మరో ఐరోపా వ్యాపిత ఆందోళనకు సన్నద్ధం
పొదుపు పేరుతో సంక్షేమ పథకాలకు కోతపెడుతున్న ఐరోపా యూనియన్ చర్యలకు నిరసనగా సెప్టెంబరు 29న ఐరోపా కార్యాచరణ దినాన్ని కార్మికులు పాటించారు. దాని కొనసాగింపుగా వచ్చే నెల 15న మరో రూపంలో ఐరోపా అంతటా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ఐరోపా ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్(ఇటియుసి) నిర్ణయించింది. అమెరికా నుంచి ఐరోపాకు పాకిన సంక్షోభం కారణంగా ఇప్పటికే 50లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి. రానున్న కొద్ది సంవత్సరాలలో ప్రత్యక్షంగా ప్రభుత్వ రంగంలో మరో పది లక్షల ఉద్యోగాలు ఊడబోతున్నాయి. ఈ పరిణామం పర్యవసానంగా పరోక్షంగా కనీసం మరో 15-20లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా. ఈ పరిణామాల ప్రతికూల ఫలితాల కారణంగా పోయే ఉద్యోగాలు వీటికి అదనం. వచ్చే ఏడాది జర్మనీలో 2-5శాతం మధ్య ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కోతపడనున్నాయి. గరిష్టంగా 25శాతం వరకు వివిధ దేశాలలో ప్రతిపాదించారు. లాత్వియాలో 50శాతం వరకు కోత ప్రతిపాదనలతో అన్ని రికార్డులను తలదన్ననుంది. ఉరుమిఉరిమి మంగలం మీద పడ్డట్లు నిరుద్యోగులను కూడా వదలటం లేదు. డెన్మార్కులో నిరుద్యోగభృతి మంజూరును 4 నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. అంటే నిరుద్యోగభృతి హక్కుకు ఆచరణలో మంగళం పాడినట్లే. స్వీడన్‌లో ఇప్పటివరకు నిరుద్యోగులుగా ఉంటే దాన్ని బట్టి పౌరసేవలకు ఫీజులుండేవి. ఇప్పుడు లబ్ధితక్కువ, ఫీజులెక్కువ విధానాన్ని రూపొందించారు. జర్మనీ, స్విట్జర్లాండ్‌లో దీర్ఘకాల నిరుద్యోగులకిచ్చే రాయితీల కోత, వ్యవధి తగ్గించారు. ఇలా ప్రతి దేశంలో ఏదోఒక పేరుతో నిరుద్యోగుల జీవితాలను దుర్భరం చేయనున్నారు. సంస్కరణల పేరుతో కార్మికుల ఉమ్మడిబేరసారాల హక్కులను నీరుగార్చుతున్నారు.
జర్మనీలో లోహపరిశ్రమల్లో పనిగంటల పెంపుదల, అదనపు గంటలకు వేతన నిరాకరణ వంటి ప్రతిపాదనలతో ముందుకు రాగా కార్మికులు ప్రతిఘటించారు. దాంతో ఏ కంపెనీకి ఆ కంపెనీ యూనియన్లతో ఒప్పందాలు చేసుకుంటూ కార్మికుల నుంచి రాయితీలను డిమాండ్ చేశాయి. ఫలితంగా కొద్ది సంవత్సరాలుగా నిజవేతనాలు పెరగలేదు. కొన్ని దేశాలైతే కనీసవేతనాల స్థంభనకు పాల్పడ్డాయి. గ్రీస్‌లో ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా ఒక కంపెనీలో చేసుకొనే ఒప్పందం ప్రకారం వేతనాలు జాతీయ స్థాయి ఆరంగంలో కుదిరిన ఒప్పందం కంటే తక్కువ ఉండరాదు. ఇప్పుడు ఐఎంఎఫ్, ఐరోపాయూనియన్ ఆదేశాల మేరకు ఆ నిబంధనకు స్వస్తి పలికారు. కంపెనీల ఆర్థిక పరిస్థితులు, వైఖరిని బట్టి వ్యక్తిగత కంపెనీలు ఆ రంగంలో జరిగిన ఒప్పందాలను అనుసరించనవసరం లేదని సవరించారు. స్పెయిన్‌లో కూడా అలాంటి వెసులుబాటే కల్పించారు. గ్రీస్‌లో 25 సంవత్సరాల లోపు కార్మికులకు ఒప్పందం ప్రకారం కుదిరిన వేతనాల్లో 84శాతం మాత్రమే చెల్లిస్తారు. ఫ్రాన్స్‌లో కంపెనీ లేదా రంగాల వారీ సంప్రదింపులకు మరింత వ్యవధి ఇచ్చేందుకంటూ కనీసవేతనాల ప్రకటనను వాయిదా వేయవచ్చు. కనీసవేతనాలను ప్రకటించిన తరువాత అంతకు మించి డిమాండ్ చేయకూడదు. ఇలాంటి నిబంధనల వలన ఫ్రాన్స్‌లో రంగాల వారీ ఒప్పందాలు 549 నుంచి 421కి తగ్గిపోయాయి. పోలెండ్‌లో ప్రతి ఏడాది వేతన ఒప్పందాల చర్చలు జరపాల్సిన అవసరం, దిగువస్థాయిలో త్రైపాక్షిక ఒప్పందాల మార్గదర్శకసూత్రాలను రద్దు చేశారు. ఈ పూర్వరంగంలోనే ఐరోపా వ్యాపితంగా కార్మికులు ప్రతిఘటనకు పూనుకున్నారు. బడ్జెట్ క్రమశిక్షణను మరింత కఠినంగా అమలు జరపాలని, సభ్యదేశాల ఆర్థిక విధానాలపై మరింత నిఘావేయాలని, బడ్జెట్ యాజమాన్యం సరిగాలేని దేశాలపై జరిమానా విధించాలని యూరోపియన్ కౌన్సిల్ చేసిన నిర్ణయాలను కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. ఆ కౌన్సిల్ సమావేశాలు వచ్చే ఏడాది మార్చి నెలలో జరగనున్నాయి. ఆ సందర్భంగా మరోసారి నిరసన బుడాపెస్ట్‌లో నిరసన ప్రదర్శనలు జరపాలని ఇటియుసి నిర్ణయించింది.
ప్రస్తుతం ఫ్రాన్స్‌కే పరిమితమైన కార్మిక ఆందోళనలు రానున్న రోజుల్లో బ్రిటన్‌లో కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ సర్కార్ ప్రతిపాదించిన పొదుపు చర్యలు అందుకు పురికొల్పనున్నాయి. నార్‌ఫోక్ కౌంటీ అనేది 46వేల మంది ఓటర్లున్న మున్సిపాలిటీ. నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల కంటే మొత్తం ఓటర్లు ఐదువేలు తగ్గారు. ఇక్కడ 155 మిలియన్ పౌండ్ల మేరకు పొదుపు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. అందుకుగాను 3000 ఉద్యోగాల రద్దు, ప్రమాదాలు, రోగాలపాలైన వారికి చేసే ఖర్చులో ఏడాదికి 6మిలియన్ల కోత, వృద్ధాశ్రమాలలో పనిచేసే సిబ్బందిలో 1300 మంది తొలగింపు, పగటిపూట వృద్ధాశ్రమాల మూత వంటివి ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా డిసెంబరు నాలుగున అక్కడి పౌరులు ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులను మానుకుంటే ఎలాంటి కోతలు విధించనవసరం లేదని వారు పేర్కొన్నారు. లండన్ భూగర్భ రైల్వేలో 1800 ఉద్యోగాలను రద్దు చేయాలన్న యాజమాన్య ప్రతిపాదనకు నిరసనగా పదివేల మంది కార్మికులు మూడవసారి 24గంటల పాటు సిబ్బంది సమ్మె చేశారు. ఖర్చుతగ్గింపు చర్యల్లో భాగంగా మెట్రోరైలు టిక్కెట్ల జారీ వేళలను సవరించి మొత్తం 7,500 పనిగంటలను తగ్గించింది. నిర్వహణాసిబ్బందిని కుదించింది. ఈ చర్యలకు ప్రతిఘటన ఎదురౌతుందనే ముందుచూపుతో యాజమాన్యం సమ్మె విచ్ఛిన్నానికి గాను డ్రైవర్లు కాని ఇతర సిబ్బందికిి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పిస్తోంది. దీంతో ఓవర్‌టైమ్ చేయరాదని, నిబంధనల మేరకే పనిచేయాలని కార్మిక యూనియన్ నిర్ణయించింది.
లండన్‌లోని అగ్నిమాపక సిబ్బంది రాత్రిపూట షిప్టు ఎత్తివేసే కొత్త పని విధానాన్ని అంగీకరించకపోతే మొత్తం 5,500 మంది సిబ్బందినీ తొలగించి ప్రయివేటు సంస్థకు ఆ బాధ్యతను అప్పగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తోంది. శిక్షణలేని సిబ్బందితో పనిచేసే ప్రయివేటు కంపెనీలను రంగంలోకి దించటంతో రెండురోజుల సమ్మెకు అగ్నిమాపక సిబ్బంది యూనియన్ పిలుపునిచ్చింది. అగ్నిమాపక విభాగంలో మూడు షిప్టుల డ్యూటీ విధానాన్ని అవకాశంగా తీసుకొని కార్మికులు రెండు ఉద్యోగాలు చేస్తున్నారంటూ మీడియా సిబ్బందికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. పశ్చిమ దేశాలలో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగంతో పాటు పాక్షిక ఉద్యోగాలు చేయటం మామూలు విషయమే.అగ్నిమాపక సిబ్బంది మాదిరిగానే తమ పెన్షన్లలో కోతకు వ్యతిరేకంగా బిబిసి సిబ్బంది కూడా రెండురోజుల సమ్మెకు పిలుపిచ్చారు. ప్రభుత్వం బిబిసిని ప్రయివేటీకరించేందుకు, దానిని ప్రపంచ మీడియా సామ్రాట్ రూపర్ట్‌మర్డోక్‌కు కట్టబెట్టేందుకు ఆలోచిస్తున్నది. తాము టీవీ ఛానళ్ల లైసెన్సు ఫీజు పెంచటం లేదని ఇదే సమయంలో బిబిసికి ఎలాంటి నిధులు మంజూరు చేసేది లేదని ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రకటించారు.కావాలంటే బిబిసి వరల్డ్ సర్వీసులో మాదిరి కోతలు విధించుకొని సర్దుకోవాలని సలహాయిచ్చారు. కొత్తగా చేరే సిబ్బందికి చివరినెల వేతన ప్రాతిపదికన పెన్షన్ చెల్లింపును బిబిసి వదిలించుకుంది. అదే విధంగా పాతవారికి ఏడాదికి వేతనంలో ఒక శాతం మాత్రమే పెన్షన్‌గా చెల్లించాలని నిర్ణయించింది. గతంలో లాభాలు వచ్చినపుడు 'వాటాచెల్లింపుల సెలవు' తీసుకున్న యాజమాన్యం ఇప్పుడు పెన్షన్‌కోతకు పూనుకుంది. బ్రిటన్‌లో ఈ ఆందోళనలు కేవలం ప్రారంభం మాత్రమే. టోరీ సర్కార్ తన పొదుపు చర్యలను పూర్తిగా అమలు జరిపితే ప్రతిఘటన కూడా అదే స్థాయిలో ఉంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment