ఒబామా పర్యటనపై పెల్లుబికిన నిరసన

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దేశ పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌నరసింగరావు, ఎంఎ గఫూర్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఒబామా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వ్యవసాయం, విద్య, చిల్లర
వ్యాపార రంగాలను బహుళజాతి సంస్థలకు తాకట్టు పెట్టొద్దంటూ నినదించారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకారులు కోరారు.హైదరాబాదులో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. బస్‌భవన్‌ నుంచి ఆర్టీసి క్రాస్‌రోడ్డు వరకూ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆర్‌ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శులు బివి రాఘవులు, కె నారాయణ, మురళీదేశ్‌ పాండే, జానకిరాములు ప్రసంగించారు. చార్మినార్‌, చందానగర్‌, బాలానగర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో, రాజేంద్రనగర్‌ చౌరస్తాలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఒబామా దిష్టిబొమ్మను దహనం చేశారు. నర్సపూర్‌ చౌరాస్తాలో నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


వరంగల్‌ జిల్లాలో ఒబామా పర్యటనను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. వరంగల్‌ రైల్వే స్టేషను నుంచి పోచమ్మ మైదాన్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి నాగయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు టి వెంకట్రాములు మాట్లాడారు. నర్సంపేట, మహబూబాబాద్‌, హసన్‌పర్తి, మడికొండ, భూపాలపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో ఒబామా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నల్గొండ జిల్లాలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం క్లాక్‌టవర్‌ సెంటర్లో ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, సిపిఎం సీనియర్‌ నాయకులు పెన్నా అనంతరామ శర్మ మాట్లాడారు. కోదాడలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మురళీకృష్ణ, వెంకట్‌ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేటలో సిపిఎం ఆధ్వర్యంలో ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఖమ్మంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు పోతినేని సుదర్శనరావు, బాగం హేమంతరావు పాల్గొన్నారు. సత్తుపల్లి, మధిర, తిరుమలాయపాలెం, కారేపల్ల్లిల్లో ప్రదర్శనలు జరిగాయి.

కర్నూలులో ప్రదర్శన నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌, జిల్లా కార్యదర్శి టి షడ్రక్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి కె రామాంజనేయులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో నిరసన ప్రదర్శన జరిపి అంబేద్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌ మాట్లాడారు. అన్ని డివిజను కేంద్రాల్లోనూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతపురంలో విడివిడిగా సప్తగిరి సర్కిల్‌లో దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. గార్లదిన్నెతోపాటు పటుచోట్ల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
శ్రీకాకుళం, విశాఖజిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించారు. శ్రీకాకుళం తహసీల్దారు కార్యాలయం నుంచి డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి చౌదరి తేజేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర సుందర్‌లాల్‌ ప్రసంగించారు. విశాఖలో జగదాంబ జంక్షన్‌ నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం జరిగిన సభలో సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు సిహెచ్‌ నర్సింగరావు, జెవి సత్యనారాయణమూర్తి, నగర కార్యదర్శులు బి.గంగారావు, ఎజె స్టాలిన్‌ తదితరులు ప్రసంగించారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురంలో ఉభయపార్టీల ఆధ్వర్యాన నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాజమండ్రిలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం, ఒంగోలుల్లో ఒబామా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. యర్రగొండపాలెంలో నల్ల రిబ్బన్లు పెట్టుకుని నిరసన తెలిపారు. పర్చూరు, అద్దంకిలో ప్రదర్శనలు నిర్వహించారు. కందుకూరు, గిద్దలూరు, కనిగిరి, దర్శి, సంతనూతలపాడు, చీమకుర్తి, కొండపిల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌లోనూ, తెనాలిలోనూ ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, తిరువూరు, నూజివీడు, మైలవరం, నందిగామ, మచిలీపట్నం ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ఒబామా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేశారు. నిర్మల్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్‌, ఉట్నూరులో రాస్తారోకో చేసి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. నిజామాబాద్‌తో పాటు ఆర్మూరు పట్టణంలోనూ ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కరీంనగర్‌ బస్టాండు చౌరస్తా వద్ద ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి ముకుందరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రదర్శన నిర్వహించి, ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు పెనుమల్లి మధు పాల్గొన్నారు. వికారాబాద్‌, తాండూరులో దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మేడ్చెల్‌, పూడూరు, యాలాల, కందుకూరు, మొయినాబాద్‌ తదితర మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం ప్రధాన రహదారిపై ఒబామా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నర్సాపూర్‌, పటాన్‌చెరు, జహీరాబాద్‌, మెదక్‌, సిద్దిపేటల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

 

0 comments: