ఒబామా పర్యటన వాణిజ్యమే వాస్తవం
- గుడిపూడి విజయరావు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన ముగించుకొని వెళ్లిపోయాడు. అమెరికా అధినేతలు గతంలోనూ భారత్ వచ్చారు. కాని అప్పట్లో వారిలో కనిపించిన అహంకారం, ఆధిపత్య ధోరణులు ఒబామాలో బయటికి కనిపించలేదు. అమెరికా స్వభావంలో అప్పటికి, ఇప్పటికీ మార్పులేనప్పటికీ ప్రపంచంలో దాని తిరుగులేని ఆధిపత్యం కొనసాగడం లేదన్న నేటి వాస్తవానికి ఈ పర్యటన అద్దం పడుతున్నది. గత ఎనిమిది దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమెరికా, దాని నుండి బయటపడేందుకు ఇతర సంపన్న దేశాలు కాని, చైనా లాంటి దేశాలు కాని సందు ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక భారత్ లాంటి దేశాల వైపు ఎగబడుతున్నది. జి7ను విస్తరించి జి20గా చేసిందీ ఈ పని కోసమే. పర్యటన ఆద్యంతం లక్ష్యంపై కేంద్రీకరించిన కార్యసాధకుడిగా మాత్రమే ఒబామా కనిపించాడు.
ఈ క్రమంలోనే ఆయన భారత్‌పై అంతులేని పొగడ్తల వర్షం కురిపించాడు. భారత్ ఎదుగుతున్న దేశం కాదు, ఎదిగేసిన దేశం అని కితాబులిచ్చాడు.
భారత్ సహాయకునిగా కాకుండా భాగస్వామ్య పాత్రను నిర్వహించాలని పిలుపు నిచ్చాడు. అలాగే భారత్ ఆశిస్తున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ సాధనకు మద్దతు, పాకిస్తాన్‌లో టెర్రరిస్టు స్థావరాల ప్రస్తావన లాంటి అంశాలనూ ఆయన వదిలిపెట్టలేదు. ఇలా ఎన్నెన్నో ఆశలను కల్పించడం, హామీలను గుప్పించడంతో పాటు, రకరకాల భ్రమలకూ లోను చేశాడు. అణు ఇంధన సరఫరా గ్రూపులో భారత్‌కు సభ్యత్వం, అమెరికా సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేయడంలో ఆంక్షలను పాటించే ఎంటిటీ జాబితానుండి భారత్ సంస్థలను మినహాయించడం ఇలాంటివే. ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆయన తన ప్రధాన లక్ష్యాన్ని మాత్రం ఏ సమయంలోనూ వదిలి పెట్టలేదు. ఆర్థిక సంక్షోభం నుండి, తీవ్రమైన నిరుద్యోగం నుండి అమెరికాను బయటపడేసుకునేందుకు భారత్ మార్కెట్‌ను ఎలా ఉపయోగించుకోవలన్న దాని చుట్టూనే ఆయన పర్యటన సాగింది. ఈ పర్యటన అంతటా వాణిజ్యమే ప్రధాన అజెండా. ఈ పర్యటనలో వాణిజ్యం ఒక్కటే వాస్తవం. అది కూడా అమెరికా అవసరాలకు అనుగుణ్యమైనది మాత్రమే.
200 మంది కార్పొరేట్ సిఇఓలను వెంటేసుకుని వచ్చిన ఒబామా ఇక్కడి గుత్తపెట్టుబడిదారులనూ బుట్టలో వేసుకున్నాడు. ఒబామా రాకకు పూర్వం అమెరికాపై కారాలు మిరియాలు నూరిన ఐటి రంగ ప్రముఖులు సైతం ఏం మాయ చేసేవో అన్న రీతిలో పర్యటన మొదటి రోజునే వినయంగా ఆయన వెంట బడ్డారు. ఒక్క ముంబయిలోనే కాకుండా న్యూఢిల్లీలో సైతం భారత గుత్తపెట్టుబడిదారులు ఆయన కార్యక్రమాలలో ప్రముఖంగా పాల్గొన్నారు. ఇండో సిఇఓ ఫోరం సమావేశం న్యూఢిల్లీలో జరిగిన మాట వాస్తవమే అయినా అమెరికా, భారత్‌ల సంయుక్త పత్రికా గోష్టిలో సైతం మీడియా ప్రతినిధులతో పాటు భారత్, అమెరికా గుత్త పెట్టుబడిదారుల ప్రతినిధులూ ముందు వరుసలో ఆశీనులయి ఆశ్చర్య పరిచారు. ఇదంతా ఒబామా పర్యటనలో వాణిజ్య అంశాల ప్రాధాన్యతను తెలియచేయడంతో పాటు, వాటికి సంబంధించిన ప్రకటనకు మరింత బలం చేకూర్చడానికేనని పరిశీలకులు వ్యాఖ్యానించారు.
తాను భారత్ చేరుకోవడానికి కొద్ది సమయం ముందే 1000 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని వాటి ఫలితంగా అమెరికాలో 50,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని ముంబయిలో అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ నుద్దేశించి చేసిన ప్రసంగంలో ఒబామా ప్రకటించాడు. బోయింగ్ సంస్థ నుండి 33 737తరహా విమానాల కొనుగోలుకు స్పైస్‌జెట్‌తో ఒప్పందం కుదిరిందని, భారత్ సైన్యానికి అవసరమైన విమాన ఇంజన్లను జనరల్ ఎలక్ట్రిక్ సంస్థనుండి కొనుగోలు చేసేందుకు, 10 సి17 తరహా విమానాలను భారత వైమానిక దళం కొనుగోలుచేసేందుకు ప్రాథóమిక ఒడంబడిక కుదరిందని తెలిపారు. రిలయన్స్ పవర్ 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను జనరల్ ఎలక్ట్రిక్ నుండి కొనుగోలు చేసేందుకు అంగీకారం కుదిరిందని అనిల్ అంబానీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ ఈ ఒప్పందాలు భారత అమెరికాల మధ్య పెరగాల్సిన ఆర్థిక అనుబంధంలో సముద్రంలో నీటి బొట్టు లాంటివి మాత్రమేనని, భారత్‌లో తన పెట్టుబడులను ఎంతైనా పెంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రసంగానికి ముందే ఎంపిక చేసిన 15 మంది భారత పెట్టుబడిదారులతో ఒబామా భేటీ అయ్యారు.
భారత కార్పొరేట్ రంగ ప్రతినిధులు మొదటి రోజునే వ్యక్తం చేసిన అభిప్రాయాలు, చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, వారికి కావలసింది వారికి దొరికిందని అర్థమవుతుంది. ఒబామాను కలవడానికి కొద్ది గంటలకు ముందు సైతం ద్రవ్యరంగ సంస్కరణల్లో అమెరికాకు భారత్ పాఠాలు నేర్పాలని చెప్పిన హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్ దీపక్ పారేఖ్ సమావేశం నుండి బయటకు వచ్చిన తర్వాత 'ఒబామా వైఖరిలో చిత్తశుద్ధి కనిపిస్తున్నది.' అని వ్యాఖ్యానించారు. ఇండో సిఇఓ ఫోరంకు సహనేతృత్వం వహిస్తున్న టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా, 'భారత అమెరికా వాణిజ్యం పట్ల ఒబామా నిబద్ధత ప్రోత్సాహకరంగా ఉంది.' అని పేర్కొన్నారు. రిలయన్స్ పవర్ అధినేత అనిల్ అంబానీ, 'ఇది భారత్- అమెరికాల మధ్య ఇంధనరంగ సహకారంలో ఓ నిర్ణాయక ఘట్టం.' అని చెప్పారు. రిలయన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ, 'భారత అమెరికాల మధ్య ఆర్థిక సహకారానికి రోడ్ మ్యాప్‌ను ఒబామా ఆవిష్కరించారు. భారత్, అమెరికాలు ఉద్యోగకల్పనలో సమిష్టిగా కృషిచేయాల్సి ఉంది.' అని పేర్కొన్నారు. భారతి ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ మిట్టల్, 'సహజీవనం కొనసాగాలని ఆయన స్పష్టంగా చెప్పారు.' అని అంటూ, రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐని అనుమతించాలని ఒబామా పరోక్షంగా చెప్పడం వాల్‌మార్ట్‌తో భాగస్వామిగా ఉన్న తమకు ప్రత్యేకించి సంతోషం కలిగిస్తుంది అని అన్నారు. ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్న ఒబామా ఇక్కడ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలని చెప్పడం సందర్భానికి తగిన విధంగా ఉందని ఐటి రంగానికి చెందిన ఆనంద్ మహీంద్ర చెప్పారు. నాస్కాం సోం మిట్టల్ అయితే భారత ఐటి రంగం గురించి ఉన్న అపోహలను తొలగించడానికి ఒబామా పర్యటన దోహదపడుతుందని, భారత్ కేవలం కాల్‌సెంటర్ వ్యాపారంపైనే ఆధారపడి లేదని, స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన ఆవశ్యకతను కూడ ఒబామా గుర్తుచేశారని అన్నారు.
కొద్ది కాలం క్రితం, బెంగుళూరులోని, షాంఘౖౖెలోని విద్యార్థ్ధులతో దీటుగా మేధస్సును పెంచుకోవాలని, లేదంటే మీ ఉద్యోగాలు వారు కొట్టేస్తారని అమెరికా విద్యార్థులకు ఒబామా చెప్పిన దానికి, భారత్‌లో ఆయన మాట్లాడిన తీరుకు తేడా కనిపిస్తూనే ఉంది. అయితే ఈ తేడా ఇతర అంశాలలో వారు పొందిన ప్రయోజనాల ఫలితంగా వచ్చిందే. భారత అమెరికాల మధ్య వాణిజ్యం ప్రస్తుతమున్న స్థాయినుండి రాబోయే ఐదేళ్లలో రెట్టింపుకు చేరాలని ఆయన పలుమార్లు ఉద్ఘాటించడం దీన్నే సూచిస్తుంది. కాని అమెరికా అధ్యక్షుని మాటలను యథాతథంగా తీసుకొని అత్యుత్సాహం ప్రదర్శించిన భారత వాణిజ్య శాఖామంత్రి ఆనంద శర్మ దూకుడుకు అమెరికా వాణిజ్య మంత్రి గ్యారీ లాక్ వెనువెంటనే బ్రేకులేశారు. 'అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతదేశ పర్యటన విజయవంతమైన నేపథ్యంలో ఆ దేశంతో ఓ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం సంప్రతింపులను ప్రారంభించాలి.' అని ఆనంద శర్మ భారత కార్పొరేట్‌రంగ ప్రతినిధులతో గ్యారీ లాక్‌తో కలిసి పాల్గొన్న ఓ సమావేశంలో చెప్పారు. ఆసియాన్ తరహాలోను, కొరియాతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగాను ఇది ఉండాలన్న తన ఉద్దేశాన్ని కూడ ఆయన వెల్లడించారు. లాక్ మాత్రం అలాంటి సమగ్ర ఒప్పందం పట్ల అమెరికా హడావిడి పడటం లేదన్న విషయాన్ని తన మాటల ద్వారా పరోక్షంగా వ్యక్తం చేశారు. 'ప్రతిదీ దశల వారీగా జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దీనిపై వాణిజ్య వర్గాలు దృష్టి సారించాయి. మరొక సమయంలో ఇంకో అడుగు వేస్తాం.' అని అన్నారు. అంతే కాదు, 'భారత దేశంలో ఎఫ్‌డిఐ నిబంధనలు సంక్లిష్టంగా, పారదర్శక రహితంగా, వాణిజ్యానికి అవరోధం కలిగించేవిగా ఉన్నాయి. రిటైల్ రంగంలో ప్రత్యేకించి మల్టీబ్రాండ్ రంగాలలో ప్రవేశాన్ని అనుమతించాలి. భారత దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నది. అందుచేత కొన్ని నిర్దిష్ట రంగాలలో ప్రవేశాన్ని సరళీకరించడం గురించి ఆలోచించాలి. లేదంటే అభివృద్ధి నిలిచిపోతుంది.'
అని కూడ హెచ్చరించారు. భారత దేశపు ఎగుమతులనూ పెంచుతాం కాని, నికరంగా అమెరికాలో ఉద్యోగాలు లభించినపుడు మాత్రమే మేం అక్కడ అంగీకరింపచేయకలుగుతాం అని కూడ లాక్ నిర్మొహమాటంగా చెప్పారు. ఇలాంటి జాగ్రత్త అనేక అంశాలలో స్పష్టంగా వ్యక్తమయింది. ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదలాయించడంపై ఆంక్షలున్న ఎంటిటీ జాబితా నుంచి భారత సంస్థలను మినహాయిస్తున్నామని చెప్పినప్పటికీ, అలా తొలగించింది కేవలం కొన్నింటిని మాత్రమే. భారత డైనామిక్స్, డిఆర్‌డిఓకు చెందిన నాలుగు అనుబంధ సంస్థలు, ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్‌కు చెందిన నాలుగు అనుబంధ సంస్థలు మాత్రమే. అణు ఇంధన విభాగానికి సంబంధించిన సంస్థలను మాత్రం ఈ జాబితా నుండి తొలగించలేదు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదిరినప్పటికీ అణు విద్యుత్ రంగంలో మాత్రం ఒప్పందాలు ఇప్పుడు జరగలేదు. భారత పార్లమెంటులో ఇటీవల ఆమోదించిన అణుపరిహార బిల్లు అమెరికా కార్పొరేట్ వర్గాలకు అంగీకారం కాలేదు కాబట్టి, ఆ విషయంలో అమెరికా తన బ్లాక్‌మెయిలింగ్‌ను కొనసాగిస్తున్నదనడానికి ఇది నిదర్శనం. ఔట్ సోర్సింగ్ విషయంలోను అమెరికా స్పష్టంగా ఏమీ చెప్పలేదు. మీరు కాల్ సెంటర్లు ఒక్కటే కాదు ఇతర పనులూ బ్రహ్మాండంగా చేయగలరు అని చెప్పడం ద్వారా, ఔట్ సోర్సింగ్ భారత్‌కు రాకుండా నిరోధించబోనని మాత్రం ఒబామా హామీ ఇవ్వలేదు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment