మానవీయుడే

 -శాంతిశ్రీ
మావో అంగరక్షకుడు లీ చెప్పిన విషయాల్ని అతను చెపుతున్నట్లుగానే రచయిత క్వాన్‌యాంచి చేసిన ప్రయోగం ావీaశీ ్గవసశీఅస్త్ర వీaఅ, చీశ్‌ీ +శీస్ణ పుస్తకానికి జీవం పోసినట్లైంది. దీన్ని తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో, దృశ్యాలు చెదరకుండా మనకందించిన అనువాదకులు కె.సత్యరంజన్‌ అభినందనీయులు. మావో గురించిన సత్యాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారందరికీ ఈ పుస్తకం సంతృప్తిని కలిగిస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల
గురించిన కొన్ని విషయాలే బయటకు వెల్లడవుతాయి. అవీ వారి జీవితంలో ఒక పార్శ్వాన్ని మాత్రమే తెలియచేస్తాయి. అలాగే కొందరు తమ గురించి బయటకు తెలపడానికి ఇష్టపడరు. కానీ మహనీయులు తమ తదనంతరమైనా తమ గురించిన పూర్తి వివరాలు వెల్లడించడం వల్ల ముందుతరాలకు ఉపయోగమే కానీ, నష్టమేమాత్రం ఉండదు. ఈ రోజు మావో గురించిన విషయాలు తెలుసుకుంటున్నామంటే ఆయన ముందుచూపే కారణమనిపిస్తోంది. తన అంగరక్షకునితో ఆయన చెప్పిన మాటలు దాన్నే వెల్లడిస్తున్నాయి. 'నా కుటుంబంలో జరిగిన విషయాలు ఇతరులకు రహస్యాలు. కానీ నీకు కాదు. నేను చనిపోయేవరకూ నా గురించి ఏమీ రాయవద్దు. ఆ తర్వాత రాయదలుచుకుంటే వాస్తవాలనే రాయి' అని మావో తన అంగరక్షకుడు 'లీ'కి చెప్పిన మాటలు ఆయన ముందుచూపును వెల్లడిస్తున్నాయి. అందులోనూ వాస్తవాలను రాయమని నొక్కి చెప్పటం ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ప్రచురించిన ఫొటోలూ బాగున్నాయి. ఇక పుస్తకంలోకి వెళితే రచయిత దీన్ని 20 అంశాలుగా విభజించి రచించారు. ప్రతి ఒక్కటీ మావోని ప్రతిబింబించాయి అంటే అతిశయోక్తి కాదు.

మొదటి అంశమైన 'నేను మావో అంగరక్షకుడిని ఎలా అయ్యాను?' లో 'మావో ఒక మాట అన్నాడంటే అది జరిగి తీరాల్సిందే. అంత తేలిగ్గా తను అన్న మాట నుండి వెనక్కి తగ్గడు. ఓ పట్టాన మనస్సు మార్చుకోడు' అన్న లీ మాటలు.. తన నియామకంలో మావో వ్యవహరించిన తీరుని, అతని ఖచ్ఛితత్వాన్ని తెలియజేస్తుంది. 'ఎవరెంత నిష్టగా ప్రార్థన చేసినా ప్రజల కష్టాలూ కడగండ్లూ మత విశ్వాసాలతో తీరేవి కావు' అని లీకి మావో చెప్పిన సమాధానం మతం పట్ల ఆయన వైఖరిని స్పష్టం చేస్తుంది. 'ఇక్కడ నువ్వొక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ నౌకర్లూ చాకర్లూ కారు. మనమంతా ప్రజలకు సేవకులం, విప్లవానికి సేవకులం. నువ్వు నాకు సాయంగా ఉండడం కూడా ఇందులో భాగమే' అని లీతో మావో చెప్పిన మాటలు విప్లవపార్టీల్లో పనిచేసేవారికీ పార్లమెంటరీ భ్రమలు ఉండకూడదని చెప్పడమే. 'ఇంకేం చెప్పొద్దు. నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను. నువ్వు వెళ్లిపోవచ్చు' అని లీతో చేసుకున్న ఒడంబడికపై మావో సమాధానం అతని నిబద్ధతను తెలియజేస్తుంది. 'అతి సామాన్యంగా కనిపించే ఆయనలో నిబిడీకృతమై ఉన్న అపారమైన మేధస్సు, గొప్ప మానసిక స్థైర్యం, చరిత్రను నిర్మించగల సత్తాను గ్రహించాను. ప్రజల హృదయాలను కొల్లగొట్టాడు మావో. మావో వ్యక్తిత్వం నన్ను కట్టిపడేసింది. జీవితాంతం మావో దగ్గరే పని చెయ్యాలనే నిర్ణయానికి వచ్చా. ఆ ప్రకారమే ఇష్టపూర్వకంగా మావో దగ్గర పనిచేస్తా' అన్న లీ మాటలు ఓ కార్యకర్తను అంకితభావంతో పనిచేయించేలా సంకల్పాన్ని రగిలించగలిగే మావో నాయకత్వ పటిమను మన కళ్ల ముందుంచుతుంది.
ఇంకా ఈ పుస్తకంలో మావో గురించి లీ చెప్పిన మరికొన్ని వాస్తవాలు.. ఆయన మాటల్లోనే.. ''మావో తన బిడ్డల పట్ల ఎంత ప్రేమ చూపేవారో అంతే కఠినంగానూ ఉండేవారు. అది ఆయన ఆదర్శాన్ని వెల్లడిస్తుంది. ఆయన నిరంతర అధ్యయనశీలి, ఆయనకు పుస్తకాలంటే అపారప్రేమ. మావోకు మిరియాలన్నా, పందిమాంసం అన్నా ఎంతో ఇష్టం. తనపై వచ్చిన విష ప్రచారాన్ని చేతల్లో తిప్పి కొట్టిన ధీశాలి.. నిరాడంబరుడు. 'నీలో ఇంకా బూర్జువా దర్పం పోలేదు' అని భార్య గురించి మావో చేసిన వ్యాఖ్యలు ఆయన వర్గదృష్టిని తెలుపుతుంది. 'నాకన్నా అధార్టీగా రాసిన వాళ్ళ పుస్తకాలు ఉన్నాయి అవి చదవండి. వాటిల్లో మార్క్స్‌-లెనిన్‌ రాసిన పుస్తకాలు ప్రత్యేకంగా చదవండి' అంటూ మావో భవితకు మార్గనిర్దేశం చేసేవాడు. తైవాన్‌ను చైనాలో కలపలేకపోయానని మావో బాధపడేవాడు. అది తన తీరని కలని అంటుండేవాడు..''
ఇలా మావో గురించిన ఎన్నో సత్యాలు తెలుసుకోవాలంటే.. ఈ పుస్తకం చదివి తీరాల్సిందే.

 

0 comments: