మాత్రమే ఇవ్వాలి. (ఆర్టికల్‌-7) ఈ నిబంధన ప్రకారం సైనిక సమాచార వ్యవస్థను తనిఖీ చేసే అధికారమూ అమెరికా అధికారులకు ఉంటుంది.
అమెరికా అనుమతి లేకుండా భారత ప్రభుత్వం, సైన్యాధికారులు సొంతంగా తయారుచేసిన పరికరాలను సైతం వినియోగించ డానికి వీలులేదు. (ఆర్టికల్‌ 8)
అమెరికా నుండి కొనుగోలు చేసిన రక్షణ సమాచార పరికరాలను భారత అధికారులు సైతం తనిఖీ చేయడానికి వీలు లేదు. అమెరికా అధికారులకు మాత్రమే ఆ అధికారం ఉంది. (ఆర్టికల్‌ 9)
అమెరికా సరఫరా చేసిన పరికరాలను అనుకరించి భారతదేశం సొంతగా అభివృద్ధి చేసుకోకూడదు. ఆ తరహా ప్రయత్నాలు రెండు దేశాలు సంయుక్తంగానే చేపట్టాలి. (ఆర్టికల్‌ 9)

 

0 comments: