అటు ఒబామా ప్రసంగం...ఇటు నిరసనల హోరు

  • వెలువెత్తిన సామ్రాజ్యావాద వ్యతిరేకత
పార్లమెంటులో సోమవారం ఒక వైపు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రసంగిస్తుండగానే, మరోపక్క వామపక్షాల పిలుపు మేరకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లక్షలాది మంది దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కోల్‌కతా నడిబొడ్డున ఉన్న లెనిన్‌ విగ్రహం నుంచి యుఎస్‌ఐఎస్‌ కూడలి వరకు భారీ ప్రదర్శన జరిగింది.
అంతకు ముందు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపు మేరకు విద్యార్థి కార్యకర్తలు నగరంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యుఎస్‌ఐఎస్‌ కూడలిలో సిపిఎం నాయకులు మనబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తూ అమెరికాకు మొదటి ఆఫ్రో-అమెరికన్‌ అధ్యక్షుడిగా ఒబామా ఎన్నికైనప్పటికీ అక్కడి ప్రభుత్వ పర్యావరణ రాజకీయాలను మార్చలేకపోయారని అన్నారు. ప్రస్తుతం అమెరికా వ్యాపార ప్రయోజనాల్లో పర్యావరణం ప్రాధాన్యాతాంశంగా మారిందన్నారు. తాము వారన్‌ అండర్సన్‌ను కోరుకుంటున్నామని, మొత్తం వైట్‌హౌస్‌ భారత్‌కు రానక్కరలేదని అన్నారు. కోల్‌కతా జిల్లా లెఫ్ట్‌ఫ్రంట్‌ కన్వీనర్‌ దిలీప్‌ సేన్‌, సిపిఎం నాయకులు రాబన్‌ దేవ్‌, సిపిఐ కోల్‌కతా జిల్లా కార్యదర్శి ప్రబీర్‌ దేవ్‌ తదితరలు పాల్గొన్నారు.

త్రిపురలో....
ఒబామా పర్యటనకు, సామ్రాజ్యవాదానికి నిరసనగా త్రిపురలో నాలుగు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, సమావేశాలు జరిగాయి. అగర్తలలో జరిగిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గౌతం దాస్‌ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకునేందుకే భారత్‌ వచ్చారని విమర్శించారు. కమలాపూర్‌లో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బిజన్‌ ధర్‌ మాట్లాడారు.

 

0 comments: