మీ దేశమే మా దుకాణం

  • అందుకే సుంకాలు, అడ్డంకులు తొలగించాలి
  • ఒబామా ప్రకటన
  • 44 వేల కోట్ల డాలర్ల వాణిజ్య 'బంధం'
భారత్‌ తమకు భవిష్యత్‌ మార్కెట్‌ అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చెప్పారు. ఇక్కడ సుంకాలు, ఇతర అడ్డంకులను తొలగిస్తే పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ దేశంలో 50 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు వీలుగా భారత్‌ను 44 వేల కోట్ల డాలర్ల విలువైన వాణిజ్య
ఒప్పందాలలో ఇరికించారు. ఈ మేరకు పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ఒబామా ప్రకటించారు. శనివారం ఇక్కడ భారత్‌-అమెరికా వాణిజ్య మండలి (యుఎస్‌ఐబిసి) ఏర్పాటు చేసిన కార్పొరేట్‌ దిగ్గజాల సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ దేశంతో వాణిజ్యంలో ప్రస్తుతం 12 స్థానంలో ఉన్న భారత్‌ను అగ్రస్థానానికి చేర్చడమే తన ప్రస్తుత పర్యటన లక్ష్యమన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం 21వ శతాబ్దంలో భాగస్వామ్యాన్ని నిర్వచించే ఒప్పందాలలో ఒకటిగా మిగిలిపోతుందని తాను భావిస్తున్నానన్నారు. తన పర్యటనలో పలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు, బోయింగ్‌ సంస్థ కొన్ని డజన్ల విమానాలను, జనరల్‌ ఎలక్ట్రిక్‌ (జిఇ) సంస్థ వందల కొద్ది విద్యుత్‌ ఇంజన్లను భారత్‌కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భారత్‌తో తాము కుదుర్చుకోబోయే మొత్తం 44 వేల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాల ద్వారా తమ దేశంలో 50 వేల ఉద్యోగావకాశాలు కల్పించగలమన్నారు.


వాణిజ్య మండలి భేటీలో ఒబామా ప్రసంగానికి ముందు రిలయన్స్‌ పవర్‌ సంస్థ తాము జిఇ సంస్థ నుంచి 2,400 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లను, స్పైస్‌ జెట్‌ సంస్థ తాము బోయింగ్‌ సంస్థ నుంచి 33 కొత్త తరం 737 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రకటనలను అభినందించిన ఒబామా ఎగుమతి నిబంధనలను సడలించడం ద్వారా డిఆర్‌డిఒ, ఇస్రో వంటి భారత సంస్థలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తామన్నారు.
భారత్‌, అమెరికా వాణిజ్య వేత్తలతో చర్చలు
ఒబామా శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన కార్పొరేట్‌ సంస్థల అధినేతలతో భేటీ అయ్యారు. ఫార్మా, వస్తూత్పత్తి, రవాణా, విద్యుత్‌ వంటి కీలక రంగాలలోని వారితో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల్లో ఒబామాతో పాటు అమెరికా వాణిజ్య మంత్రి గ్యారీలోకే, ఇతర ఉన్నతాధికారులు, అమెరికా వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. భారత్‌ తరపున మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ వైస్‌ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, పిరమిల్‌ ఫార్మా గ్రూప్‌ అధినేత అజరు పిరమిల్‌, తదితర వాణిజ్యవేత్తలు పాల్గొన్న ఈ చర్చల్లో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడుల వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మహీంద్రా సంస్థ రూపొందించిన విద్యుత్‌ కారు రేవా, వారి అమెరికా భాగస్వామ్య సంస్థ కర్టిస్‌ ఈ భేటీలో ప్రత్యేక ఆసక్తిని కల్గించాయి. మహీంద్రా రేవా, కర్టిస్‌ సంస్థలు తమ భాగస్వామ్యం ద్వారా భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహిత వాహనాలను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంలో ప్రగతిని సాధించాయని పారిశ్రామికవేత్తలతో ఒబామా భేటీకి ముందు వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

 

0 comments: