అక్టోబర్‌ మహావిప్లవం-ప్రస్తుతదశలో దాని విశిష్టత

- వి.శ్రీనివాసరావు
  • నేడు 93వ అక్టోబర్‌ మహా విప్లవ వార్షికోత్సవం
సోవియట్‌యూనియన్‌ కూలిపోయినా అక్టోబర్‌ విప్లవం విఫలం కాలేదు. దాని స్పూర్తితో రాజ్యాధికారంలోకి వచ్చిన చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తరకొరియా, లావోస్‌ తదితర దేశాల్లో సోషలిజం వేళ్లూనుకుంది. అమెరికాకు ఆమడదూరంలో ఉన్న క్యూబా సోవియట్‌ కన్నా బలహీన దేశం అయినప్పటికీ సామ్రాజ్యవాదాన్ని సవాలు చేసి నిలదొక్కుంది. అది నిలబడటమే కాదు నేడు లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలకు మార్గదర్శిగా, స్పూర్తిప్రదాతగా కూడా ఉంది. వెనిజులాతో ఆరంభమైన వామపక్షజ్వాల అనేక దేశాలకు విస్తరిస్తోంది. మన పక్కనే ఉన్న నేపాల్‌లో కమ్యూనిస్టులు ప్రధాన శక్తిగా ఉన్నారు.

సోవియట్‌ యూనియన్‌ పతనమయింది, సోషలిజం బలహీనపడింది అయినా ఇంకా ఏముందని అక్టోబర్‌ విప్లవాన్ని గురించి చెప్పుకొని మురిసి పోవడానికి అని అనుకునేవారు లేకపోలేదు. 'సత్యమే శివం' అనే సినిమాలో కథానాయకుడుగా ఉన్న ఒక కార్మికనాయకుడికి, అనుకోకుండా అతనికి తటస్థపడిన ఒక హైటెక్‌ యంగ్‌హీరోకి మధ్య జరిగిన సంభాషణ ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతమనిపించుకోదు. సోషలిజం ఔన్యత్యాన్ని గురించి చెప్పిన కార్మికనాయకుని మాటలను ఎద్దేవా చేస్తూ ఇంకెక్కడ సోషలిజమయ్యా ఎర్రిబాగులోడి విలాగున్నావంటాడు. తాజ్‌మహల్‌ కూలిపోతే ప్రేమ అంతమవుతుందా? అని కార్మికనాయకుడు ప్రశ్నిస్తాడు. అదెట్లాగు? అంటూ తిరస్కరిస్తాడు యంగ్‌హీరో. అంతే సోషలిజం కూడా. సోవియట్‌ కూలిపోయినంతమాత్రాన సోషలిజం అంతం కాదని అతని వాదనను తిప్పికొడతాడు కార్మికనాయకుడు. సినిమాలో వాదనకోసం వినిపించిన డైలాగులే అయినా దీని వెనుక తిరస్కరించడానికి వీల్లేని సత్యముంది. సోవియట్‌యూనియన్‌ పతనంతో సోషలిజం దెబ్బతినిపోలేదని ప్రస్తుత ప్రపంచ పరిణామాలు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.
పెట్టుబడిదారీ వ్యవస్థ పతనం నుండి సోషలిజం పుట్టుకొస్తుందని 19వ శతాబ్దం ఆఖరులో మార్క్స్‌ చెప్పాడు. 20వ శతాబ్దం ఆరంభంలో మారిన నూతన పరిస్థితులను సమీక్షించిన లెనిన్‌ పెట్టుబడి మరోదశకు చేరుకొని గుత్తపెట్టుబడిదారీవిధానంగా మారిన వైనాన్ని వివరించాడు. దాన్నే సామ్రాజ్యవాదదశ అన్నాడు. ఈ దశలో లింకు ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ విప్లవం వస్తుందని, విధిగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లోనే విప్లవం రావాలని ఏమీ లేదని విశ్లేషిస్తాడు. ఆ లింకు రష్యాలో బలహీనంగా ఉందని చెప్పిన లెనిన్‌ మొదటి ప్రపంచయుద్దకాలంలో కార్మిక,కర్షకుల్ని ఒక్కటిగా చేసి వారికి సైనికుల అండ సంపాదించి రష్యాలో విప్లవాన్ని జయప్రదం చేసి చూపించాడు. దాన్నే మనం అక్టోబర్‌ మహావిప్లవంగా పిలుస్తున్నాం. 1917 నవంబర్‌ 7 చరిత్ర ఎర్రసిరాతో లిఖించిన నూతన అధ్యాయం. అప్పటివరకు విప్లవాలన్నీ దోపిడీ చేసే వర్గం స్థానంలో మరో దోపిడీ వర్గం నాయకత్వంలో వచ్చినవే. కాని సోవియట్‌ విప్లవం వాటికి పూర్తిగా భిన్నమైంది. దోపిడీకి గురయ్యే కార్మికవర్గం నాయకత్వంలో వచ్చిన శ్రామికవిప్లవమది. దోపిడీ లేని సమసమాజాన్ని ఆవిష్కరించిన విప్లవమది. దాన్ని పురిట్లోనే గొంతు పిసికి చంపాలని ప్రపంచంలోని అన్నిరకాల దోపిడీశక్తులన్నీ ఏకమయ్యాయి. రష్యాలోని విప్లవప్రతీఘాత శక్తులకు ఆయుధ, ధన, మిలటరీ సహాయం చేశాయి. అయినా కార్మిక, కర్షకబలం, లెనిన్‌ వ్యూహరచన, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం ముందు అవి పటాపంచలయ్యాయి. ఆ రాజ్యం 1989 వరకు అంటే 70 ఏండ్లపాటు మనగలిగింది. ఈలోగా
ప్రపంచపటం స్వరూపస్వభావాలే మారిపోయాయి. రెండో ప్రపంచయుద్దంలో సోవియట్‌యూనియన్‌కు అగ్నిపరీక్ష ఎదురైంది. స్టాలిన్‌ సారథ్యంలో రెండు కోట్లమంది సోవియట్‌పౌరులు ప్రాణత్యాగం చేసి సోవియట్‌ను కాపాడుకున్నారు. ఫాసిజం మట్టికరిచింది. సోషలిజం విస్తరించింది. ఈ విజయానంతరం చైనా, వియత్నాం, క్యూబా వంటి అనేక దేశాల్లో విప్లవాలు జయప్రదమయ్యాయి. ఇండియా లాంటి అనేకదేశాలు స్వాతంత్య్రం సంపాదించుకొని సామ్రాజ్యవాద సంకెళ్ల నుండి బంధవిముక్తమయ్యాయి. రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం కూకటివేళ్లతో కూలిపోయింది. దాని స్థానంలో అమెరికా నూతనశక్తిగా ఎదిగివచ్చింది. అప్పటినుండి సోషలిజానికి, సామ్రాజ్యవాదానికి మధ్య వైరుధ్యం కేంద్రవైరుధ్యంగా ప్రపంచరాజకీయాలు సాగాయి. ఈపోరులో తాత్కాలికంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదం పైచేయి సాధించింది.
పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంకా అవసానదశకు చేరుకోని మాట యదార్థమే. కాని రోగాలకు, రొష్టుల కు అతీతంగా లేదు. పెట్టుబడిదారీ విధానానికి మూలమైన సంపద కేంద్రీకరణ, ఆర్థిక అసమానతలు, సంక్షోభాలు, యుద్ధాలు (ఏ రూపంలోనైనా) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెసు (ఏఐసిసి) సమావేశాల్లో ఆ పార్టీ ప్రధానకార్యదర్శి మాట్లాడుతూ సంస్కరణలనంతరం కూడా పేద, ధనిక తేడాలు పెరిగిపోతూనే ఉన్నాయని, నేడు రెండు భారతదేశాలున్నాయని వాపోయాడు. ఒకటి ఉన్నవారిది. మరోటి లేనివారిదని విశ్లేషించాడు. ఇది కంటికి కనిపించే కాదనలేని నగసత్యం. ఒక వాస్తవాన్ని ఒప్పుకున్నంతమాత్రానే సరిపోదు. దానికి కారణాలు తెలుసుకోవాలి. రాహుల్‌గాంధీ అక్కడే విఫలమయ్యాడు. ఎందుకంటే సత్యాన్ని ఒప్పుకోవడం ఆయనకు ఇష్టం లేదు. దీనికి మూలం వారు సృష్టించిన వ్యవస్థలోను, దాన్ని అభివృద్ది చేసిన సంస్కరణల్లోనే ఉంది. సంపన్నులకు లాభం చేకూరాలంటే సంస్కరణలు కావాలి. ఆ సంపద వారికి సామాన్యజనం జేబులు కొడితే వచ్చి చేరింది. ఆ దోపిడీదారుల అండతోనే కాంగ్రెసు బతుకుతోంది. అం దుకే దొంగే దొంగ...దొంగ అని అరిచినట్లు అసమానతల గురించి కాంగ్రెసే మాట్లాడితే ప్రత్యామ్నాయ వాదానికి స్థానం లేకుండా చేయొచ్చన్నది వారి ఆలోచన. ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఎత్తుగడే. వారి నుండే రాహుల్‌గాంధీ ఈ సిద్ధాంతాన్ని అరువు తెచ్చుకున్నాడు.
సోవియట్‌ యూనియన్‌ కూలిపోయాక సామ్రాజ్యవాదులకు, వారి తైనాతీలైన ప్రపంచపెట్టుబడిదారులకు ఎదురే లేకుండా పోయింది. ఇష్టానుసారం దోచుకున్నారు. ఇష్టం లేనివారిని అణగదొక్కారు. సరికొత్త దోపిడీ పద్ధతులు, ఆధునిక దోపిడీ రూపాలు ప్రవేశపెట్టారు. కార్మికవర్గాన్ని కకావికలం చేశారు. వారి నాయకత్వాన్ని బలహీనపరిచారు. ప్రజా ఉద్యమాలను చెల్లాచెదురు చేయగలిగారు. అదే ప్రస్తుతం వారి బలం కూడా. ఈ ఇరవై ఏండ్లలో ఫైనాన్స్‌ పెట్టుబడి ఏలుబడిలోకి ప్రపంచం వెళ్లిపోయింది. ఈ ఫైనాన్స్‌ పెట్టుబడి లెనిన్‌ చెప్పిన ఫైనాన్స్‌పెట్టుబడికి భిన్నమైన రూపం. ఇది ఒకచోట నుండి మరోచోటికి వెళ్లడమే కాదు. స్థానికపెట్టుబడులతో మమేకమైపోతోంది. వాస్తవిక విలువ పెరగని పారిశ్రామికేతర రంగాల్లో (సర్వీసురంగం) స్పెక్యులేషన్‌తో విస్తరిస్తోంది. నిలకడగా ఒకచోట ఉండదు. ఒకరిచేతుల్లోనే ఉండదు. దొరికింది దొరికినట్లుగా ఆరగిస్తూ పొట్టలు పెంచుకుంటూ పోతుంది. వెయ్యితలల విషపునాగులాగా పెనవేసుకుపోతోంది. అది స్టాక్‌మార్కెట్‌ రూపంలో ఉండొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ రూపంలో విస్తరించొచ్చు. మైక్రోఫైనాన్స్‌ రూపంలో వామనావతారం ఎత్తొచ్చు. పబ్లిక్‌-ప్రైవేటు (పిపిపి) పార్ట్‌నర్‌షిప్‌ రూపంలో విద్య, వైద్య, ప్రాథమికసౌకర్యాల రంగంలో దూసుకుపోవచ్చు. ఆఖరికి దేశరక్షణ రంగంలోనూ ప్రవేశించవచ్చు. ఒక కంపెనీ అనేక కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది. ఒక వ్యక్తి అనేక కంపెనీల్లో డైరక్టర్‌గా ఉంటాడు. ఇలా ప్రపంచమంతా కార్పోరేట్‌ నెట్‌వర్క్‌ విస్తరిస్తోంది. అలా పెరిగిపెరిగి ఏదోఒకరోజు పగిలిపోతుంది. అది ఎలా ఎక్కడ పగులుతుందో ఇప్పుడే మనం చెప్పలేకపోవచ్చు. అది ఒకచోట పగలవచ్చు లేదా ఒకేసారి అనేకచోట్ల పగలవచ్చు. కాని దాని పెరుగుదలలోని బలహీనతలు ఇప్పుడిప్పుడే లోకానికి వెల్లడవుతున్నాయి. పెట్టుబడిదారులకు దడ పుట్టిస్తున్నాయి. 2008లో ఆరంభమైన ప్రపంచ సంక్షోభం అదిగో ముగిసిపోతుంది ఇదిగో అయిపోయిందని చప్పట్లు చరుస్తున్నా అది ముదురుతున్నదే తప్ప నయం కావడం లేదు. పెట్టుబడిదారీ అభివృద్ది మందగించి పోతోంది. అమెరికా పెత్తందారీకోరలు మొద్దుబారుతున్నాయి. దాని ఆధిపత్యధోరణికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎదిగొస్తున్న దేశాలు బలం పుంజుకుంటున్నాయి. యూరోపును సమ్మెల వెల్లువ ఆవహించింది. ప్రపంచం ఏకధృవ ప్రపంచం నుండి బహుళధృవ ప్రపంచం దిశగా అడుగులేస్తోంది. కొత్త అధికార కేంద్రాలు తయారవుతున్నాయి. రాబోయేకాలానికి ఆసియా కేంద్రం కావచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ మార్క్సిస్టు మౌలికసూత్రాలను బలపరుస్తున్నవే తప్ప భిన్నమైనవి కావు.
కమ్యూనిజం ప్రపంచానికంతా సరిపోవచ్చునేమోగానీ మనకు మాత్రం సరిపోదనే వాదనలు కొత్తవేమీకాదు. దీన్ని కాంగ్రెసువాళ్లు ఒక రకంగా ప్రచారం చేస్తే బిజేపీ,ఆర్‌యస్‌యస్‌లు మరో రకంగా ప్రచారం చేశాయి. మనది అహింసాయుతదేశం. కమ్యూనిజం హింసాత్మకమైందని కాంగ్రెసు వాదన. సోషలిజంలో ప్రజాస్వామ్యం ఉండదని మరో వాదన. ఈ రెండూ తప్పుడు వాదనలే. హింసాయుత లేదా అహింసాయుత అనేది విప్లవాలు నడిపేవారిపై ఆధారపడి లేవు. వాటిని అణచేయాలనుకునేవారిపై ఆధారపడి ఉంటాయి. విద్యుత్‌చార్జీలు తగ్గించాలన్న యువకిశోరాలపై, ఇంటికి జాగా కావాలని అడిగిన పేదలపై కాల్పులు జరిపింది ఈ 'అహింసాయుత' ప్రభుత్వమే. ధర్నా, పికెటింగులు ధర్మమేనన్న గాంధీ పుట్టిన దేశంలో ధర్నాలు, పికెటింగులపైనే పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. సోషలిజంలో ప్రజాస్వామ్యం లేదంటున్న మన్మోహన్‌సింగు లాంటి నాయకులు ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి సంపన్నులకు పెద్దపీట వేస్తున్నారు. 'నో ఫ్రీ లంచెస్‌' అనే పేరుతో పేదలకిచ్చే సబ్సిడీలపై కోతపెట్టి బడా పారిశ్రామికవేత్తలకు లంచ్‌, డిన్నర్‌తో సహా అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. 28శాతం ఓట్లతో అధికారం వెలగబెడుతున్న కేంద్ర కాంగ్రెసు సర్కార్‌ తనకు మెజారిటీ ప్రజల మద్దతున్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా ఉండాల్సిన మీడియా కార్పోరేట్‌వర్గాల చేతుల్లో బందీగా మారి వారి సేవలో తరిస్తోంది. తిమ్మిని బమ్మిని చేస్తూ ప్రజల అజెండాను హైజాక్‌ చేస్తోంది. మార్క్సిజం విదేశీ సిద్దాంతమంటూ అది మన దేశానికి సరిపడదని ప్రచారం చేసే ఈ మీడియా విదేశాల నుండి అరువుతెచ్చుకున్న ఆర్దిక సంస్కరణలకు రోజూ వంతపాడుతోంది. కమ్యూనిజంపై రోజూ కారాలు మిరియాలు నూరే మరో సంస్థ ఆర్‌యస్‌యస్‌. వీరికి స్పూర్తిప్రదాత హిట్లర్‌. ఇలాంటివారు విదేశీ అంటూ మార్క్సిజంపై దాడి చేస్తుంటారు. తాజాగా హిందూ టెర్రరిజాన్ని ప్రవేశపెట్టిన ఘనత వీరిదే. పాపులను క్షమించమని చెప్పిన క్రైస్తవమున్న దేశాల్లోనే మార్క్సిజం సఫలమయినప్పుడు 'దుష్టులను శిక్షించి, శిష్టులను కాపాడ'మని చెప్పిన హిందూమతం మెజారిటీగా ఉన్న మన దేశంలో వర్గపోరాటానికి స్థానం లేకుండా ఎలా ఉంటుంది. ప్రజలను దోచుకుతినే దుష్టులను శిక్షించమని చెప్పేదే మార్క్సిజం. అయితే ఆ పని శ్రామికప్రజలే చేయాలంటుంది.
భారతదేశంలో వర్గపోరాటం చెల్లదని, ఇక్కడున్న ప్రత్యేక సామాజిక పరిస్థితులలో కులపోరాటం ద్వారానే సమానత్వం సాదించగలమని కొందరు వాదిస్తున్నారు. కమ్యూనిస్టులు కులం ప్రాధాన్యతను గుర్తించడం లేదని అందుకే వెనుకబడుతున్నారని నమ్మించడానికి వీరు ప్రయత్నిస్తుంటారు. సోవియట్‌ పతనం తర్వాత వర్గపోరాటానికి కాలం చెల్లిందని వీరి అభిప్రాయం. వీరి లెక్క ప్రకారం కులాలవారీ జనాన్ని చీలదీసి రాజకీయాలు నడిపే బూర్జువాపార్టీలే సామాజిక విప్లవాన్ని తీసుకొస్తాయి. కమ్యూనిస్టుపార్టీని అగ్రకులాలపార్టీగా ఈ తరహాసంఘాల నాయకులు రోజూ అదే పనిగా నిందిస్తుంటారు. అంబేద్కర్‌ తర్వాత దళితులకు, గిరిజనులకు ఆ మాత్రమైనా హక్కులు నిలబడ్డాయంటే దానికి కారణం కమ్యూనిస్టు ఉద్యమమేనని వీరు మరచిపోతుంటారు. లేదా మరచిపోయినట్లు నటిస్తుంటారు. సంస్కరణల గాలిలో కూడా సంక్షేమ పథకాలు కొనసాగడానికి కమ్యూనిస్టు ఉద్యమమే కారణమన్నది కాదనలేని సత్యం. దళితులు, గిరిజనులు తదితర తరగతుల్లో కమ్యూనిస్టుపార్టీ బలహీనంగా ఉన్నమాట వాస్తవం. వారు రకరకాల కారణాలతో బూర్జువా, భూస్వామ్యపార్టీలను ఆదరిస్తున్నారు. ఆమాటకొస్తే కమ్యూనిస్టుపార్టీ సామాజికంగా వెనుకబడిన తరగతుల్లోనే కాదు దాని పునాదివర్గమైన కార్మికవర్గంలోనూ బలహీనంగానే ఉంది. కులపోరాటం చేయకపోవడం దానికి కారణం కాదు. ఈ సిద్ధాంతబలంతోనే కేరళ, బెంగాల్‌, త్రిపురలల్లో కమ్యూనిస్టు ఉద్యమం బలంగా ఎలా ఎదగగలిగిందో ఇలాంటి మిత్రులు ఆలోచించాలి. ఈ సిద్ధాంతమే మన రాష్ట్రాన్ని 1950లలో శాసించగలిగింది.
సోవియట్‌యూనియన్‌ కూలిపోయినా అక్టోబర్‌ విప్లవం విఫలం కాలేదు. దాని స్పూర్తితో రాజ్యాధికారంలోకి వచ్చిన చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తరకొరియా, లావోస్‌ తదితర దేశాల్లో సోషలిజం వేళ్లూనుకుంది. అమెరికాకు ఆమడదూరంలో ఉన్న క్యూబా సోవియట్‌ కన్నా బలహీన దేశం అయినప్పటికీ సామ్రాజ్యవాదాన్ని సవాలు చేసి నిలదొక్కుంది. అది నిలబడటమే కాదు నేడు లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలకు మార్గదర్శిగా, స్పూర్తిప్రదాతగా కూడా ఉంది. వెనిజులాతో ఆరంభమైన వామపక్షజ్వాల అనేక దేశాలకు విస్తరిస్తోంది. మన పక్కనే ఉన్న నేపాల్‌లో కమ్యూనిస్టులు ప్రధాన శక్తిగా ఉన్నారు.
ఓటములు శాశ్వతం కాదు. అవి విజయాలకు సోపానాలు. ఒక మనిషి రోడ్డుమీద నడుస్తూ ప్రమాదవశాత్తూ మరణిస్తే మొత్తం మానవజాతే మరణించినట్లు భావిస్తే అది వైరాగ్యమన్నా కావాలి లేదా మనోవికారమన్నా కావాలి. ప్రస్తుత కమ్యూనిస్టు వ్యతిరేకులు ఈ రెండో కోవకు చెందుతారు. అత్యంత అభ్యుదయకరవర్గమైన కార్మికవర్గం అనేక ఓటములు ఎదుర్కొంటూనే పురోగమిస్తోంది. పారిస్‌కమ్యూన్‌ మొదలు 1905 రష్యన్‌ విప్లవ ఓటమి వరకు ఏదీ అక్టోబర్‌ విప్లవ విజయాన్ని నిరోధించలేకపోయాయి. మన దేశానికి స్వాతంత్య్రం రాకుండా 1857 ప్రథమస్వాతంత్య్ర సంగ్రామ ఓటమి ఆపలేకపోయింది. కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదిలోనే అంతం చేయాలని నాటి పాలకులు ప్రయత్నించారు. ఎన్నెన్నో కుట్రకేసులు పెట్టారు. తెలంగాణా సాయుధ పోరాటాన్ని క్రూరంగా అణచివేశారు. అయినా కమ్యూనిస్టుపార్టీ దేశంలో అత్యంత ప్రభావితశక్తిగానే ఉంది. శ్రామికవర్గం ఉన్నంత కాలం కమ్యూనిజం అజేయం. అక్టోబర్‌ విప్లవం చిరస్థాయిగా నిలుస్తుంది.

 

0 comments: