‘‘మైక్రో దారుణాలు’’ - 07
మైక్రో ఫైనాన్స్ విస్తరణ-తీరు
-కెఎల్‌పి
భారతదేశంలో మైక్రో ఫైనాన్స్ విస్తరించిన తీరు1991 సరళీకరణ విధానాల అమలుతో జాతీయ బ్యాంకుల ప్రాధాన్యత కుంచించబడింది. సామాజిక రంగానికి ప్రాధాన్యత తగ్గి, లాభాల రేటు ప్రాధాన్యత పెరిగింది. నరసింహన్ కమిటి సిఫార్సులు, బేసెల్ కమిటి ప్రమాణాలతో వ్యవసాయరంగానికి ఇచ్చే ప్రాధాన్యతా రుణాలు నిరర్ధక ఆస్తులు(పారు బాకీలు)గా భావించబడి వాటి మంజూరు
తగ్గుముఖం పట్టింది. గ్రామీణ ప్రజానీకం ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. 1993, 1999 జాతీయ శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 72% కుటుంబాలు ప్రభుత్వేతర వనరుల దగ్గర రుణాలు పొంది వున్నారు. వీరిలో 22% వడ్డీ వ్యాపారుల దగ్గర, 21% పాన్ బ్రోకర్ల దగ్గర అధిక వడ్డీకి రుణాలు పొందారు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయసంస్థల ప్రేరణతో స్వయం సహాయక బృందాల ద్వారా సూక్ష్మ రుణ ప్రక్రియకు భారత ప్రభుత్వ అంగీకరించింది.
సూక్ష్మ రుణ ప్రక్రియ కోసం 15-20 మంది మహిళలు ఉండే బృందాలు ఏర్పడ్డాయి. ఈ బృందాలు కొన్ని చోట్ల ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలోను, కొన్ని చోట్ల రాజకీయ పార్టీల కార్యకర్తల నాయకత్వంలోను ఏర్పాటయ్యాయి. ఒక స్థాయి వరకు పొదుపు చేసిన తరువాత బ్యాంకులతో అనుసంధానం చేసి, రుణాలను ఇప్పిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ రుణాలు అందిస్తామని చెప్పడంతో ఈ బృందాలు అనేక ఆశలు పెంచుకున్నాయి. దేశంలో 60లక్షల బృందాలు ఏర్పడి, రూ. 54.47కోట్ల డిపాజిట్లను ప్రోగుచేశాయి.
కానీ, బ్యాంకులు ఈ బృందాలకు రుణాలివ్వటానికి విముఖంగా ఉన్నాయి. ఆ దశలో సంయుక్త బాధ్యత (జాయింట్ లయబులిటి) బృందాలతో మైక్రో ఫైనాన్స్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. సూక్ష్మ రుణ విధానంలో మహిళలు ప్రధాన భూమికను వహిస్తూ రుణాల్ని తిరిగి చెల్లించడంలో విధేయంగా ఉండటం, మహిళలు కావటం వలన వాళ్ళపై వత్తిడిని పెంచి సులువుగా రుణ వసూళ్ళు చేసుకొనే అవకాశం ఉండటంతో రుణ రికవరీ 90%నికి మించింది. ఈ శాతం సంప్రదాయ బ్యాంకుల రుణ రికవరీ కంటే అత్యధికంగా ఉంది. ఈ పరిణామంతో ఆకర్షించబడి నాబార్డ్, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ప్రాధాన్యతా రుణాలను మైక్రో ఫైనాన్స్ నిర్వహించే బ్యాంకేతర ఫైనాన్స్ సంస్థలకు (ఎన్‌బిఎఫ్‌సి) అందించటానికి అంగీకరించి మార్గదర్శకాలను రూపొందించాయి.
ప్రాధాన్యతా రుణాలు పొందే వెసులుబాటు ఉండటంతో అనేక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు మైక్రో ఫైనాన్స్ రంగంలో ప్రవేశించి ఆ వ్యాపారంలో 80% హస్తగతం చేసుకున్నాయి. ఈ సంస్థల అధీనంలోని జాయింట్ లయబిలిటి గ్రూపులకు బ్యాంకు రుణాలివ్వడంతో, స్వయం సహాయక బృందాలు ఈ సంస్థలకు బదిలీ అయ్యాయి. భారతదేశంలోని మైక్రో ఫైనాన్స్ రంగంలో రెండు విభిన్న లక్ష్యాలు గల సూక్ష్మ రుణ సంస్థలు వెలిశాయి. పేదల సాధికారికత, శిక్షణ, ఆరోగ్యరక్షణ లాంటి మౌళిక సామాజిక చర్యలతో మహిళలు, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కొన్నింటి లక్ష్యమైంది. పేదల అభ్యున్నతిపేర లాభాలు దండుకోవడం మిగిలినవాటి లక్ష్యంగా ఉంది. భారతదేశంలో రెండవ లక్ష్యంగల సంస్థలు పై చేయి సాధించి, మైక్రో ఫైనాన్స్ రంగంపై ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్
మన దేశంలో ఎనిమిది వందల మైక్రో ఫైనాన్స్ సంస్థలున్నాయి. అందులో 70% ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో వీటి విస్తరణ మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక బృందాలు డ్వాక్రా గ్రూపులుగా చెలామణి అవుతున్నాయి. 1994లో 10 వేల గ్రూపులుగా ఉన్న డ్వాక్రా గ్రూపులు 2001 నాటికి 3 లక్షల 50 వేలకు పెరిగాయి. కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫండ్ కింద 2000 సంవత్సరం నాటికి ఈ స్వయం సహాయక బృందాలు ప్రపంచ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ఇచ్చే రుణానికి అర్హతను సాధించాయి. రోజుకు రూ.1/- పొదుపును సాధించాల్సిన ఈ గ్రూపులకు 9-12% వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వవలసి వుంది. ఇంత హడావుడిగా ఏర్పాటుచేసిన డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన రుణాలు మొత్తం బ్యాంకుల రుణాలలో 0.6% నికి కూడా మించలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల స్వయం సహాయక గ్రూపులు బ్యాంకింగేతర పైనాన్స్ సంస్థల వైపుకు రుణాలకోసం మళ్ళాయి.
మైక్రో ఫైనాన్స్ సంస్థలు విపరీతమైన వడ్డీ రేట్లతో రుణ కార్యక్రమాన్ని మొదలెట్టాయి. ఒక అంచనా ప్రకారం 2008-2009 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల మైక్రో ఫైనాన్స్ రుణ గ్రహీతలు (స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటి బృందాలు కలుపుకొని) రూ.12,300 కోట్ల రుణం కలిగివున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి 60 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే 125% కుటుంబాలకు మైక్రో ఫైనాన్స్ రుణం కల్గివుందని భావించాలి. ఈ రుణాలు పొందేది ఎక్కువగా పేదలే. మన రాష్ట్రంలో మొత్తం కుటుంబాల్లో 40శాతం పేద కుటుంబాలున్నాయని ఒక అంచనా. ఈ లెక్కన మైక్రో ఫైనాన్స్ కింద ఒక్కో పేద కుటుంబానికి ఎనిమిదేసి సార్లు రుణం అందించబడింది. దీంతో వీరి సగటు కుటుంబపు రుణం రూ.49,000లుగా ఉంది. దేశవ్యాప్తంగా మైక్రోఫైనాన్స్ సంస్థలు అందించిన సగటు కుటుంబ రుణానికి ఇది ఎనిమిదిరెట్లు కాగా, స్వయం సహాయక గ్రూపులు పొందిన సగటు కుటుంబ రుణం కంటే 11రెట్లు ఎక్కువ.
పై గణాంకాలు ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్ సంస్థల కేంద్రీకరణను తెలియజేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి బహుళ సంఖ్యలో రుణాలు మంజూరు చేసినట్లు తేలుతుంది. మైక్రో ఫైనాన్స్ సంస్థల మధ్య రుణాలివ్వడంలో పోటీ ఎక్కువైనప్పటికీ, అధిక వడ్డీరేట్ల విషయంలో ఇవన్నీ సిండికేట్‌గానే వ్యవహరిస్తున్నాయి. దీంతో పేదలకు ప్రయోజనాలు కలుగక పోగా అనర్ధాలు ఎక్కువయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ అనుభవాలు - నేర్పుతున్న పాఠాలు
1) సూక్ష్మ ఫైనాన్స్ రూపకర్త, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ సూత్రీకరించినట్లు స్వేచ్ఛా మార్కెట్ విధానాలపై నిర్మితమైన సూక్ష్మరుణ విధానం పేదల పేదరిక నిర్మూలనకు దోహదపడక పోగా, పెనం నుండి పొయ్యిలో పడ్డట్లు పేదలను నిరుపేదలుగాను, బానిసలుగానూ మారుస్తున్నాయి.
2) పేదరిక నిర్మూలనలో సూక్ష్మరుణ విధానం ఒక సహయకారి మాత్రమే కాని పేదరిక నిర్మూలనకు దివ్య ఔషదం కాదు అందువల్ల మైక్రో ఫైనాన్స్ విధానానికి విశేష ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదు.
3) సరళీకరణ విధానాలతో విద్య, ఆరోగ్యం, నివాసం వంటి సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఉపాధి, ఉద్యోగభద్రత కరువైంది. ఆర్థిక, సామాజిక అంతరాలూ పెరిగాయి. వీటన్నింటి వల్ల జీవన వ్యయం పెరిగింది. అందుకే పేదలు సూక్ష్మ రుణాలను వస్తూత్పత్తికి ఉపయోగించకుండా నిత్యావసర జీవనానికి, అప్పటికే ఉన్న అప్పులు తీర్చడానికి వాడుతున్నారు. దీంతో అప్పుల భారం తడిసిమోపడైపోయింది. పేదల జీవన స్థితిగతుల్ని మెరుగుపర్చకుండా, కేవలం సూక్షరుణాలతోనే సరిపడితే వీరి బతుకులు బాగుపడవు.
4) వ్యవస్థలో వేతనంతో కూడిన ఏ ఉపాధీ దొరకని స్థితిలో, ఆఖరి చర్యగా పేదలు స్వయం ఉపాధిని ఎంచుకుంటారు. కొన్ని వస్తువులు ఉత్పత్తిచేస్తున్నారు. మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రపంచీకరణ విధానాల వల్ల మార్కెట్లో బహుళజాతి ఉత్పత్తులు వెల్లువగా వస్తున్నాయి. వాటికి ప్రచార బలమూ మెండుగా ఉంది. బడా కార్పొరేట్ మాళ్లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఈ పోటీలో నిలదొక్కుకోవాలంటే ప్రభుత్వం స్వయం ఉపాధి ఉత్పత్తులకు రక్షణ కల్పించాలి. కానీ అలా చేయకపోవడంతో స్వయం సహాయక బృందాల జీవనం అస్తవ్యస్తమయ్యింది.
5) అధిక వడ్డీరేట్లకు, కిరాతక చర్యలకు ప్రపంచ బ్యాంకు షరతులే మైక్రో ఫైనాన్స్ సంస్థలకు అండగా నిలుస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు సైతం తన మార్గదర్శక సూత్రాలలో వడ్డీ రేటు నిర్ణయం మైక్రో ఫైనాన్స్ సంస్థలదేనన్నది. ఈ షరతులకు తలగ్గే ప్రభుత్వాలు ఉన్నంత కాలం పేదలపాలిట మైక్రో ఫైనాన్స్ సంస్థలు విషపు గుళికలే.
6) లాభాపేక్ష ధ్యేయంగా ఉండే పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ వ్యాప్తంగా లాభాలు దొరకనప్పుడు లాభాల కోసం పేదల రక్తాన్ని పీల్చటానికి వెనుకాడవన్న వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. పేదరిక నిర్మూలనలో కార్పోరేట్ల భాగస్వామ్యం పనికిరాదని దీంతో రుజువైంది.
7) స్వేచ్ఛా మార్కెట్ విధానాలలో పోటి వినియోగదారుడికి మేలుచేస్తుందని ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్ సంస్థల పోటి నిర్వహణ ఖర్చుల్ని తగ్గించక పోగా తీవ్రంగా పెంచింది.
8) ఆంధ్రప్రదేశ్‌లో మరణించిన పేదలలో 17 మంది యస్.కె.యస్. మైక్రో ఫైనాన్స్ నుంచి అప్పులు తీసుకున్నవారే. ఈ సంస్థ ఇటీవలనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపిఓ) ఉపక్రమించింది. పబ్లిక్ ఆఫర్ కు వెళ్ళబోయేముందు తన వాటాలలో గణనీయమైన భాగాన్ని హెడ్జ్ ఫండ్స్ అమ్ముకున్నట్లు, దాని ద్వారా 12 రెట్ల లాభాన్ని పొందినట్లు వార్తలు వస్తున్నాయి. పేదల జీవితాలతో ముడిపడ్డ మైక్రో ఫైనాన్స్ రంగంలో హెడ్జ్ ఫండ్ల ప్రవేశం ప్రమాదకరమైంది.
9) వడ్డీరేటును నియంత్రించకుండా మైక్రో ఫైనాన్స్ సంస్థల పూర్తి నియంత్రణ సందేహాస్పదమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ఎందుకూ కొరగాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.
వడ్డీలెక్కల భాగోతం
ఇటీవల ఎస్‌కెఎస్ మైక్రోఫైనాన్స్ సంస్థ తాను కేవలం 20 నుంచి 25 శాతం మధ్యలోనే వడ్డీని వసూలు చేస్తున్నానని ప్రకటించింది. రుణం ఇచ్చిన తరువాత సంస్థకు 50 వారాల్లోపు కట్టాలి. తొలుత ఒక వాయిదాను మినహాయిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని 50వారాలకు సర్దుబాటు చేసి కిస్తీలను నిర్ణయిస్తున్నారు. అసలు తగ్గుతుంటే వడ్డీ తగ్గుతుండాలి. కానీ ఈ వాయిదాల్లో అసలు తగ్గుతున్నప్పటికీ, వడ్డీ మాత్రం మొత్తంపైనే కట్టాల్సి ఉంటుంది. దీనినే ఫ్లాట్ వడ్డీరేటు అంటాం. దీనివల్ల వాస్తవంగా వసూలు అయిన వడ్డీ 50శాతానికి లేదా అసలును కూడా మించిపోతుంది. ఎస్‌కెఎస్ తరహా మైక్రో సంస్థలు ఈ విషయాన్ని మరుగుపరిచి తాము ముందు నిర్ణయించిన వడ్డీరేటు గురించే ప్రచారం చేస్తుంటాయి. ఇక్కడ ఫ్లాట్ రేటుతో లాభాలు దండుకుంటున్న ఈ తరహా సంస్థలు, నాబార్డు, సిడ్బీ వద్ద నుంచి ప్రాధాన్యతా రుణాలకిచ్చే 9శాతం వడ్డీరేటుతోనే పెట్టుబడి రుణాలను తీసుకుంటున్నాయి. ఎన్‌బిఎఫ్‌సిలకు 2012 తరువాత ప్రాధాన్యతారుణాల కింద రుణాలు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇవి ఆందోళన చేసి తమకు అనుకూలంగా నిర్ణయాన్ని తెప్పించుకున్నాయి.
ప్రభుత్వ జోక్యానికి బ్రేకులేసిన ప్రపంచబ్యాంకు
ప్రపంచబ్యాంకు ఏర్పాటు చేసిన సి.జి.ఏ.పి వివిధ దేశాలలో మైక్రో పైనాన్స్ అమలుకు కొన్ని మార్గదర్శకాల్ని రూపొందించింది. అవి 1) వడ్డీరేట్లపై పరిమితుల్ని విధించే రుణ వ్యాపార చట్టాల్ని రద్దు చేయాలి. వడ్డీ రేట్లపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు. 2) పేదలకిచ్చే అన్ని రకాల సబ్సిడీలు రద్దు చేయాలి.3) సూక్ష్మ రుణ సంస్థలను ప్రయివేటీకరించాలి. 4) కఠినమైన రుణ వసూళ్ళ చర్యలు, చట్టాలు రూపొందించాలి. వాస్తవానికి వీటిని మార్గదర్శకాలు అనడం కంటే షరతులు అని పేర్కొనాలి. ఫైనాన్స్‌పెట్టుబడి ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక రంగంలో ప్రభుత్వ జోక్యాన్ని నివారించేందుకు, నయా ఉదారవాద విధానాలకు ఢోకా లేకుండా ఉండేందుకు ప్రపంచబ్యాంకు ఈ షరతులను విధించింది. నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న ఏ దేశమైనా వీటిని అమలు చేయాల్సిందే. భారతదేశంలో గ్రామీణ మహిళా అభివృద్ధి, సాధికారిక ప్రాజక్ట్ క్రింద ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రుణం ఈ నిబంధనలకు లోబడి వుంది. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment